లిబియా పౌరుల రక్షణకై చేసే దాడుల్లో పౌరులే చనిపోతున్నారు -అరబ్ లీగ్


Amir moussa

అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ 'అమీర్ మౌసా'

అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అమీర్ మౌసా లిబియాపై పశ్చిమ దేశాల దాడులు తీవ్ర స్ధాయిలో ఉండడాన్ని ఆదివారం విమర్శించాడు. లిబియా పౌరులను గడ్డాఫీ విమానాల దాడులనుండి రక్షించడకోసం భద్రతా సమితి అనుమతి ఇచ్చింది తప్ప వారిని చంపడానికి కాదన్నాడు. లిబియాలో జరుగుతున్నది లిబియాపై ‘నో-ఫ్లై జోన్’ అమలు చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా ఉన్నదని విమర్శించాడు. పౌరుల రక్షణనే మేం కోరాం తప్ప మరింతమంది పౌరులపై దాడులు చేయడం కాదన్నాడు.

ఆదివారం పశ్చిమ దేశాలను విమర్శించిన అమిర్ మౌసా సోమవారం వచ్చేసరికి కైరోలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ లిబియా వ్యతిరేక కూటమిలో విభేదాలు వచ్చాయన్న వార్తను ఖండించాడు. ‘నో-ఫ్లై జోన్’ అమలు చేయడంలో, పౌరులను రక్షించడంలో తాము ఐక్యంగానే ఉన్నామని చెప్పాడు. రక్షించడంలో ఐక్యంగా ఉన్నాం తప్ప తీవ్రస్ధాయిలో దాడులు చేసి పౌరులను చంపడంలో తమకు విభేదాలున్నాయని అమీర్ పరోక్షంగా చెప్పదలుచుకున్నాడా?

భద్రతా సమితి ఆధ్వర్యంలో నో-వ్లై జోన్ అమలు చేయడం అంటే పశ్చిమ దేశాల నాయకత్వంలో యుద్ధం చేయడమే. పశ్చిమ దేశాలు కేవలం లిబియా పౌరులను రక్షించడానికి మాత్రమే యుద్ధవిమానాలతో దాడులు చేస్తాయని కూడా నమ్మలేని విషయం. తమకు ప్రయోజనం లేకుండా పశ్చిమ దేశాలు ఈ పని చేయవు.ఈ విషయం అమీర్ మౌసాకి తెలియదని భావించలేము. స్వయంగా దొంగ చేతికి తాళం ఇచ్చి దొంగ! దొంగ! అని అరిస్తే ఏం ప్రయోజనం?

వ్యాఖ్యానించండి