‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 1


Gujarat carnage

హిందూ మతోన్మాదుల జాతి హననంలో దహనమైన ముస్లింల శవాలు

2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం చర్య తీసుకున్నారు అనడిగిన అమెరికా రాయబారి ప్రశ్నకు కోపంతో, “అది గుజరాత్ అంతర్గత వ్యవహారం. ఆ విషయం గురించి ప్రశ్నించే అధికారం అమెరికాకు లేదు” అని నరేంద్ర మోడి హుంకరించిన విషయం అమెరికా రాయబారి రాసిన కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఇండియాలో పని చేసిన అమెరికా రాయబారులు అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిన కేబుల్ ఉత్తరాలను వికీలీక్స్ నుండి సంపాదించి ‘ది హిందూ’ పత్రిక వారం రోజులుగా ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ప్రచురించిన ఒక కేబుల్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి తాము సాగించిన హత్యాకాండను అమెరికా రాయబారి వద్ద ఎలా సమర్ధించుకున్నదీ తెలియజేసింది.

ముంబైలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఉన్న కాన్సల్ జనరల్ మైఖేల్ ఎస్. ఓవెన్, నవంబరు 16, 2006 తేదీన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడితో గాంధీనగర్ లో సమావేశమయ్యాడు. 2002 లో గుజరాత్ లో జరిగిన ముస్లింల దారుణ హత్యాకాండలో నరేంద్ర మోడీకి పాత్ర ఉన్నందుకుగాను మార్చి 2005 లో అతని వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. వీసా రద్దు తర్వాత నరేంద్ర మోడితో ఒక అమెరికా రాయబారి మాట్లాడటం అదే మొదటిసారి. ఫిబ్రవరి 27, 2002 తేదీన గోధ్రా రైలు స్టేషన్ లో ఆగిఉన్న సబర్మతి ఎక్స్ ప్రెస్ కి చెందిన ఒక రైలుబోగీకి నిప్పుపెట్టి యాభైమందికి పైగా కరసేవకులను చంపివేసిన నాటినుండి నాలుగు వారాల పాటు నిర్విఘ్నంగా కొనసాగిన ఆ దారుణ మారణకాండలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోగా మరో 223 మంది జాడ తెలియలేదు. 2005 లో పార్లమెంటులో సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారికంగా చేసిన ప్రకటనలో ఈ సంఖ్యలను పొందుపరిచారు. వాస్తవ సంఖ్య దీనికి అనేక రెట్లు ఉన్న సంగతి అందరూ అంగీకరించే విషయం.

నవంబరు 27, 2006 తేదీన అమెరికా ప్రభుత్వ స్టేట్ డిపార్డుమెంటుకి పంపిన కేబుల్ లేఖలొ అమెరికా రాయబారి ఓవెన్ నరేంద్ర మోడితో జరిపిన సంభాషణ వివరాలను రాశాడు. కాన్ఫిడెన్షియల్ (అతి రహస్యం) గా వర్గీకరించిన ఈ కేబుల్ కాపీలను ప్రపంచంలోని అవసరం అనుకున్న ఇతర దేశాల అమెరికా రాయబార కార్యాలయాలకు కూడా పంపించారు. విశ్రాంతిగా కూర్చొని ఉన్న నరేంద్ర మోడి తన ఆధ్వర్యంలోని రాష్ట్రప్రభుత్వం, మౌలిక వసతులు నిర్మించడంలోనూ,  ఆర్ధికాభివృద్ధిని ప్రోత్సహించడంలోనూ సాధించిన విజయాలను ఉత్సాహంగా చెప్పినట్లు రాయబారి తెలిపాడు. గుజరాత్ అభివృద్ధిపై చర్చ జరుగినంత సేపు ఉత్సాహంగా ఉన్న నరేంద్రమూడి వివాస్పద అంశం మీదికి చర్చ మళ్లిన వెంటనే కోపంగా మారిపోయాడని రాయబారి రాశాడు.

