శ్రీశ్రీ గారి మహా ప్రస్ధానం రచనకు గుడిపాటి చలం ముందుమాట రాశారు. అందులో ఆయన “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ కి బాధ” అని చమత్కరించారు. అది చమత్కారమే అయినా వాస్తవం కూడా ఉంది, అది వేరే సంగతి. అమెరికా విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అమెరికాకి ఏ భాధ వచ్చినా దాన్ని ప్రపంచానికి అంటగడుతుంది. ఎయిడ్స్ జబ్బుని అలాగే అంటగట్టింది. “టెర్రరిజం పై సమరా”న్ని కూడా అలాగే అంటగట్టింది. తాజాగా ఆర్ధిక సంక్షోభాన్నీ అలాగే అంటగట్టింది. ప్రభుత్వ రంగం పుణ్యమాని ఇండియా కొద్దిలో బైట పడిందిగాని ప్రైవేటీకరణ పూర్తయ్యాక అలాంటి సంక్షోభమే వస్తే ఇండియా కష్టాలు ‘కు_”కు కూడా ఉండవేమో! అసలు విషయానికి వద్దాం!

(ఎడమనుండి) ఇప్పటి చైనా (అప్పటి విదేశీ శాఖ) రాయబారి జై శంకర్, నిరుపమా రావు, ఎస్.ఎం.కృష్ణ, చైనా నుండి ఇండియా రాయబారి
‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ సమస్య ఇండియా పాలకులకు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆల్-ఖైదా దాడుల (సెప్టెంబరు 11) వరకూ ఇండియా ప్రభుత్వం తాను ఎదుర్కొంటున్న కాశ్మీరు ఉగ్రవాదాన్ని తన సొంత విషయంగా చెబుతూ, ఇతరుల జోక్యాన్ని నిరాకరిస్తూ వచ్చింది. అమెరికా పై దాడుల తర్వాత అమెరికా ఉగ్రవాద భయాల్ని కూడా ఇండియా ప్రభుత్వం తనపై వేసుకుని తన బాధని కూడా అమెరికీకరణ కావించింది. బిజెపి నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వ హయాంలొ ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తనకున్న పేరు ప్రతిష్టలను మంటగలుపుకుంటూ క్యూబాలోని భూతల నరకంగా భాసిల్లుతున్న గ్వాంటనామో బే జైలులో ఉగ్రవాద ఖైదీల పేరుతో అక్కది ఖైదీలకు నరకాన్ని చూపుతున్న అమెరికా విధానాల్ని ఖండిస్తూ క్యూబా ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఇండియా ఓటేసింది. చేసిన ఘనకార్యం చాలదన్నట్లు ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’లో తన ప్రతిభను గమనించాలని అమెరికాకి విన్నవించుకున్న వైనం వికీలీక్స్ వెల్లడించిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయింది. ఇండియా విదేశాంగ శాఖలోని ఓ సినియర్ అధికారి న్యూఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయంలోని రాజకీయ బాధ్యుడికి ఫోన్ చేసి తాము అమెరికా చర్యల్ని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిపి తమ చర్యను గమనంలో ఉంచుకోవాల్సిందిగా కోరాడు. ‘చూశారా, మేం మీకు అనుకూలంగా నడుచుకున్నాం. కాస్త దృష్టిలో ఉంచుకోండి సార్!’ అని దేబిరించడం అన్నమాట.
ఏప్రిల్ 25, 2005 తేదీన పంపిన కేబుల్ లో అమెరికా రాయబార కార్యాలయం లోని ఛార్జి డి’ ఎఫైర్స్ (రాజకీయ బాధ్యుడు) ‘రాబర్ట్ ఓ. బ్లేక్ జూనియర్’ ఈ అంశాన్ని అమెరికా ప్రభుత్వానికి తెలిపాడు. “గ్వాంటనామో తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఇండియా ఇష్టపడిన విషయాన్ని గమనిస్తే టెర్రరిజానికి వ్యతిరేకంగ జరుగుతున్న ప్రపంచయుద్ధానికి అది దృఢంగా కట్టుబడి ఉన్న విషయం అర్ధమవుతుంది. ఐక్యరాజ్య సమితి, భద్రతా సమితి లో శాశ్వత సభ్యత్వాన్ని ఆశిస్తున్న దేశాలు దానికి తగిన విధంగా తమ ఆచరణను మెరుగుపరచుకోవాలని మనం భారత ప్రభుత్వానికి గుర్తు చేయడం బాగా పనిచేస్తున్నదని భావించవచ్చు” అని రాయబారి రాశాడు.
“రాజకీయ బాధ్యుడు గతంలో భారత ప్రభుత్వానికి గుర్తు చేసిన దానికి స్పందనగా, విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ ఎస్. జై శంకర్ ఏప్రిల్ 25 ఫోన్ చేసి ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ లో ఏప్రిల్ 21 న గ్వాంటనామో జైలులో అమెరికా పద్ధతులను వ్యతిరేకిస్తూ పెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్ విషయాన్ని తెలిపాడు. దక్షిణాసియా లోని అత్యధిక దేశాలు (నేపాల్, భూటాన్, పాకిస్తాన్, శ్రీలంక) ఓటింగ్ నుండి దూరంగా ఉన్నాయనీ, ఇతర ప్రధాన దేశాలైన చైనా, దక్షిణాఫ్రికా, మలేషియా, మెక్సికో లు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయనీ తెలిపాడు. (ఈ తీర్మానం ఓడిపోయింది. 22 దేశాలు అనుకూలంగా, 23 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. 8 దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఈ ఎనిమిదిలో ఇండియా ప్రభావితం చేసిన మూడు దక్షిణాసియా దేశాలున్నాయి -విశేఖర్) క్యూబా తీర్మానాన్ని వ్యతిరేకించి తద్వారా నాటో దేశాలతో పాటు అమెరికా మితృలయిన ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాల సరసన నిలబడిందని జై శంకర్ తెలిపాడు” అని రాయబారి రాశాడు. తన ఓటు వరకే పరిమితం కాకుండా తన పొరుగు దేశాలను కూడా ప్రభావితం చేసిందనీ, తద్వారా అమెరికా మితృడుగా ఇండియా రుజువు చేసుకుందనీ ఇండియా విదేశాంగ ఉన్నతాధికారి అమెరికా రాయబారికి చెబుతున్నాడు.