చైనా, దక్షిణకొరియా, జర్మనీ లను దాటి అమెరికా వరకూ వ్యాపించిన జపాన్ అణుప్రమాద రేడియేషన్


Radiation hit US states

రేడియేషన్ కనుగొన్న అమెరికా రాష్ట్రాలు

జపాన్లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం ప్రపంచంలోని ఇతర దేశాలకూడా పాకింది. వాతావరణం ద్వారా గాలితో వ్యాపించి అమెరికా దాకా చేరుకుంది. ఫుకుషిమా దైచి కర్మాగారం వద్ద రేడియేషన్ తో కూడిన గాలి సహజంగా వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్న గాలి తేలిక పడి వాతావరణంలోని పైపొరలకు చేరుకుని అక్కడ పశ్చిమం నుండి తూర్పుకు వీచే గాలి ద్వారా చైనా వరకూ వ్యాపించింది. అయితే చాలా దూరం ప్రయాణించి రావడం, కొద్ది పరిమాణంలో ఉండే రేడియేషన్ విస్తారమైన వాతావరణంలోకి వ్యాపించడంతో అమెరికా, చైనా తదితర ప్రాంతాల్లొ చాలా చాలా తక్కువ స్ధాయిలో రికార్డయ్యింది. అమెరికా ప్రభుత్వం రక్షిత చర్యలు చేపట్టమని సలహాలేవీ తన ప్రజలకు ఇంకా ఇవ్వలేదు.

సాధారణ ప్రమాదకర రేడియేషన్ స్ధాయికంటే అనేక రెట్లు తక్కువ మాత్రమే అమెరికా వాతావరణంలో రేడియేషన్ రికార్డవుతోందని నెవాడా రాష్ట్ర ఆరోగ్యశాఖలోని రేడియేషన్ ఫిజికిస్టు ఎరిక్ మేటస్ వాల్ స్ట్రీట్ జనరల్ పత్రికకు తెలిపాడు. అయోడిన్-131 పేరుగల రేడియో ఏక్టివ్ మూలకం చాయలు చాలా తక్కువ స్ధాయిలో అమెరికా వాతావరణంలో ఉన్నట్లు ఆయన తెలిపాడు. అణు రియాక్షన్ జరిగే ప్రారంభ క్షణాల్లో ఈ మూలకం కనిపిస్తుందని ఆయన వివరించాడు. దీనికి ఎనిమిది రోజుల సగం జీవితకాలం ఉంటుందని ఆయన తెలిపాడు. అంటే ఆ మూలకంలోని సగం భాగం రేడియేషన్ వలన ఎనిమిదిరోజుల తర్వాత నశిస్తుందనీ, మిగిలిన దానిలో సగం మరో ఎనిమిది రోజులకు, అలా పూర్తిగా నశించేవరకూ ఆ ప్రక్రియ కొనసాగుతుందని ఎరిక్ తెలిపాడు.

ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రంనుండి అయోడిన్-131 క్సీనాన్-133 లాంటి మూలకాల రేడియేషన్ పదార్ధం వాతావరణం పైకి చేరి గంటకు 50 మైళ్ళ వేగంతో పశ్చిమం నుండి తూర్పుకు వీస్తున్న గాలితో కలిసి ప్రయాణించిందని వాతావరణ శాస్త్రజ్గ్నులు చెపుతున్నారు. ఉత్తర అమెరికా పైన వాతావరణం పైపొరలకు చేరుకున్న రేడియేషన్ వర్షపు మేఘాల ద్వారా కిందికి చేరుతుందనీ అదే అమెరికా లోని రేడియేషన్ పరిశీలనా కేంద్రాలవద్ద రికార్డవుతోందని మెటీరియాలజిస్టు జెఫ్ మాస్టర్స్ తెలిపాడు.

సౌత్ కరోలినా రాష్ట్రంలో ఐదు అణు విద్యుత్ కర్మాగారాల వద్ద అయోడిన్-131 మూలక రేడియేషన్ రికార్డయ్యింది. అతి తక్కువగా ఉన్న ఈ రేడియేషన్ ఫుకుషిమా దైచి కర్మాగారం నుండి ప్రయాణించి వచ్చిందేనని అక్కడి అధికారులు ధృవపరిచారు. చెర్నోబిల్ ప్రమాదం సంభవించినప్పుడు తప్ప ఇంతకుముందేన్నడూ అయోడిన్ రేడియేషన్ సౌత్ కరోలినా ప్లాంటుల వద్ద రికార్డు కాలేదని వారు తెలిపారు. నార్త్ కరోలినా రాష్ట్రంలోని ప్లాంటుల వద్దకూడా స్వల్ప స్ధాయి రేడియేషన్ కనుగొన్నట్లు తెలిసింది. వాషింగ్టన్ రాష్ట వాతావరణంలో, మసాచుసెట్స్, పెన్సిల్వేనియా రాష్ట్రాలలోని వర్షపునీటి లోనూ అతి స్వల్ప రేడియేషన్ కనుగొన్నారు. జపాజ్ బయట ఇప్పటివరకు కనుగొన్న రేడియేషన్ అతి స్వల్ప స్ధాయిలోనె రికార్డయ్యింది. అంతేకాకా జపాన్ రాజధాని టోక్యోలో సైతం రేడియేషన్ తగ్గుముఖం పట్టిందని వార్తలు తెలుపుతున్నాయి. దానితో జపాన్ బైట రేడియేషన్ పట్ల ఎవరూ భయభ్రాంతులు కానవసరం లేదని ప్రభుత్వాలు భరోసా ఇచ్చాయి.

వ్యాఖ్యానించండి