యెమెన్ లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుండగా అధ్యక్షుడు కూడా తనకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహింప జేస్తున్నాడు. అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ నెలన్నర క్రితం రాజధాని సనా లోని యూనివర్సిటీ విధ్యార్ధులు మొదలు పెట్టిన ఉద్యమం ఇతర సెక్షన్ల ప్రజల చేరికతో తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం (మార్చి, 25) ఇరుపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. ర్యాలిల్లొ పదుల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని బిబిసి తెలిపింది. అయితే ప్రదర్శనల్లో పాల్గొన్నవారి సంఖ్య వందల వేల సంఖ్యలో ఉందని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. రాయిటర్స్ సంస్ధ అధ్యక్షుడికి అనుకూలంగా వేల సంఖ్యంలో ర్యాలీల్లో పాల్గొనగా, వ్యతిరేకంగా పదుల వేల సంఖ్యలో పాల్గొన్నారని తెలిపింది.
అనుకూల ప్రదర్శకులను ఉద్దేశిస్తూ అధ్యక్షుడు సలే “అధికారాన్ని అప్పగించడానికి మనకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అయితే భద్రమైన చేతులకే అధికారం అప్పగిస్తాం. జబ్బు పడిన వారికి, అవినీతి పరులకు అప్పగించబోము” అన్నాడు. సోమవారం, మార్చి 21 తేదీన ఆందోళనకారుల పక్షం చేరిన జనరల్ ఆలీ మొహసేన్, అధ్యక్షుడు సలేలు చర్చలు జరిపినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక గురువారం తెలిపింది. అధికారాన్ని పౌర ప్రభుత్వానికి అప్పగించడానికి వీలుగా ఇద్దరూ రానున్న కొద్ది రోజుల్లో రాజీనామా చేయాలన్న ఒప్పందం కుదుర్చోకవడానికి వీరు ప్రయత్నిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. అయితే గురువారం తన సైనిక కమాండర్లతో జరిగిన సమావేశంలో ఆందోళనకారుల పక్షం చేరిన వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని అధ్యక్షుడు చెప్పాడు.
శుక్రవారం అధ్యక్షుడికి అనుకూలంగా ప్రదర్శన చేసినవారిలో కొంతమంది తుపాకులు ధరించి ఉన్నారు. చాలామంది సాంప్రదాయకంగా ధరించే పొడవాటి కత్తిని ధరించారు. వారు ఆందోళనకారుల ప్రదర్శనపై దాడికి సిద్ధమవడంతో సైన్యం వారిని అడ్డుకొని గాలిలోకి కాల్పులు జరిపింది. సోమవారం ఆందోళనకారులపై పౌర దుస్తుల్లో ఉన్నవారు జరిపిన కాల్పుల్లో 52 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాల్పులు జరిపిన వారెవరో తనకు తెలియదని అధ్యక్షుడు ప్రకటించినా ఎవరూ నమ్మడం లేదు. 2.3 కోట్ల జనాభా గల యెమెన్ ను సలే మూడు దశాబ్దాలుగా పాలిస్తున్నాడు. 2013లో తన పదవీ కాలం ముగిశాక మళ్ళీ పోటీ చేయనని మొదట ప్రకటించిన సలే జనవరి 2012 లో ఎన్నికలు నిర్వహిస్తానని అమెరికా ఒత్తిడితో ప్రకటించాడు. అయితే ఎమర్జెన్సీ విధించి సైన్యానికి అన్ని అధికారాలు కట్టబెట్టడంతో సలే మాటలకు చేతనలకు పొంతన కనబడడం లేదు.
అమెరికాకు, సౌదీ అరేబియాకు నమ్మిన బంటు అయిన సలేను కాపాదుకోవడానికి అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ప్రజాస్వామిక సంస్కరణల కోసం డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య సంరక్షకురాలిగా ఫోజు పెట్టే అమెరికా మాట్లాడ లేక పోతున్నది. అలా అని నమ్మకమైన అనుచరుడినుండి అధికారం చేజారడమూ ఇష్టం లేదు. ఆందోళనకారుల వైపుకి అనేకమంది అధికారులు, సైనిక జనరళ్ళు చేరడాన్ని బట్టి అమెరికా ఆందోళనకారుల్లో సైతం తమ మద్దతుదారులను తయారు చేసుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సలే ప్రభుత్వంలో పని చేసినవారు చాలా సంవత్సరాలుగా అమెరికాతో సంబంధాలు నెరపినవారు. అధికార మార్పిడి జరిగితే మళ్ళీ వారే అధికారంలో కొనసాగి అమెరికాకి అనుగుణంగా నడుచుకునే అవకాశాలు లేకపోలేదు.
ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిల్వలున్న సౌదీ అరేబియా యెమెన్ కు పొరుగునే ఉంది. వివిధ దేశాలకు సౌదీ అరేబియా, ఇరాన్ ల నుండి వెళ్ళే ఆయిల్ రవాణా నౌకలు యెమెన్ మీదుగానే వెళ్ళాలి. వాణిజ్య పరంగా యెమెన్ అత్యంత కీలకమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది. దానితో యెమెన్ తో అమెరికా ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. యెమెన్ దక్షిణ ప్రాంతంలో ఆల్-ఖైదా విభాగం “ఆల్-ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా – ఏ.క్యూ.ఏ.పి) నాయకత్వంలో వేర్పాటు ఉద్యమం నడుస్తోంది. ఆ రీత్యా కూడా అమెరికా ప్రయోజనాలకు ప్రమాదం పొంచి ఉంది. ఉత్తరాన షియాల తెగలు అధ్యక్షుడికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్ధితుల మధ్య సౌదీ అరేబియా, అమెరికా ల సహకారంతో సలే ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాడు.
