పశ్చిమ దేశాల సంకీర్ణ సేనల భారీగా దాడులు చేస్తుండడంతో గడ్డాఫీ బలగాలు కీలకమైన అజ్దాబియా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. లిబియా తూర్పు ప్రాంతానికి ముఖ ద్వారంగా చెప్పుకునే అజ్దాబియా కోల్పోవడంతో గడ్డాఫీ బలగాల పురోగమనం ఆగిపోయినట్లే. దాదాపు రెండు వారాలనుండి తిరుగుబాటుదారుల నుండి ఒక్కొక్క పట్టణాన్నీ స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్న గడ్డాఫీ బలగాలకు పశ్చిమ దేశాల సైనిక చర్య గట్టి దెబ్బ తీసింది. తిరుగుబాటుదారుల ప్రతిఘటన కారణంగా కాకుండా పశ్చిమ దేశాల దాడుల వలన అజ్దాబియాని చేజిక్కించుకున్న తిరుగుబాటుదారులు త్వరలో ట్రిపోలీని స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నా అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు.
శుక్రవారం రాత్రంగా సంకీర్ణ దేశాల వైమానిక దాడులు భీకరంగా కొనసాగాయి. దానితో అజ్దాబియాను అట్టిపెట్టుకొని ఉండటమ్ గడ్డాఫీ బలగాలకు అసాధ్యంగా మారింది. డిప్యుటీ విదేశీ మంత్రి ఖలేద్ కైమ్ ఈ రాయిటర్స్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని అంగీకరించాడు. ప్రభుత్వ బలగాల నిష్క్రమణ తర్వాత తిరుగుబాటు బలగాలు వీధి వీధి తిరుగుతూ గడ్డాఫీ బలగాల కోసం వెతుకుతున్నారు. పట్టణంలోపలా, బయటా గడ్డాఫీ బలగాలు పెద్ద ఎత్తున చనిపోయి ఉన్నట్లు బిబిసి తెలిపింది. కనీసం రెండు డజన్ల ట్యాంకులు సంకీర్ణ దేశాల దాడుల్లో ధ్వంసం ఐనట్లు తెలిపింది. లిబియా పౌరులపై గడ్డాఫీ యుద్ధ విమానాలు దాడులు చేయకుండా ఉండటానికి లిబియా పై నో-ఫ్లై జోన్ అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం కోరగా, సంకీర్ణ దేశాలు ముఖ్యంగా ఫ్రాన్సు, బ్రిటన్ లు దానికి మించి గడ్డాఫీకి చెందిన భూతల బలగాలపై కూడా దాడులు చేస్తున్నాయి.
తిరుగుబాటుదారుల చేతిలో ఉన్న పశ్చిమ ప్రాంత పట్టణం మిస్రాటా పట్టణం కొసం పోరు నడుస్తోంది. అక్కడ కూడా సంకీర్ణ సేనలు దాడులు చేస్తున్నాయి. వాటినుండి రక్షణ పొందటానికి గడ్డాఫీ బలగాలు జనావాస ప్రాంతాలకు తమ ట్యాంకులు ఇతర యుద్ద సామాగ్రిని తరలించాయి. రాజధాని ట్రిపోలీ పైన కూడా సంకీర్ణ సేనలు వైమానిక దాడులు చేస్తున్నాయి. మిలట్రీ కమాండ్ సెంటర్లుగా భావిస్తున్న ప్రాంతాలు, మిలట్రీ బేస్ లు, ఆయుధ డిపోలు తదితరాలుగా అనుమానిస్తున్న ప్రాంతాలపై వైమానికి దాడులు జరుగుతున్నాయి. శనివారం మిలట్రీ రాడార్ సైటు ఒకటి సంకీర్ణ దేశాల దాడుల్లో ధ్వంసం అయ్యింది. ఈ దాడుల్లో పౌరులు చనిపోతున్నారని గడ్డాఫీ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఆరోపణలను పశ్చిమ దేశాలు తిరస్కరిస్తున్నాయి. వార్తలు ధృవపరచుకోవడం వార్తా సంస్ధలకు కష్టంగా మారింది.
అజ్దాబియా వశం కావడంతో తిరుగుబాటు బలగాలు ఉత్సాహంతో ఉన్నాయని బిబిసి తెలుపుతోంది. తిరుగుబాటు బలగాలు ఆనందం తో గంతులు వేస్తున్నారనీ, ధాంక్యూ ఒబామా, ధాంక్యూ కామెరాన్ అంటున్నారని బిబిసి తెలిపింది. కార్పొరేటు వార్తా సంస్ధలు మొదటునుండీ గడ్డాఫీ బలగాలను రాక్షసులుగానూ, తిరుగుబాటుదారులను పీడితులుగానూ చిత్రిస్తూ వచ్చాయి. ఇప్పుడు సంకీర్ణ దేశాలను విముక్తి ప్రదాతలుగా చిత్రీకరిస్తున్నాయి. ఆ చిత్రీకరణకు లిబియా పౌరులనే ఉటంకిస్తున్నాయి.
