లిబియా పై పశ్చిమ దేశాలు తలపెట్టిన దాడుల ద్వారా అమెరికా బలహీన పడిందని రుజువైందని సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూ డెమొక్రసీ) నాయకులు పి. ప్రసాద్ అన్నారు. లిబియాపై పశ్చిమ దేశాలు జరుపుతున్న దుర్మార్గ దాడులకు నాయకత్వం వహించడానికి అమెరికా సంసిద్ధంగా లేదని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ల దురాక్రమణ యుద్ధాల్లో పీకల దాకా కూరుకు పోయి బైట పడలేక సంగతి మన కళ్ళ ముందున్నదనీ, రెండు యుద్ధాలతో ఆర్ధిక, మిలటరీ సంక్షోభం లో ఉన్న అమెరికా మూడో యుద్ధం చేసే స్ధితిలో లేదనీ ఆయన అన్నారు.
మరోవైపు లిబియా తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలో ఏర్పడిన సమానాంతర ప్రభుత్వాన్ని గుర్తించినట్లయితే అది ఉత్తర ఆఫ్రికాలో ఫ్రాన్సు ఆధిపత్యానికి దారి తీస్తుందనీ, అంతే కాకుండా గడ్డాఫీని గద్దె దింపితే చేజేతులా ఆల్-ఖైదా కు అధికారం అప్పగించడమేననీ ప్రసాద్ వివరించారు. ఈ నేపధ్యంలోనే లిబియాపై దాడులు చేసి నిర్ణయాత్మక ముగింపుకు దోహదం చేయలేని స్ధితిలో అమెరికా ఉందనీ ఆయన తెలిపారు. లిబియాపై తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడం అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకం అని ఆయన వివరించారు.
తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ద్వారా ఆర్ధికంగా బాగా బలహీనపడిన అమెరికా లిబియా పరిణామాలతో మిలట్రీ పరంగా కూడా బలహీనపదుతున్న వైనం బయట పడుతున్నదనీ ఫలితంగా ప్రపంచం బహుళ ధృవ ప్రపంచంగా మారిందనీ ఆయన సూత్రీకరించారు. పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాలు సామ్రాజ్యవాద సంక్షోభాన్ని తీవ్రతరం చేసి క్రమంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని బలహీనపరచిందనీ, అమెరికా సామ్రాజ్యవాదం తన చావును తానే లిఖించుకుందనీ ఆయన తెలిపారు.
ప్రపంచం బహుళ ధృవ ప్రపంచంగా మారిందని అనడంలో… పిపి ఉద్దేశ్యం ఏంటి?
భాస్కర్
ఇప్పటివరకు అమెరికా ఒక్కటే ప్రపంచాన్ని తన అదుపాజ్గ్నల్లో పెట్టుకుంటూ పెత్తనం చెలాయిస్తూ వచ్చింది. కాని ఇరాక్,
ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు మోయలేని భారంగా మారడం, ఆర్ధిక సంక్షోభం వలన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతినడంతో అంతర్జాతీయ ఆర్ధిక వేదికలపైన అమెరికాకు సవాళ్ళు ఎదురవుతున్నాయి. గతంలో అమెరికా ఏం చేపితే అదే అమలయ్యేది. కాని ఇప్పుడు యూరోపియన్ దేశాల దగ్గరనుండి చైనా, ఇండియా, రష్యాల వరకు అమెరికాకి ఎదురు మాట్లాడుతున్నాయి. ప్రత్యామ్నాయ వాదనలు చేస్తున్నాయి. ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేదు. వీటి వలన వివిధ సమావేశాల్లో అమెరికా చెల్లుబాటు కావడం లేదు. అంటే దాని అగ్రరాజ్య ఆధిపత్యంకి గండి పడిందన్నమాట. లిబియాపై దాడులకు నాయకత్వం వహించడానికి అమెరికా తిరస్కరించింది. ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో పీకల్దాకా కూరుకుపోవడంతో మరో యుద్ధం చేయలేని స్ధితికి అమెరికా చేరుకుంది. అమెరికా తానే స్వయంగా లిబియా దాడులకు నాయకత్వం వహించనని చెప్పేసింది. దీనితొ, నాటొ కూటమి నాయకత్వం వహించడానికి చర్చలు జరుగుతున్నాయి. రెండ్రోజుల్లో అదీ పూర్తవుతుంది. సో, అమెరికా మిలట్రీ పరంగా బలహీన పడుతోంది. ఈ కారణాలవలన అమెరికా ఒక్కటే ఏక దృవంగా ఉండే ప్రపంచ స్ధితి మారి బహుళ ధృవ ప్రపంచ స్ధితి ఏర్పడిందని పిపి చెబుతున్నారు.
అమెరికా ఒక ధృవంగా, యూరోపియన్ యూనియన్ మరొక ధృవంగా, చైనా, రష్యా, ఇండియా, బ్రెజిల్ ల నాయకత్వంలో ఎమర్జింగ్ దేశాలు మరో ధృవంగా, జపాన్ ఇంకో ధృవంగా ఇలా బహుళ ధృవాలు ఏర్పడ్డాయని పిపి భావం. అయితే ఈ నాలుగు ధృవాలని పిపి చెప్పలేదు. అది నా గెస్. ధృవం అంటే అధికార కేంద్రం అని ఇక్కడ అర్ధం చేసుకోవాలి.