కాంగ్రెస్ పార్టీలో టి.ఆర్.ఎస్ ని కలిపేస్తే తప్ప “తెలంగాణ రాష్ట్రం” ఇవ్వబోమని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధి అన్నట్లు కే.సి.ఆర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కే.సి.ఆర్ దాన్ని అవాస్తవమని కొట్టిపారేసినా, ఆయన ఎం.ఎస్.ఓ ల సంఘం సమావేశంలో ఈ విషయాన్ని చెప్పినట్లు వార్తా ఛానెళ్ళు మంగళవారం అంతా ప్రసారం చేశాయి. ఒక సంఘం సమావేశంలో చెప్పాడంటున్న వార్తను అంత తేలిగ్గా కొట్టేయలేము. అదీకాక కే.సి.ఆర్ కి ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం మామూలే. ప్రజలు, ఇతర రాజకీయ పార్టీలు ఏమంటాయో తెలుసుకోడానికి కె.సి.ఆర్ గారు ఇలాంటి కొన్ని చెమక్కులు చేస్తూంటారు అని ఆయన అనుచరులు తెర వెనుక చెప్పినట్లు ఓ తెలుగు దిన పత్రిక రాసింది.
కనుక విలీనం ప్రకటన వాస్తవమని నమ్మవలసి వస్తోంది. ఎం.ఎస్.ఓ ల సమావేశంలో ముఖ్యమంత్రి తానేనని పరోక్షంగా చెప్పినట్లు కూడా వార్తా ఛానెళ్ళు తెలిపాయి. అయితే ‘తెలంగాణ వచ్చాక దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తామ’ని కే.సి.ఆర్ చేసిన ప్రకటన వట్టిదేనా? అన్ని సార్లు దళితుడే తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి అని ప్రకటించిన కే.సి.ఆర్ దాన్ని ఉల్లంఘించడానికి సిద్ధంగా ఉన్నాడన్నమాట. తెలుగు దేశం నుండి బైటికి వచ్చి తెలంగాణ కోసం పార్టీ పెట్టి ఆరు సంవత్సరాలు ఏమీ చేయకుండా కూర్చున్న కె.సి.ఆర్ వాగ్దానాన్ని ఉల్లంఘించడంలో పెద్ద ఆశ్చర్యం లేదేమో!
రాజశేఖర రెడ్డి ఉన్నపుడు అతను తెలంగాణ వ్యతిరేకి అని తెలిసి కూడా పొత్తు పెట్టుకున్నాడు కె.సి.ఆర్. ఆ తర్వాత సీట్ల కోసం తెలుగు దేశంతో పొత్తు పెట్టుకున్నా ప్రజలు తిరస్కరించి పది సీట్లే ఇచ్చారు. టి.ఆర్.ఎస్ పార్టీని తిరస్కరించిన తెలంగాణ ప్రజలు టిడిపి కి బాగానె ఓట్లేయడం బట్టి చూస్తే అప్పట్లో కే.సి.ఆర్ పద్దతులను తెలంగాణీయులు తిరస్కరించినట్లు భావించవచ్చు. కానీ రాజశేఖర రెడ్డి తాను చనిపోయి టి.ఆర్.ఎస్ ను బతికించాడు. విద్యార్ధులు మొదలు పెట్టిన ఉద్యమం అనివార్యంగా టి.ఆర్.ఎస్ పార్టీకి కలిసి వచ్చింది.
విద్యార్ధులు, లాయర్లు, ఉద్యోఫులు తదితర ప్రజానీకం చిత్తశుద్ధితో చేసిన ఉద్యమాలతో లాభం పొంది, బలపడి తీరా ఇప్పుడు తెలంగాణ కోసమే కాంగ్రెస్ లో ఉద్యమ పార్టీని కలిపేస్తాననడం కే.సి.ఆర్ కి తగదు. తెలంగాణ ఉద్యమాలే లేకుంటే టి.ఆర్.ఎస్ లేదు. ఉద్యమం కూడా టి.ఆర్.ఎస్ నాయకులు స్వయంగా నిర్మించింది కాదు. విద్యార్ధులు, లాయర్లు ఉద్యమించడంతో వారి వెంటే రాజకీయ పార్టీలు నడిచాయి తప్ప పార్టీలెన్నడూ ఉద్యమాలు నిర్మించే ప్రయత్నాలు చేయలేదు. ఎంత సేపటికీ కాంగ్రెస్ పార్టీతొ లాబీయింగే తప్ప ప్రజల్ని నమ్ముకున్నది లేదు. ప్రజలే ఉద్యమించాక వారి వెంట వెళ్లి ఉద్యమం మాదే అన్నారు.
