‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 2


Gujarat carnage

2002 లో గుజరాత్ మత హింసాకాండ

“దీనికి మోడి గుర్రుమంటూ ‘భారత జాతీయ మాన వహక్కుల సంఘం పక్షపాత పూరితమైనది. దాని నిర్ణయాల్లో తీవ్ర తప్పిదాలున్నాయి. అదీ కాక అమెరికా కొద్ది సంఖ్యలో ఉన్న చిన్న చిన్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్ధలపైనే ఆధారపడుతోంది. వాటికి వాస్తవ పరిస్ధితులేవీ తెలియదు. పైగా వాటికి స్వార్ధ ప్రయోజనాలున్నాయి. ఏదైమైనా అధికారులు తప్పు చేసినట్లయితే వారిని విచారించి, శిక్షించేందుకు కోర్టులున్నాయి. ముఖ్యమంత్రులు న్యాయ ప్రక్రియల్లో జోక్యం చేసుకోలేరు’ అని సమాధానమిచ్చాడు” అని ఓవెన్ రాశాడు.  కాన్సల్ జనరల్ దానికి సంఘటన జరిగి నాలుగు సంవత్సరాలవుతున్నా ఎవర్నీ పట్టుకోలేదనీ, దానితో నిజంగా బాధ్యుల నెవరినయినా గుర్తిస్తారో లేదోనన్న నమ్మకం కలగడం లేదనీ మోడితో అన్నట్లు రాశాడు.

“దానికి మోడీ 1993 లో జరిగిన ముంబై దాడులకు బాధ్యులకు ఇప్పుడు శిక్షలు పడుతున్నాయి. కనుక మనం అవాస్తవమైన అంచనాలు పెట్టుకోకూడదని సమాధానమిచ్చాడు. అసలు గుజరాత్ హింసపై ఏదన్నా పరిశోధన జరుగుతున్నదా అని అడగ్గా మోడీ దానికి సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇతర రాష్ట్రాల్లో కంటే గుజరాత్ ముస్లింలే బాగా బతుకుతున్నారన్న తన వాదన దగ్గర కూడా నిలబడలేక పోయాడు. తమ బిజేపి పార్టీ ఇటీవల జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ముస్లిం జిల్లాల్లో మంచి విజయాలు సాధించిందని గుర్తు చేశాడు. ఇతర రాష్ట్రాల్లో కంటే గుజరాత్ ముస్లింలు ఎక్కువ అక్షరాస్యత కలిగి ఉన్న సంగతి ఓ అధ్యయనంలో తేలిందన్నాడు. 2002 లో జరిగిన హింస కొద్ది మంది అల్లరి గుంపుల వలన జరిగిందనీ, దానిని గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేశారనీ ఆరోపించాడు. ఇప్పుడు గుజరాత్ లో మతాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయన్నాడు.”

“అమెరికా ప్రభుత్వం మోడి ప్రభుత్వం అనేక సానుకూల ఫలితాలు సాధించిన విషయం గుర్తించిందనీ, ఆర్ధిక వృద్ధి, విద్యారంగాల్లో కూడా అభివృద్ధి సాధించిన అంశాన్ని కూడా గుర్తించిందనీ నేను మోడీకి వివరించాను. ఇవి కొనియాడ దగ్గ విషయాలే. కానీ మత హింసను రెచ్చగొట్టినందుకు, హింసకు పాల్పడినందుకు బాధ్యులైన వారిని గుర్తించవలసిన ముఖ్యమైన అంశాన్ని అవి కప్పిపెట్ట జాలవని చెబుతూ అలా చేయనట్లయితే ఎంత నేరానికి పాల్పడినా ఎటువంటి శిక్షా పడబోదన్న వాతావరణంలో తీవ్రవాద శక్తులు భవిష్యత్తులో పెచ్చరిల్లిపోతాయనీ మోడీకి తెలిపాను. అమెరికా ప్రభుత్వం మానవ హక్కులు, మత స్వేచ్ఛలకు అత్యధిక ప్రాముఖ్యం ఇస్తుందనీ, ఇక ముందు కూడా ఈ అంశాల్లో గుజరాత్ లో జరిగే మార్పులను పరిశీలిస్తూనే ఉంటుందనీ, ఈ అంశాలో గుజరాత్ ప్రభుత్వ విధానాలపై కన్నేసి ఉంటుందనీ మోడీకి తెలిపాను” అని ఓవెన్ తాను పంపిన కేబుల్లో రాశాడు.

“దానితో మోడీ రాజీ ధోరణిలో మాట్లాడుతూ మానవ హక్కులు, మత స్వేచ్ఛ లకు అమెరికా అత్యంత ప్రాముఖ్యమిచ్చే సంగతి నాకు తెలుసనీ, ఎందుకంటే అమెరికన్లు ఎప్పుడూ ఈ విషయాలపైనె ఎక్కువగా మాట్లాడుతుంటారని అంగీకరిస్తూ నిందా స్తుతితో రాయబారిని మళ్ళీ గుజరాత్ ను సందర్శించాలనీ, అమెరికన్లు ఎప్పుడూ గుజరాత్ లో ఆహ్వానితులే అని ముగించడంతొ మా సమావేశం అంతటితో ముగిసింది” అని ఓవెన్ రాశాడు.

