పశ్చిమ దేశాల వైమానిక దాడులు లేకుండా లిబియా తిరుగుబాటు బలగాలు ముందుకు కదల్లేక పోతున్నాయి. మంగళవారం లండన్ లో లిబియా విషయమై ప్రపంచ దేశాల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ లోపల సిర్టే పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటు బలగాలపై గడ్డాఫీ బలగాలు భారీగా దాడి చేశాయి. దానితో లిబియా తిరుగుబాటు దారులు సిర్టే పట్టణం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు వదిలేసి తూర్పువైపుకు పలాయనం ప్రారంభించారు. సిర్టే పట్టణ శివార్లలో పట్టణ ప్రజలు గడ్డాఫీ బలగాలతో కలిసి పోరాటంలో పాల్గొంటున్నారని సిర్టేనుండి వెనక్కు వస్తున్న తిరుగుబాటుదారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. గడ్డాఫీని త్యజించాలన్న సంకీర్ణదేశాల పిలుపును లిబియా ప్రజలు తిరస్కరించారని దీనిని బట్టి అర్ధమవుతున్నది. పశ్చిమ దేశాలు ఊహించినట్టుగా లిబియా దాడులు రెండు నెలల్లో ముగిసేటట్టు కనిపించడం లేదు.
లిబియా ప్రభుత్వ బలగాలు, తిరుగుబాటుదారులనుండి ‘నాఫాలియా’ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు బిబిసి, రాయిటర్స్ తెలిపాయి. ఫ్రాన్సు, బ్రిటన్ ల నేతృత్వంలో వైమానిక దాడులు జరిగినంతసేపే తిరుగుబాటు బలగాలు ముందడగు వేస్తున్నాయి. అవి లేనట్లయితే గడ్డాఫీ బలగాలముందు తిరుగుబాటు బలగాలు నిలవలేక పోతున్నాయి. దీనిని బట్టి లిబియా ఘర్షణలు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం జరిగే లండన్ సమావేశంలో నాటో దేశాలతో పాటు కొన్ని అరబ్ దేశాలుకుడా కలుపుకుని మొత్తం 40 కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. తిరుగుబాటు బలగాలు సుశిక్షితులు కానందున అవి సాధించే విజయాలు ఎంత కాలం నిలుస్తాయో చెప్పలేమని పెంటగాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తన దేశ ప్రజలకు వివరణ ఇచ్చుకున్నాడు. లిబియా అధిపతి గడ్డాఫీని పదవీచ్యుతుడిని చేసే ఆలోచనేదీ లేదని దేశ ప్రజలకు తెలిపాడు. లిబియాపై దాడులు త్వరలోనే ముగుస్తాయని నమ్మబలికాడు. గడ్డాఫీని తొలగిస్తే తూర్పున ఆధిపత్యంలో ఉన్న ఆల్-ఖైదా చేతిలోకి ప్రభుత్వం వెళుతుందన్న ఆందోళనలో అమెరికా ఉండడంతో గడ్డాఫీ తొలగింపుకు ఆసక్తిగా లేగా లేదు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లతో పాటు మరో అదనపు భారాన్ని మోసే పరిస్ధితిలో కూడా అమెరికా లేదు. ఇది గడ్డాఫీకి కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ ఫ్రాన్సు, బ్రిటన్లు తిరుగుబాటు ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. లిబియా పై ఉన్న ఆయుద ఆంక్షల కారణంగా తిరుగుబాటుదారులకు ఫ్రాన్సు, బ్రిటన్ లు ఆయుధాలు అందించే అవకాశం కోల్పోయాయి.
ఐక్యరాజ్య సమితిలోని అమెరికా రాయబారి సుసాన్ రైస్, అధ్యక్షుడు ఒబామా అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీకి భిన్నమైన ప్రకటన చేసింది. గడ్డాఫీని తొలగించే ఆలోచన లేడని ఒబామా చెప్పగా సుసార్ రైస్ “తిరుగుబాటు బలగాలకు ఆయుధాలు అందించే అవకాశాలను అమెరికా కొట్టివేయడం లేదని చెప్పింది. అంటే ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షలను అమెరికా ఉల్లంఘిస్తున్నట్లే. మరోవైపు గడ్డాఫీ బలగాలపై దాడులు చేయడం, తిరుగుబాటుదారులకు సాయం చేయడం ఐక్యరాజ్యసమితి తీర్మానానికి వ్యతిరేకమని రష్యా మరో సారి గుర్తు చేసింది. మంగళవారం ఉదయం ఫ్రాన్సు, బ్రిటన్, జర్మనీ, అమెరికా ల దేశాధీశుల మధ్య వీడియో కాన్ఫరెన్సు జరిగింది. దీనిలో లిబియాను పాలించేందుకు గడ్డాఫీ అర్హతను కోల్పోయడనీ, లిబియా ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందనీ ఒక అంగీకారానికి వచ్చాయి.
దీనర్ధం గడ్డాఫీని తొలగించాలని ఆ నాలుగు దేశాలూ ఒక అంగీకారానికి వచ్చాయని. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి ఈ అంగీకారం వ్యతిరేకం. ఇటలీ మరో మధ్యేమార్గ ప్రతిపాదనను సిద్ధం చేసింది. దీని ప్రకారం లిబియానుండి తప్పించుకోవడానికి గడ్డాఫీకి సురక్షితమైన మార్గాన్ని అందించాలి. తద్వారా తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలి. తిరుగుబాటుదారులకూ, గిరిజన తెగల నాయకులకూ మధ్య చర్చలు జరిగే ఏర్పాట్లు చేయాలి. ఇటలీ విదేశీ మంత్రి ఫ్రాంకో ఫ్రాట్టిని ఈ ప్రతిపాదనపై జర్మనీ, ఫ్రాన్సులతో చర్చలు జరిపామని ప్రకటించాడు. చర్చల ఫలితం తెలియరాలేదు. గడ్డాఫీ ప్రతినిధి మంగళవారం నాటి సమావేశం సంక్షోభ పరిష్కారానికి వినియోగపడాలనీ, యుద్ధ పిపాసులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవద్దనీ కోరాడు.
