గడ్డాఫీకి ఆశ్రయం ఇవ్వడానికి మేం రెడీ -ఉగాండా


Uganda in Africa

ఆఫ్రికా ఖండంలో ఉగాండా

గడ్డాఫీ కోరితే ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉగాండా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆల్-అరేబియా టీవి చానెల్ ఉగాండా ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ బుధవారం ప్రకటించింది. అయితే పూర్తి వివరాలను ఛానెల్ తెలపలేదు. మంగళవారం లండన్ లో పశ్చిమ దేశాలతో పాటు కొన్ని అరబ్ దేశాలు సమావేశమై లిబియా భవిష్యత్తు పై చర్చించాయి. లిబియాలో ఘర్షణలను ముగించడానికి వీలుగా గడాఫీ వెంటనే వేరే దేశంలో ఆశ్రయం కోరవచ్చునని మంగళవారం సమావేశం అనంతరం ఆ దేశాలు ఉమ్మడిగా ప్రకటించాయి.

ఆఫ్రికా దేశాలన్ని కలిసి ఆఫ్రికన్ యూనియన్ ను ఏర్పరచుకోవడం వెనుక గడ్డాఫీ కృషి ఉంది. ఆఫ్రికన్ యూనియన్ కి నేతృత్వం వహిస్తున్న తాత్కాలిక కమిటీలో ఉగండా సభ్యురాలు. లిబియా పౌరులను గడ్డాఫీ బలగాల వైమానిక దాడులను రక్షించే పేరుతో లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి  ఐక్యరాజ్య సమితిలో పశ్చిమ దేశాలు ఓ తీర్మానాన్ని ఆమోదింపజేసుకున్న విషయం విదితమే. ఈ తీర్మానం ఆమోదించినప్పటినుండీ లిబియా ఘర్షణలకు పరిష్కారం వెతకడానికి ఉగాండా ప్రయత్నిస్తోంది. గడ్డాఫీ, అతని కుటుంబం కావాలనుకుంటే వేరే దేశంలో ఆశ్రయం పొందడానికి అవకాశం ఇస్తున్నట్లు లండన్ సమావేశం అనంతరం పశ్చిమ దేశాలు ప్రకటించాయి. అయితే ఈ అవకాశాన్ని గడ్డాఫీ వెంటనే వినియోగించుకోవాలని అవి షరతు విధించాయి. దీనిపై గడ్డాఫీ స్పందన తెలియరాలేదు.

సబ్-స;హారా ఆఫ్రికా దేశాలకు ఆర్ధిక సాయం చేయడం ద్వారా గడ్డాఫీ ఆ దేశాలకు దగ్గరయ్యాడు. దానితో పాటు కొన్ని ఆఫ్రికా దేశాల్లొ గడ్డాఫీ మితిమీరి జోక్యం చేసుకున్నాడని కూడా కార్పొరేట్ వార్తా సంస్ధలు రాస్తున్నాయి. అందువలన గడ్డాఫీ పట్ల వ్యతిరేకత కూడా ఆఫ్రికన్ యూనియన్ దేశాల్లో ఉన్నట్లు అవి తెలుపుతున్నాయి. కానీ పశ్చిమ దేశాలు ఎప్పటినుండొ ఆఫ్రికాలో మితిమీరి జోక్యం చేసుకుంటున్న సంగతి ఈ వార్తా సంస్ధలు ఎన్నడూ విశ్లేషించలేదు.

ప్రజాస్వామ్యం కోసం ప్రజలు ఉద్యమిస్తున్న అరబ్ దేశాల్లొ అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు జోక్యం చేసుకుంటూ ప్రజా ఉద్యమాల్లో జొరబడి వాటిని తమకు అనుకూలంగా మలుచుకొవడానికి ప్రయత్నించిన విషయాన్ని ఈ వార్తా సంస్ధలు ఎన్నడూ ప్రస్తావించలేదు. గడ్డాఫీ ఆఫ్రికాలో ఉన్న ఒక దేశానికి ప్రభుత్వాధిపతి. కనుక ఆఫ్రికన్ యూనియన్ దేశాల్లో జోక్యం చేసుకునే అర్హత, హక్కు అతనికి ఉన్నాయి. ఏ హక్కుతో పశ్చిమ దేశాలు ఆఫ్రికా దేశంలొ శతాబ్దాల తరబడి జోక్యం చేసుకుంటూ అక్కడి సహజ వనరుల్ని కొల్లగొట్టాయో ఈ సంస్ధలు ఎన్నదు విశ్లేషించిన పాపాన పోలేదు.

ఉగాండా దేశంలోని టెలికం రంగంలొ లిబియా దేశానికి వాటా ఉంది. ఐక్యరాజ్య సమితి గడ్డాఫీపై ఆంక్షలు విధించడంతో ఈ వాటాను తన నియంత్రణలొకి తెచ్చుకున్నట్లు ఉగాండా ప్రభుత్వం ప్రకటించింది. గడ్డాఫీ అతని కుటుంబం ఆస్తులు స్తంభింపజేయాలని ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానానికి అనుగణంగా ఈ చర్య చేపట్టినట్లు ఉగాండా తెలిపింది.

వ్యాఖ్యానించండి