తొత్తు అరబ్ ప్రభుత్వాల మద్దతుతో లిబియాపై దాడికి ‘నాటో’ నాయకత్వం


Nato Attacks victim in Lashkar Gah, Afghanistan

లష్కర్ గాహ్ (ఆఫ్ఘనిస్తాన్) పట్టణంలో 'నాటో' దాడుల్లో గాయపడ్డ బాలిక

తమ మాట వినే అరబ్ దేశాల మద్దతుతొ లిబియాపై జరుపుతున్న దాడులకు ఆమోద యోగ్యత సాధించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మొదట లిబియాపై సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన కతార్ ఇప్పటికే దాడుల్లో పాల్గొంటున్నది. తాజాగా టర్కీ కూడా కతార్ తో జత కలిసింది. “అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక ఉచ్యమాలు తలెత్తడానికి పశ్చిమ దేశాలు అరబ్ దేశాల పట్ల అనుసరిస్తూ వచ్చిన విధానాలే కారణమ”ని హెచ్చరించిన టర్కీ ఇప్పుడు నో-ఫ్లై అమలుకు నాటొ నాయకత్వానికి అంగీకరించింది. గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఈ) దేశం 12 యుద్ద విమానాల్ని పంపడానికి అంగీకరించింది. “లిబియాపై పశ్చిమ దేశాల దాడి” అనే దానికి అవకాశం లేకుండా చేయడానికి పశ్చిమ దేశాల ప్రయత్నం.

లిబియా భూభాగంపై ‘నో-ఫ్లై జోన్’ అమలుకు నాయకత్వం వహించే భాద్యత నుండి అమెరికా వెనక్కి తగ్గడంతో, ఆ భాద్యతను నాటో కూటమికి అప్పగించే దిశగా పరిణామాలు వేగవంత మయ్యాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఇప్పటికే దురాక్రమణ దాడిలో మునిగి ఉన్న అమెరికా లిబియాపై దాడికి ప్రధాన బాధ్యత వహించడానికి ముందుకు రాలేకపోతోంది. ఆ భాద్యతను నిర్వహించడానికి నాటో కూటమి అంగీకారం తెలిపినట్లు బిబిసి తెలిపిది. 28 దేశాల సైనిక కూటమి ఐన నాటో దేశాలన్నీ, టర్కీ తో సహా, లిబియాపై నో-ఫ్లై జోన్ అమలును పర్యవేక్షించడానికి ఉమ్మది కౌన్సిల్ ఏర్ఫాటు చేసే దిశలో ఉన్నాయి. లిబియాపై సైనిక చర్యను మొదట వ్యతిరేకించిన టర్కీ ఇప్పుడు నాటో నాయకత్వానికి అంగీకరించింది. నాటో తీసుకునే నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతోనే తీసుకొనే నియమం ఉంది. అంటే ఒక్క సభ్య దేశం వ్యతిరేకించినా నిర్ణయం తీసుకునే పరిస్ధితి ఉండదు. ప్రతి దేశానికీ వీటో అధికారం ఉంటుంది.

మరో అరబ్ దేశం కతార్ కూడా రెండు ఫైటర్ విమానాలను లిబియాపై నో-ఫ్లై జోన్ అమలుకు పంపింది. లిబియా ప్రభుత్వ భూతల సైనిక బలగాలపై కూడా దాడులు చేయాలన్న విషయంపై విభేదాలు తలెత్తాయి. లిబియా సైనికులపై దాడులు చేసే అధికారం భద్రతా సమితి తీర్మానం ప్రత్యక్షంగా అనుమతి ఇవ్వలేదు. లిబియా పౌరులను రక్షించడానికి “అవసరమైన అన్ని చర్యలనూ” తీసుకోవాలని తీర్మానం కోరింది. నిర్ధిష్ట చర్యలేవీ పేర్కొనక పోవడంతో ఎవరికి నచ్చిన అర్ధం వారు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. బ్రిటన్ ఇప్పటికే భూతల సైనికులపై దాడులు జరిపింది. లిబియాపై సైనిక చర్యకు బ్రిటన్, ఫ్రాన్సులు మొదటినుండీ ఉత్సాహంతో ఉన్నాయి. నాయకత్వ పాత్రకు అమెరికా వెనక్కి తగ్గడంతో వాటికిక పట్టపగ్గాలు లేకుండా పోయాయి.

ఆరో రోజుకు చేరిన దాడుల వలన గడ్డాఫీ పౌరులపై చేస్తున్న దాడులను సమర్ధవంతంగా అడ్డుకోవలిగామని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్ సంతోషం వ్యక్తం చేశాడు. కానీ పశ్చిమ దేశాల దాడుల్లో చనిపోతున్న పౌరుల విషయంపై ఆయన ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. నాటో దేశాల దాడులు ప్రధానంగా “నో-ఫ్లై జోన్” ను అమలు చేయడానికే చేయాలి తప్ప లిబియా భూతల సైనిక బలగాలపై దాడులు చేయరాదని టర్కీ అభ్యంతరం తెలపడంతో నాటో నాయకత్వం చేపట్టే నిర్ణయం మరింత ముందుకు జరిగింది. రానున్న కొద్ది రోజుల్లో నాటో నాయకత్వం చేపడుతుందని నాటో సెక్రటరి జనరల్ యాండర్స్ ఫాగ్ రాస్ ముస్సేన్ చెప్పాడు.

ప్రస్తుతం పశ్చిమాన మిస్రాటా, తూర్పున అజ్దాబియా పట్టణాల కోసం తీవ్రంగా యుద్ధం జరుగుతున్నట్లుగా వార్తలు తెలుపుతున్నాయి. మిస్రాటా నగరం బైట ఉన్న ప్రభుత్వ బలగాలపై పశ్చిమ దేశాలు దాడులు చేస్తుండడంతో లిబియా ప్రభుత్వం తమ ట్యాంకులు తదితర బలగాలను మిస్రాటా పట్టణంలో పౌరుల ఆవాసాల మధ్యకు తీసుకెళ్ళాయి. పౌరుల మరణాలను నివారించడానికి వాటిపై పశ్చిమ దేశాలు దాడులు చేసే అవకాశం లేదని గడ్డాఫీ ఆలోచన. మిస్రాటాలో గడ్డాఫీ బలగాలు ఇంకా దాడులు చేస్తున్నాయని కార్పొరేటు వార్తా సంస్ధలు చెపుతున్నాయి. కాని ఆ వార్తలను ధృవీకరించే వాళ్ళెవరూ లేరు. అజ్దాబియాను తిరిగి వశం చేపట్టడానికి తిరుగుబాటు బలగాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

నాటో ఆధ్వర్యంలో అవసరమైన అన్ని మిలట్రీ చర్యలను చేపట్టాడానికి చర్చలు జరుగుతున్నాయి. ఆ నిర్ణయానికి టర్కీ ప్రస్తుతం అడ్డుగా ఉంది. లిబియాపై దాడికి నాయకత్వం వహించడానికి అమెరికా స్వయంగా ముందుకు రాకపోవడం ప్రస్తుత సంకీర్ణం యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆర్ధికంగా ఇప్పటికే కుదేలైపోయిన అమెరికా, సైనికంగా కూడా బలహీనపడుతున్నదనడానికి ఇది సంకేతంగా చెప్పుకోవచ్చు.

వ్యాఖ్యానించండి