కాన్సల్ జనరల్ ఓవెన్ తన కేబుల్ ను కొన్ని అంతిమ వ్యాఖ్యానాలతో ముగించాడు. అవి: “2002 లో గుజరాత్ లో జరిగిన హింసకు క్షమాపణ చెప్పడం కానీ, అది తప్పని చెప్పడం కానీ చెప్పే ఉద్దేశంలో ఏమీ లేడు. అయితే ఆ సంఘటనను అమెరికా కాలంతో పాటు మరుగున పడనివ్వబోదన్న విషయాన్ని మోడీ స్పష్టంగా గుర్తించాలి. సమావేశం చిటపటలతో జరిగినా మానవహక్కులు, మత స్వేఛ్ఛలను ముఖ్యమైన అంశాలుగా గుర్తించడం అమెరికా కొనసాగిస్తూనే ఉంటుందన్న సందేశాన్ని మోడీ గ్రహించాడు. అయితే మోడీపై Sinhji చేసిన వ్యాఖ్యలు సరైనవే. దురదృష్టకరం ఏంటంటే 2002 గుజరాత్ హత్యాకాండాకు ప్రధాన బాధ్యుడైయిన వ్యక్తే ఇప్పుడు మత సహజీవనానికి గట్టి మద్దతుదారుగా ఉండటం, కనీసం పైకైనా అలా కనిపిస్తుండడమే. గుజరాత్ ఆర్ధిక వృద్ధి కాలక్రమేణా మంత సంబంధాలను ఏమేరకు మెరుగుపరుస్తుందో పరిశీలించవలసి ఉంది” అని రాయబారి తన కేబుల్ ను ముగించాడు.

Sinhji అని అమెరికా రాయబారి ప్రస్తావించిన వ్యక్తి ఎవరో, సందర్భం ఏమిటో తెలుసుకోవడం అవసరం. ఈయన కాంగ్రెస్ పార్టీ ఎం.పి. పర్యావరణ మంత్రిత్వ శాఖకు మాజీ మంత్రిగా పని చేసిన ఈయన పూర్తి పేరు ‘యురాజ్ దిగ్విజయ్ Sinhji’. ఈయన కాన్సల్ జనరల్ ఓవెన్ తో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఇది: “జాతీయ నాయకత్వానికి ఎగబాగటానికి మోడీకి గట్టి ఆకాంక్ష ఉన్న నిజమే ప్రస్తుతం అతనిని మత సహజీవనానికి గట్టి మద్దతుదారుగా నిలిపింది. 2002 లో జరిగినట్లుగా మరోసారి జరిగినట్లయితే జాతీయ స్ధాయికి వెళ్ళే అవకాశాలు మూసుకుపోయినట్లే. కనుక తన హయాంలో మరో మత కల్లోలం జరగకుండా ఉండటానికి మోడీ గట్టిగా శ్రద్ధ తీసుకుంటాడు” అని.

యురాజ్ అది చెప్పటంతోనే ముగించుకోలేదు. కేబుల్ ప్రకారం ఓవెన్ ఆయన్ని మోడీ జాతీయ నాయకుడు కాగలడా అని అడిగితే వాంకనర్ రాజ వంశంలో పుట్టి కేంబ్రిడ్జిలో పట్టా పుచ్చుకున్న యురాజ్ “మోడీకి జాతీయ నాయకత్వ స్ధాయికి ఎదగడానికి అవసరమైన మెరుగుతనం గానీ, స్వఛ్ఛత కానీ లేవని సమాధానం ఇచ్చాడు. మరో కారణం కూడా యురాజ్ చెప్పాడు. “అవినీతిని మోడి ఏ మాత్రం సహించడని ఓ వార్త ప్రచారంలో ఉంది. అది నిజమే. అతను గనక జాతీయ నాయకుడైతే దేశవ్యాపితంగా బిజెపిలో అవినీతి లేకుండా చూడడానికి ప్రయత్నిస్తాడు. బిజెపి అధికారంలోకి వచ్చాక తమ జేబులు నింపుకోవడానికి బిజేపి నాయకులు అనేకమంది క్యూ కట్టి ఉన్నారు. అవినీతిని సహించలేని మోడీ లక్షణాన్ని ఈ గుంపు బొత్తిగా భరించలేదు. ఈ అడ్డంకిని దాటి జాతీయ స్ధాయికి చేరుకోవడం మోడికి కష్టమే” అని యురాజ్ ఓవెన్ కు తెలిపాడు.

వ్యాఖ్యానించండి