‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’పై అమెరికాకు ప్రోగ్రెస్ రిపోర్టు సమర్పించుకున్న భారత ప్రభుత్వం -వికీలీక్స్ – 2


2005, 2007 ల మధ్య కాలంలో అమెరికా, ఇండీయా లమధ్య అణు ఒప్పందం కుదరడం వెనక అన్ని పనులు పూర్తి కావడంలో తీవ్రంగా శ్రమించిన జై శంకర్ ఇప్పుడు ఇండియా తరపున చైనాకు రాయబారిగా పని చేస్తున్నాడు. రాబర్ట్ బ్లేక్ ఆ తర్వాత శ్రీలంక, మాల్దీవులకు అమెరికా రాయబారిగా పని చేశాడు. ఈయన ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలోని స్టేట్ డిపార్ట్ మెంటు లో దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాల శాఖకు అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నాడు.

బ్లేక్ తన కేబుల్ లో ఇలా రాశాడు. “నిర్ధిష్ట దేశాల పేరుతో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం లో ప్రవేశపెట్టే తీర్మానాలను ఇండియా సాధారణంగా వ్యతిరేకిస్తుంది. ఈ నేపధ్యంలో గ్వాంటనామొ బే జైలు ఖైదీలను అమెరికా అనుసరిస్తున్న విధానలను ఖండిస్తూ ప్రవేశపెట్టిన క్యూబా తీర్మానాన్ని వ్యతిరేకించడం ఇండియాకు సులభమైంది. అయినా ఇది భారత ప్రభుత్వం నుండి అందిన అనుకూల సంకేతంగా భావించవచ్చు. ఉత్తర కొరియా దేశంపై ఆంక్షలు విధిస్తూ మానవక్కుల కమిషన్ లో పెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్ లో ప్రజాస్వామ్య ఇండియా పాల్గొనకపొవడం, క్యూబా, బెలారస్ దేశాలపై పెట్టిన తీర్మానలను వ్యతిరేకించడంలాంటి ప్రతికూలతలను ఇండియా విధానం వలన మనం ఎదుర్కొనవలసి ఉంటుంది.”

అమెరికా గ్వాంటనామొ బే లో అనుసరిస్తున్న అమానుష పద్ధతులను ప్రపంచ వ్యాపితంగా అనేక సంస్ధలు, వ్యక్తులు తీవ్రంగా ఎండగట్టాయి. అక్కడి ఖైదీలను నగ్నం కావించి అమెరికా సైనికులు చిత్రహింసలు పెడుతున్న విధానాన్ని ఫోటోలలో చూసి ప్రపంచ వ్యాపితంగా పెద్ద దుమారమే లేపింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బారక్ ఒబామా గ్వాంటనామో బే జైలును మూసివేస్తామని హామీ ఇచ్చే స్ధాయిలో అమెరికా చెడ్డపేరు తెచ్చుకుంది. అటువంటి జైలు విషయంలో వచ్చే తీర్మానాలను ఎటువంటి పరిస్ధితుల్లోనైనా ప్రజాస్వామిక దేశాలుగా చెప్పుకునే చేశాలు ఆమోదించాల్సి ఉన్నప్పటికీ ఇండియా అమెరికాకి కోపం రాకుండా ఉండేందుకు దూరంగా ఉండడం మాట అటుంచి వ్యతిరేక ఓటు వేయడం దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. అన్నిటికీ మించి ఇటువంటి వైఖరి వలన ఇండియా మూడవ ప్రపంచ దేశాలలో తన పేరును పూర్తిగా పోగొట్టుకుంటున్నది. అలీన ఉద్యమానికి నాయకత్వం వహించిన దేశాల్లో ఒకటిగా ఉన్న ఇండియా అమెరికా అనుకూల వైఖరితో పరువు పోగొట్టుకుంటున్నది.

ప్రపంచ వాణిజ్య సంస్ధలొ సైతం ఇండియా మలేషియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా లాంటి దేశాలతో కలిసి మూడో ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసం ఏదో మేరకు కృషి చేస్తూ వచ్చింది. దోహ రౌండ్ ఒప్పందం పూర్తి కాకుండా దీర్ఘకాలంపాటు స్తంబించి పోవడానికి ఇతర దేశాలతో కలిసి ఇండియా కూడా ప్రతిఘటించడం ఒక కారణం. ఇండియా, మలేషియా, బ్రెజిల్, చైనా లాంటి దేశాల ప్రతిఘటన వలన అమెరికా తదితర పశ్చిమ దేశాలు దోహా రౌండ్ చర్చలను తిరిగి మొదలు పెట్టడానికీ, దోహ చర్చలు పూర్తి కావదానికీ భయపడుతున్న పరిస్ధితి కూడా నేడు నెలకొని ఉంది. దోహ చర్చలను పక్కన పెట్టి పశ్చిమ దేశాలు జి-20 గ్రూపు సమావేశాలపైన ప్రధానంగా ఆధారపడుతున్నాయి. జి-7 గ్రూపు దేశాల సమావేశాల కంటే జి-20 సమావేశాలకు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతున్నదంటే అతిశయోక్తి కాదు. అయితే జి-20 గ్రూపు సమావేశాల ప్రోత్సాహం వెనుక ముఖ్యమైన మూడో ప్రపంచ దేశాలను మూడో ప్రపంచ దేశాల నుండి దూరం చేసే దురాలోచన పశ్చిమ దేశాలకు ఉండటం కూడా గమనించాలి.

భారత దేశంలోని రాజకీయ పార్టీలన్నీ అమెరికాతో ఇండియా అంటకాగటాన్ని సమర్ధిస్తున్నాయి. వ్యతిరేకత లేదనడం సరిగా ఉంటుంది. ఎందుకంటే మన రాజకీయ పార్టీలకు దేశ అభివృద్ధి కంటే సొంత జేబులను నింపుకోవడం పైనే ఆసక్తి. తమ జేబులు నింపే ఏ విధానాన్నయినా సమర్ధించడానికి సిద్ధం. దానివలన వంద కోట్ల భారతీయుల బతుకులు ఏమైనా వారికి అభ్యంతరం లేదు. ఈ విషయం వికీలీక్స్ బయట పెట్టిన కేబుల్స్ ద్వారా మరోసారి ఋజువవుతున్నది.

వ్యాఖ్యానించండి