తెలంగాణపై కేంద్రం సానుకూల నిర్ణయాన్ని అడ్డుకోవడానికే రహస్య నోట్ -జస్టిస్ నరసింహారెడ్డి


AP High Court

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుండా అడ్డుకోవడానికే రహస్య నోట్ గా ప్రస్తావించిన 8 వ ఛాప్టర్ ను తమ నివేదికలో జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ పొందుపరిచిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. శ్రీ కృష్ణ కమిటీ తాను సమర్పించిన నివేదికలోని ఎనిమిదవ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ నరసింహా రెడ్డి బుధవారం తుది తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ తనము అప్పగించిన విధుల పరిమితులను అతిక్రమించిందని జస్టిస్ నరసింహా రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు.

కమిటీ వివేదికలోని  8 వ ఛాప్టర్లో ఈ క్రింది విషయాలను పొందు పరచారని హైకోర్టు తీర్పు ద్వారా తెలుస్తోంది.

  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లయితే ఇప్పటికే ఉన్న నిరుద్యోగం, సామాజిక అశాంతి తదితర సమస్యలకు, రెండు మతాల మధ్య పరస్పరం అనుమానించుకునే ధోరణి ఉన్న నేపధ్యంలో, మత హింస కూడా తోడయినట్లయితే… మిలిటెన్సీ, జీహాదీ లాంటి శక్తులు తలెత్త వచ్చు.
  • తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నందున వారి ప్రభావాన్ని నిరోధించడానికి హిందువులు మతతత్వ ప్రాతిపదికన హిందువులను ఒక చోటికి చేర్చడానికి ప్రయత్నించ వచ్చు.
  • గత రెండు శతాబ్దాలలో ప్రభుత్వం జిహాదీ శక్తులను తటస్ధీకరించినందున, మతతత్వ ప్రాతిపదికన రాజకీయ శక్తులు పునరేకీకరణ జరిగే అవకాశాలు పెద్దగా లేనందున… మత హింస పెచ్చరిల్లడం అనేది బాహ్య శక్తుల పైన ఆధారపడి ఉంటుంది.
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా ఉన్న మిలిటెంట్లు రహస్యంగా మావోయిస్టు ఉద్యమాన్ని తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరించడానికి రహస్య జీవితంలోకి వెళ్ళవచ్చు.
  • పాలక పార్టీలో ఐక్యత పెంపొందించాల్సిన అవసరం ఉంది. దానికి బలమైన నాయకత్వాన్ని అందించాల్సిన అవసరం కూడా ఉంది. దాన్తో పాటు తెలంగాణ వ్యక్తులను ప్రభుత్వంలోని కీలక స్ధానాల్లో నియమించాల్సి ఉంది.
  • సాధ్యమైనంత మేరకు టి.ఆర్.ఎస్ పార్టీని మృదువీకరించాలి (సాఫ్ట్ చేయాలి).
  • కాంగ్రెస్ ఎం.పిలు, ఎం.ఎల్.ఏ లను ఎడ్యుకేట్ చేసి, పరస్పర అంగీకార పరిష్కారానికి ఒప్పించడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని తగ్గించవచ్చు.

“ప్రత్యేక నోట్ ను తయారు చేసి, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి గల ఉద్దేశ్యం… ఐదవ పరిష్కారం వైపుకి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వైపుకి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపకుండా నిరోధించడమే” అని జస్టిస్ నరసింహారెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. “జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ వచ్చిన నిర్ధారణల్లో వాస్తవం ఉందా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా, నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొన్నాం” అని ఆయన రాశారు. “ఒక విధంగా చెప్పాలంటే, అనేక వైరుధ్యాలను సైతం ప్రస్తావిస్తూ కూడా, ఐదవ పరిష్కారానికి అనుకూలంగా నివేదికలో పొందుపరిచిన అంశాలను తటస్ధీకరించేదిగా రహస్య నోట్ ఉంది” అని ఆయన తీర్పులో ఉంది.

జస్టిస్ నరసింహారెడ్డి తీర్పులోని మరికొన్ని అంశాలు: “తాను చెప్పదలుచుకున్న అంశాన్ని తన నివేదిక ద్వారా స్పష్టంగా చెప్పటానికి కమిటీ సంకోచించినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తనకు ఏర్పడిన వైముఖ్యాన్ని వ్యక్తం చేయడానికి, ఏ అభిప్రాయాన్నయినా తెలపగల హక్కు తనకు ఉన్నప్పటికీ, కమిటీ సంకోచించింది.” “…తన పరిష్కారానికి బలం చేకూర్చడానికి కమిటీకి రహస్య నోట్ లో ఉన్న అంశాలను సూచించవలసిన అవసరం వచ్చింది. ఏ ప్రమాణం మేరకు చూసినా ఈ నోట్ ను రహస్యంగా ఉంచవలసిన అవసరం గానీ, సున్నితంగా పరిగణించాల్సిన అవసరం గానీ లేదు.

ఉదాహరణకు తొమ్మిదవ ఛాప్టర్ లో ఐదవ పరిష్కారంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పక్షంలో దాని ఆర్ధిక అనుకూలతపై కమిటీ చెప్పిన అంశాన్ని హైకోర్టు ఎత్తి చూపింది. కమిటీ తన నివేదికలొ, “పూర్తిగా అసమర్ధనీయం కాకపోయినప్పటికీ, తెలంగాణ కోసం దీర్ఘ కాలంపాటు కొనసాగుతూ వచ్చిన డిమాండుకు కొంత అర్హత ఉన్నది... అని అన్నప్పటికీ తన నోట్ లో మాత్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై దానికి భిన్నమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది.”

కమిటీ ముందున్న చర్చలు గానీ, ప్రొసీడింగ్స్ గానీ బహిరంగంగానే జరిగాయి. కమిటీయే స్వయంగా పేర్కొన్నట్లు, 9 వ ఛాప్టర్లొ వివిధ పరిష్కారాలను చర్చించిన క్రమంలొ కమిటీ తన రహస్య నోట్ లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంది. అంతే కాకుండా తన నివేదికలో వివిధ చోట్ల రహస్యనోట్ ను నిర్ధిస్ట సందర్భాలో కమిటీ ప్రస్తావించింది. దీని ప్రకారం చూసినా రహస్యనోట్ ను బహిరంగంగా వివిధ రాజకీయ పార్టీలకు, ఇతర పక్షాలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది.

రహస్య నోట్ లోని కొన్ని భాగాలను తీర్పులో భాగంగా ప్రస్తావించడానికి జస్టిస్ ఐదు కారణాలను చెప్పారు. వాటిలో 1952 చట్టంలోని సెక్షన్ 3(4) ఒకటి. దాని ప్రకారం ప్రభుత్వం నియమించిన కమిషన్ లేదా కమిటీ సమర్పించే నివేదికలోని ప్రతి అంశాన్ని బహిరంగపరచాలి. జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ నియమింప బడిన విధి విధానాల ప్రాతిపదికనే ఏర్పడిన వోరా కమిటీ నివేదికను తీర్పు ప్రస్తావించింది. సున్నితమైన “రాజ్య భద్రత” అంశాన్ని పరిశీలించడానికే వోరా కమిటీ నియమితమయ్యింది. అయినప్పటికీ కమిటీ నివేదికను బహిరంగంగా అందుబాటులో ఉంచారు. మూడోది, భద్రత సంబంధించిన అంశాలను పరిశీలించే కర్తవ్యాన్ని శ్రీ కృష్ణ కమీటీకి అసలు అప్పగించనే లేదని హైకోర్టు తీర్పు పేర్కొన్నది.

వ్యాఖ్యానించండి