లిబియాపై పశ్చిమ దేశాలు అధునాతన యుద్ధ విమానాలతో క్షిపణి దాడులు జరుపుతుండగా, మరోవైపు గడ్డాఫీ బలగాలు, తిరుగుబాటు బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ దేశాల దాడులపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతున్నది. ఆఫ్రికన్ యూనియన్ దేశాలు పశ్చిమ దేశాల దాడులను ఖండించాయి. నో-ఫ్లై జొన్ అమలు చేయడానికి మద్దతిచ్చిన అరబ్ లీగ్ సైతం భారీ దాడులు జరపడం పట్లా, పౌరులు చనిపోవడం పట్లా అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ దేశాల ఉద్దేశాల పట్ల అనుమానాలు వ్యక్త చేసింది. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ లిబియాపై చర్యలో అమెరికా పాత్ర ప్రధానంగా ఉండబోదన్నాడు.
మరోవైపు గడ్డాఫీ బెంఘాజీ దగ్గర్లో గల అజ్దాబియా పట్టణంపై దాడులు కొనసాగిస్తున్నట్లు వార్తలు తెలిపుతున్నాయి. గడ్డాఫీ బలగాల ఆధీనంలో ఉన్న అజ్దాబియాను వశం చేసుకోవడానికి తిరుగుబాటుదారులు చేసిన ప్రయత్నాన్ని గడ్డాఫీ బలగాలు తిప్పికొట్టినట్లు ఎ.ఎఫ్.పి తెలిపింది. తిరుగుబాటు బలగాల చేతిలో ఉన్న మిశ్రాటా పట్టణంపై గడ్డాఫీ బలగాలు విమానదాడులు కొనసాగించినట్లు పట్టణంలోని ఓ డాక్టరును ఉటంకిస్తూ బిబిసి తెలిపింది.
రష్యా డిఫెన్స్ అధికారితో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ చర్చించాడు. మరి కొద్ది రోజుల్లో పశ్చిమ దేశాలు తమ బలగాలను రప్పించవచ్చని గేట్స్ రష్యాకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపాడు. రష్యా, చైనా, ఇండియాలో భద్రతా సమితిలో జరిగిన నో-ఫ్లై జోన్ ఓటింగ్ నుండి దూరంగా ఉన్నాయి. పశ్చిమ దాడులు మొదలయ్యాక ఈ మూడు దేశాలూ దాడుల్ని ఖండించాయి. రష్యా, చైనా లకు వీటో అధికారం ఉన్నప్పటికీ ఉపయోగించలేదు. ఇండియా వ్యతిరేక ఓటు వేయగలిగినప్పటికీ వేయలేదు. అంటే పరోక్షంగా ఈ మూడు దేశాలు పశ్చిమ దేశాల మిలట్రీ చర్యకు మద్దతిచ్చినట్లే.
ఇదిలా ఉండగా అమెరికా యుద్ధ విమానం ఒకటి కూలిపోయినట్లుగా అమెరికా ప్రకటించింది. గడ్డాఫీ సైన్యం దాన్ని కూల్చినట్లు జాడలేవీ లేవని తెలిపింది. ట్రిపోలీ లో గడ్డాఫీకి చెందిన నివాస భవన సముదాయ భవనంలోని పరిపాలనా భవనంపై క్షిపణి దాడి చేయడం వెనక అమెరికాకి గడ్డాఫీని చంపే ఉద్దేశ్యం ఉన్నట్లు అనుమానాలు తలెత్తాయి. అమెరికా అదేమీ లేదని తెలిపింది. లిబియా పై పశ్చిమ దేశాల ఉమ్మడి మిలట్రీ చర్యను విశ్లేషకులు ఇరాక్ పై దాడితో పోలుస్తున్నారు. అదేం లేదు, కొద్దిరోజుల్లో ముగిసిపోతుంది అని అమెరికా అంటోంది.
