రోజులు గడుస్తున్నకొద్దీ జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు రియాక్టరు వద్ద రేడియేషన్ ప్రభావం, రేడియేషన్ ప్రమాదం, ప్రమాదకర రేడియేషన్ భయాలు పెరుగుతున్నాయి తప్ప ఉపశమించడం లేదు. అణు విద్యుత్ తో పెట్టుకుంటే ఏర్పడే ప్రమాదాలకు విరుగుడు మనిషి చేతిలో లేదని అంతకంతకూ స్పష్టం అవుతోంది. అత్యంత శుభ్రమైనదీ, పర్యావరణ రక్షణకు అత్యంత అనుకూలమైందీ అన్న పేరుతో పశ్చిమ దేశాలు అణు విద్యుత్ కి ఇటీవల కాలంలో ప్రచారం పెంచాయి. పర్యావరణం తర్వాత సంగతి, ముందు మానవాళి మనుగడకు పెనుముప్పు తధ్యం అని జపాన్ అణు ప్రమాదం దాదాపు తేల్చి చెప్పింది. ఫుకుషిమా అణు కర్మాగారం ఆపరేటర్ టేప్కో (టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ) రేడియేషన్ రీడింగ్ తీయడంలో పొరపాట్లు చేస్తుండడం, విషయాలను దాస్తుండడంతో అణు భయాలు మరింత తీవ్రమవుతున్నాయి.
సోమవారం, మార్చి 28 తేదీన మొట్టమొదటి సారిగా ఫుకుషిమా అణు ప్లాంటు బయట రేడియేషన్ తో కలుషితమైన నీటిని కనుగొన్నారు. రెండో రియాక్టరు వద్ద భూమిలోపల రియాక్టరు నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేసిన నీటి పైపులో అధిక స్ధాయిలో రేడియేషన్ కనుగొన్నారు. ఇప్పటి వరకూ రేడియేషన్ అత్యధిక స్ధాయిలో ఉన్న నీరు ప్లాంటులోపల అదీ, రియాక్టరు నిర్మాణంలోనే కనుగొన్నారు. ఆ నీరు ప్లాంటు దాటి బైటికి పోలేదని అంతా నమ్ముతూ వచ్చారు. సోమవారం మొదటిసారిగా ప్లాంటుకు బైట ప్లాంటుకు లోపలి భాగంతో అనుసంధానించి ఉన్న నీటి పైపులో అధిక రేడియేషన్ కనుగొన్నారు. దీనితో రియాక్టరు లోపల రేడియేషన్ తో బాగా కలుషితమై ఉన్న నీరు లీకేజీ ద్వారా బైటికి వచ్చిందని భయపడుతున్నారు. ఈ నీరు బైటికి వస్తే భూమిలోకి ఇంకి భూమిని కలుషితం చేస్తుంది. సముద్రంలో కలిసి అక్కడి నీటిని కలుషితం చేస్తుంది. భూమి, నీరు వాతావరణంతో కలిసి ఉంటాయి కనుక గాలి కూడా కలుషితమవుతుంది. అంటే రేడియేషన్ మనిషి నియంత్రణ స్ధాయిని దాటి పోతుంది.
రెండో నెంబరు రియాక్టరు లోపల ఇంధన కడ్డీలు పాక్షికంగా కరిగిపోవడంతో అక్కడి నీరు తీవ్రంగా కలుషితం అయ్యింది. కలుషిత నీరు స్ధానంలో శుభ్రమైన నీటిని పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కలుషిత నీరు ప్లాంటు లోపలి వరకే పరిమితమై ఉందని ఇప్పటివరకూ భావిస్తున్నారు. ప్లాంటు బైటికి వెళ్ళలేదని భావిస్తున్నారు. కాని ప్లాంటు బైట ఉన్న నీటి పైపులో కలుషిత నీరు కనపడిందంటే అది వాతావరణంలోకి రేడియేషన్ ని వ్యాపింప జేస్తుంది. వాతావరణంలోకి చేరిన రేడియేషన్ ని నియంత్రించడం సాధ్యమయ్యే పని కాదు. ఇది దాదాపు చెర్నోబిల్ అణు ప్రమాదం స్ధాయిని చేరుకోవడమే. కలుషిత నీరు సముద్రంలో కలిసిన దాఖలాలు లేవని టెప్కో చెబుతోంది. బైటి పైపు దాకా కలుషిత నీరు రాలేదనే ఇంతవరకూ భావిస్తూ వచ్చారు. కానీ అది జరిగిపోయినట్లు తేలింది. ఇక సముద్రంలో కలవలేదని ఎలా నమ్మగలం? అదీ కాక కలుషిత నీరు కనుగొన్న నీటిపైపు రెండో చివర సముద్రానికి కేవలం 55 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది.
రెండో రియాక్టరు వద్ద కలుషితమైన ఈ నీటిలో గంటకు 1000 మిల్లీ సీవర్టుల రేడియేషన్ రికార్డు అయ్యింది. అంతకుముందే జపాన్ ప్రభుత్వ ఛీఫ్ కేబినెట్ సెక్రటరీ యుకియో ఎదానో “ప్లాంటులోని కలుషిత నీరు సముద్రంలోకి, భూమిలోకి లీకు కాకుండా చూడటానికి ఇప్పుడు ప్రధమ ప్రాధాన్యం ఇస్తున్నాం” అని చెప్పాడు. ఆయన జరగకూడదని చెప్పింది జరిగిపోయింది. ఇప్పటికే టెప్కో అనేక విమర్శలను ఎదుర్కొంటోంది.
ఇండియా పాలకులు ముప్ఫైకి పైగా అణు విద్యుత్ ప్లాంటులను నిర్మించడానికి ఉరకలు వేస్తున్నారు. ఆ మేరకు అమెరికా, రష్యా, ఫ్రాన్సు, ఇటలీ, బ్రిటన్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు లేడా కుదిరే దశలో ఒప్పందాలు ఉన్నాయి. జపాన్ ప్రమాదం జరిగాక ఇండియా అణు రియాక్టర్లను కొనడం మానేస్తుందేమోనని అమెరికా నిపుణుడొకరు “ఇండియా జపాజ్ ప్రమాదాన్ని చూసి అణు విద్యుత్ పై వెనక్కి పోవాల్సిన అవసరం లేదు అని ప్రకటించాడు. మన ప్రధాని కూడా వెనక్కి తగ్గేదే లేదని చెప్పేశాడు. ఇప్పటికైనా వీరు పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్గ్నాంలో ఎంతో అభివృద్ధి చెందిన జపాన్ దేశమే ఈ విధంగా మల్లగుల్లాలు పడుతుంటే ఇండియా పరిస్ధితి చెప్పనవసరం లేదు. భోపాల్ విషవాయు ప్రమాదం ఉదాహరణ మనముందుంది. లక్షలాది ప్రజల జీవితాల్ని అంధకారం చేసిన యాండర్సన్ ని రాత్రికి రాత్రి విమానం ఎక్కించి దేశం దాటించిన ప్రభుద్ధులు మనపాలకులు.
