లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేసే పేరుతో పశ్చిమ దేశాల యుద్ద విమానాలు విచక్షణా రహితంగా చేస్తున్న దాడుల్లొ ఇప్పటికి వందకు పైగా లిబియా పౌరులు మరణించినట్లు లిబియా ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం గడ్డాఫీకి చెందిన భూతల సైనిక దళాలపై దాడులకు అనుమతి ఇవ్వలేదనీ, అయినా పశ్చిమ దేశాలు గడ్డాఫీ సైనికులపై వైమానిక దాడులు చేస్తుండడం ఆమోదనీయం కాదనీ రష్యా విదేశాంగ మంత్రి “సెర్గీ లావరోవ్” రాయిటర్స్ వార్తా సంస్ధతో మట్లాడుతూ అన్నాడు. గడ్డాఫీ బలగాలపై దాడులు చేయడం లిబియా అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవడమేనని లావరోవ్ అన్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం లిబియా ఆపరేషన్ ను నాటో పూర్తిగా తన అదుపులోకి తీసుకుంది. ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అన్ని విధాలుగా అమలు చేస్తామని నాటో సెక్రటరీ జనరల్ ఏండర్స్ ఫాగ్ రాస్ ముస్సేన్ తెలిపాడు.
లిబియాపై దాడుల విషయంలో నాటో సభ్యదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. లిబియా దాడులపై రాజకీయ నియంత్రణ ఎవరి చేతిలో ఉండాలన్న విషయంలొ ఫ్రాన్సు, టర్కీ దేశాల మధ్య విభేదాలు పొడసూపాయని బిబిసి తెలిపింది. లిబియా పౌరులు మరణించకుండా ఆ దేశంపై వైమానిక దాడులు చేయడం ప్రమాదంతో కూడుకున్న పని అని బిబిసి విలేఖరి అభిప్రాయపడ్డాడు. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి సంబంధించిన పూర్తి వివరాలు పత్రికలకు చెప్పలేదని ఆ సంస్ధ తెలిపింది. పశ్చిమ దేశాల దాడుల అండతో తిరుగుబాటు బలగాలు పురోగమిస్తున్నాయి.
మిస్రాటా పట్టణం కోసం పోరు కొనసాగుతోంది. గడ్డాఫీ బలగాలు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పట్టణంలోని పశ్చిమ ప్రాంతంలోకి గడ్డాఫీ బలగాలు చొచ్చుకుపోయాయని తెలుస్తోంది. అయితే, తిరుగుబాటుదారులనుండి స్వాధీనం చేసుకున్న పట్టణాలను గడ్డాఫీ బలగాలు కోల్పోతున్నాయి. పశ్చిమ దేశాల యుద్ద విమానాలు వారం రోజుల నుండి అదేపనిగా దాడులు చేయడంతో గడ్డాఫీ బలగాలను వెనక్కి నెట్టుకుంటూ తిరుగుబాటు బలగాలు పట్టణాలను వశం చేసుకుంటున్నాయి. రాస్ లానుఫ్, బ్రెగా, ఉకేలా, బిజ్ జావాద్ మొదలైన పట్టణాలను తిరుగుబాటు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పౌరుల మరణాలను నివారించడానికి తామే విరమించుకుంటున్నామని గడ్డాఫీ బలగాలు చెబుతున్నాయి.
గడ్డాఫీ జన్మస్ధానం సిర్టే పట్టణం స్వాధీనానికి తిరుగుబాటుదారులు ప్రయత్నిస్తున్నారు. ఒక దశలో సిర్టే తమ వశమయిందని ప్రకటించారు కూడా. అయితే విలేఖరులు సిర్టే ఇంకా గడ్డాఫీ ఆధీనంలో ఉందని తెలిపారు. ట్రిపోలీపై పశ్చీమ దేశాలు అడపా దడపా దాడులు చేస్తూనే ఉన్నాయి. గడ్డాఫీ బలగాలకు చెందిన ఆయుధ గిడ్డంగులు, యుద్ధ విమాన స్ధావరాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని రాజధాని ట్రిపోలిపై దాడులు జరుగుతున్నాయి. నలభై సంవత్సరాలపాటు (చివరి ఐదు సంవత్సరాలు మినహా) తమకు కొరకరాని కొయ్యగా ఉంటూ వచ్చిన గడ్డాఫీ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయాచితంగా వచ్చిన అవకాశాన్ని పశ్చిమ దేశాలు పూర్తిగా వినియోగించుకుంటున్నాయి.
గడ్డాఫీని పదవీచ్యుతుడిని చేసి లిబియా ఆయిల్ వనరులపై ఆధిపత్యం సాధించడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు నడుం బిగించాయి. పైకి మాత్రం గడ్డాఫీనుండి లిబియా పౌరులను రక్షించే సాకు చూపుతున్నాయి. లిబియా తూర్పు ప్రాంతం మొదటినుండి గడ్డాఫీకి వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది. తెగల మధ్య ఉండే వైషమ్యాలే దీనికి కారణం. అదీకాక తిరుగుబాటుదారుల్లో ఒక సెక్షన్ ఆల్-ఖైదాకి మద్దతుదారులుగా తెలుస్తోంది. మరొక సెక్షన్ ఫ్రాన్సు ప్రాపకంలో ఉన్నట్లు వార్తలు తెలుపుతున్నాయి. ఆల్ ఖైదా చేతికి అధికారం అందకుండా ఉత్తరాఫ్రికాపై ఫ్రాన్సు పట్టు పెరగకుండా నిరోధించే ప్రయత్నంలోనే అమెరికా లిబియా దాడులకు నాయకత్వం వహించడానికి తిరస్కరించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటివలి వరకు ఈజిప్టు ఆందోళనలు, ఇప్పుడు లిబియాపై దాడులు అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరగడానికి దోహదపడ్డాయి. క్రూడాయిల్ ధరలు పైపైకి వెళ్తున్నాయి. దీనితో ఇండియా లాంటి చోట్ల సరుకుల ధరలు మరింతగా పెరిగి ద్రవ్యోల్బణం అదుపు చేయడం కష్టంగా మారుతోంది.