Gujarat carnage

హిందూ మతోన్మాదుల స్వైరవిహారంలో అవయువాలు కోల్పోయిన పాలబుగ్గలు

“మన వ్యాపార సంబంధాల పట్లా, గుజరాత్ ప్రజలకూ అమెరికా ప్రజలకూ ఉన్న సంబంధ బాంధవ్యాల పట్లా మేము చాలా సంతృప్తికరంగా ఉన్నాం. అయితే రాష్ట్రంలోని మతపరమైన వాతావరణం పట్ల మేము ఆందోళనతో ఉన్నాము. ప్రత్యేకంగా 2002 జరిగిన భయంకరమైన మత మారణకాండకు ఇంతవరకూ ఎవర్నీ బాధ్యులుగా గుర్తించకపోవడం పట్ల చాలా ఆందోళనగా ఉన్నాం. మత హింసకు బాధ్యులైనవారు చట్టం ద్వారా ఎటువంటి శిక్షకు గురికాబోరన్న వాతావరణం వలన మత సంబంధాలు మరింతగా దిగజారుతాయన్న ఆందోళనగా ఉంది. గుజరాత్ ప్రభుత్వం ఈ విషయంలో ఏమనుకుంటున్నది?” అని రాయబారి నరేంద్ర మోడిని ప్రశ్నించినట్లుగా రాశాడు.

“ఈ ప్రశ్నకు నరేంద్రమోడి కోపంతో సుదీర్ఘ సమాధానం ఇచ్చాడు. మోడి ప్రధానంగా మూడు విషయాలు చెప్పాడు. 2002 లో జరిగిన సంఘటనలు గుజరాత్ రాష్ట్ర అంతర్గత వ్యవహారం. ఇందులో జోక్యం చేసుకునే అధికారం అమెరికాకు ఏ మాత్రం లేదు; అమెరికా స్వయంగా భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలో దోషిగా ఉంది (అబుఘ్రయిబ్ జైలు, గ్వాంటనామో బే, సెప్టెంబరు 11 తర్వాత భారత సిక్కులపై అమెరికాలో జరిగిన దాడులు తదితర అంశాలను నరేంద్ర మోడి ప్రస్తావించాడు) కనుక అటువంటి విషయాల్లో ఇతరులను ప్రశ్నించే నైతిక స్ధానంలో అమెరికా లేదు; మూడవది భారత దేశంలో మరే ఇతర రాష్ట్రంలోని ముస్లింల కంటే గుజరాత్ ముస్లింలు చాలా ముందంజలో ఉన్నారు. కనుకు ఎవరికైనా ఈ విషయంలో సణుగుడు ఎందుకు? అని నరేంద్రమోడి ప్రశ్నించాడు.”

“అమెరికా ఒక్కటే ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేయడం లేదు. భారత దేశపు జాతీయ మానవ హక్కుల సంస్ధే స్వయంగా ‘గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మత హింసను నివారించడంలో అన్ని విధాలుగా విఫలమైంద’ని పేర్కొన్నది. జరిగిన హత్యాకాండకు బాధ్యులుగా ఎవర్నీ గుర్తించకపోవడం పట్ల, తద్వారా చట్టం నుండి వారు తప్పించుకోగలరన్న వాతావరణం ఏర్పడుతున్నదన్న అంశం పట్లా అనేక వర్గాల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలనే మేము వ్యక్తీకరిస్తున్నాం. రెండోది, అబూఘ్రయిబ్ విషయానికి సంబంధించి: అమెరికన్లు కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడవచ్చు. అయితే అలాంటివి జరిగినప్పుడు పరిశోధించి, విచారించి, తప్పు చేసిన వారిని శిక్షించడానికి అమెరికాలో స్పష్టమైన పద్ధతులున్నాయి. అటువంటి పద్ధతులనే గుజరాత్ లో కూడా చూడాలని మేము గానీ ఇతరులు గానీ భావిస్తున్నాము” అని మోడీకి చెప్పినట్లుగా అమెరికా రాయబారి ఓవెన్ తన కేబుల్ లో రాశాడు.

వ్యాఖ్యానించండి