గ్రీసు, ఐర్లండ్ లను బలి తీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం ఇప్పుడు పోర్చుగల్ ని బలి కోరుతోంది. ఆర్ధిక సంక్షోభం పేరుతో పోర్చుగల్ ప్రధాని జోస్ సోక్రటీసు బడ్జెట్ లో ప్రతిపాదించిన కఠినమైన పొదుపు చర్యలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ బడ్జెట్ కి వ్యతిరేకంగా ఓటువేయడంతో సోక్రటీసు నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన ప్రధాని సోక్రటీసు ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్నాడు. బ్రసెల్స్ లో జరుగుతున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సభ యూరోపియన్ రక్షిత నిధిని 250 నుండి 440 బిలియన్ యూరోలకు పెంచడంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పోయింది. ఫిన్లాండ్ లో జరగనున్న ఎన్నికలే నిర్ణయం తీసుకోక పోవడానికి కారణంగా తెలుస్తోంది. నిర్ణయాన్ని జూన్ కి వాయిదా వేశారు.
పోర్చుగల్ లోని ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాన నిర్ణయాలు తీసుకొనే అధికారం లేకపోవడంతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా ఏర్పరిచిన రక్షిత నిధినుండి బెయిల్ అవుట్ పొందే అవకాశం లేదు. ఎన్నికలు జరపాలని అధ్యక్షుడు నిర్ణయిస్తే రెండు నెలల తర్వాతే జరపాలి. అంటే మే నెలలో ఎన్నికలు జరిపేదాకా బెయిలౌట్ నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. కానీ ఏప్రిల్ లో పోర్చుగల్ 4.3 బిలియన్ల యూరోల మేరకు అప్పు చెల్లింపులు జరపవలసి ఉంది. జూన్ లో కూడా అదే మొత్తం లో చెల్లింపులు చేయాల్సి ఉంది. ఏప్రిల్ గండంనుండి పోర్చుగల్ ఎలా గట్టేక్కుతుందో చూడవలసిందే.
మరోవైపు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లనుండి బెయిల్ అవుట్ తీసుకోవదానికి పోర్చుగల్ ప్రజలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. రాజీనామా చేసిన ప్రధాని సోక్రటిసు కూడా బెయిలౌట్ ను వ్యతిరేకిస్తున్నాడు. ఎన్నికల తర్వాత ఎవరు అధికారం లోకి వచ్చినా పొదుపు చర్యలు అమలు చేయవలసిందేనన్న సోక్రటీసు ప్రకటనలో వాస్తవముంది. ఏప్రిల్, జూన్ లలో చేయాల్సిన అప్పు చెల్లింపుల కోసం పోర్చుగల్ బాండ్ మార్కెట్ కు వెళ్ళవలసిందే. ప్రభుత్వం పడిపోయాక రేటింగ్ సంస్ధలు ఫిచ్, ఎస్ & పి సంస్ధలు పోర్చుగల్ అప్పు రేటింగ్ ను రెండు పాయింట్లు తగ్గించాయి. ఎస్ & పి రానున్న రోజుల్లో రేటింగ్ ను మళ్ళీ తగ్గించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.
ప్రజల నుండి గట్టి వ్యతిరేకత ఉన్న నేపధ్యంలో ఎన్నికల్లో ప్రజలకు సంక్షోభం నుండి బయట పడేందుకు రాజకీయ పార్టీలు ఏ చర్యలు ప్రకటిస్తాయో ఆసక్తికరంగా మారింది. బాండ్ మార్కెట్ కి వెళ్తే అధిక వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని తప్పించుకోవలంటే ప్రజలు వ్యతిరేకిస్తున్న ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల బెయిలౌట్ తీసుకోవలసిందే. రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో కఠినమైన పరీక్ష ఎదుర్కోనున్నాయి. అయితే ప్రజలను మోసం చేయడంలో దశాబ్దాల అనుభవంతో ఆరితేరి ఉన్న రాజకీయ నాయకులు ఈ సారి కూడా మోసం చేయగలరనడంలో ఎట్టి సందేహమూ లేదు. అదెలా చేస్తారన్నదే ఆసక్తికరం.