కాంగ్రెస్ పార్టీది అంతా తెలంగాణ ప్రజలను మోసం చేసిన చరిత్రే. చెన్నారెడ్డి పార్టీ పెట్టి ఓట్లు గెలిచి కాంగ్రెస్ లో కలిపేశాడు. ఇప్పుడు కె.సి.ఆర్ అదే చేయబోతున్నాడు. రెండు సంవత్సరాల నండి ప్రజలు తీవ్రంగా ఉద్యమిస్తుంటే, వందలమంది విద్యార్ధులు ఆత్మ హననం చేసుకుంటుంటే ఏ మాత్రం పట్టించుకోకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీలొ తెలంగాణ సాధన కొసం పుట్టిన పార్టీని కలిపేయడం నైతికంగా దిగజారినట్లు కాదా? మంత్రి పదవి ఇవ్వనందునే కె.సి.ఆర్ కి తెలంగాణ గుర్తుకొచ్చిందన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లు కాదా?
“అదేమీ మాకు దెల్వదు. తెలంగాణ వచ్చుడే మాగ్గావాలె. తెలంగాణ ఇస్తామంటున్రు గనక మేమేమయినా జేస్తం” అన్నదే సమాధానం అయితే, ప్రజల ఉద్యమానికి విలువ లేనట్లే గదా? ఏ ఉద్యమం తో నైతే సోలిపోయిన పార్టీ లేచి నిలబడిందో ఆ ఉద్యమాన్ని అపహాస్యం చేయడం టి.ఆర్.ఎస్ కి తగునా? ఉద్యమాన్ని నిర్మించిన ప్రజలకు తిరిగి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనను అందిస్తారా? నక్సలైట్లు కోరే తెలంగాణ కోసం పోరాడుతున్నామని వాళ్ళను చంపడంలో ఆరితేరిన కాంగ్రెస్ పాలనను ప్రజలకు ఇవ్వడం ఉద్యమ ద్రోహం, ప్రజా ద్రోహం కాదా?
అసలు కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ వస్తుందా? ప్రజలు ఉద్యమించినందుకు తెలంగాణ రావడం లేదా? ఎన్నికలయ్యేదాకా తెలంగాణ ఇచ్చే పరిస్ధితిలో కాంగ్రెస్ లేదని ఉద్యమాన్ని అపేయడం ఏంటి? కాంగ్రెస్ ఇవ్వడం కోసం ఉద్యమమా? లేక తెలంగాణ సాధించుకోవడం కోసం ఉద్యమమా? విద్యార్ధుల ప్రాణ త్యాగాలతో వచ్చే తెలంగాణను కాంగ్రెస్ అనే దుర్మార్గ పార్టీకి అప్ప జెపుతారా? కోటి రతనాల వీణ తెలంగాణ తీగల్ని మరోసారి తెంపేస్తారా?
ఇది న్యాయమేనా? నైతికమేనా? విలువ గల్లదేనా? వంచన కాదా? ద్రోహం కాదా?
టి.ఆర్.ఎస్ తెలంగాణ ఉద్యమ ద్రోహి! మిలియన్ మార్చ్ ఆపాలని ప్రయత్నం చేశారు. జె.ఎ.సి ని కూడా పక్క దోవ పట్టించటానికి చూసాడు. CPIML ND కె.సి.ఆర్ ఆటలను సాగనివ్వలేదు. మిలియన్ మార్చ్ సక్సెస్ క్రెడిట్ సి.పి.ఐ(ఎం.ఎల్-ఎన్.డి) పార్టీదే.
తెలంగాణ ఉద్యమంలో కె.సి.ఆర్, టి.ఆర్.ఎస్ ల పాత్రపై తెలంగాణ ప్రజల్లో కూడా అనుమానాలు పెరిగినట్లున్నాయి.