జీ-మెయిల్ సర్వీసును చైనా ప్రభుత్వం అడ్డగిస్తోంది -గూగుల్


Google-China

గూగుల్ చైనా వెబ్ సైట్

తమ ఈ-మెయిల్ సర్వీసుకు చైనా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని గూగుల్ సంస్ధ ఆరోపించింది. ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లొ లాగా చైనా ప్రదర్శనలు నిర్వహించాలన్న సందేశాలు వ్యాప్తి చెందుతున్నందు వలన చైనా ప్రభుత్వం జీ-మెయిల్ సర్వీసుకు ఆటంకాలు సృష్టిస్తోందని జీ-మెయిల్ వినియోగదారులు చెప్పినట్లు బిబిసి తెలిపింది. గత కొద్ది వారాలుగా చైనా అధికారులు గూగుల్ మెయిల్ సర్వీసు వినియోగించకుండా ఆటంకాలు సృష్టిస్తూ జీ-మెయిల్ సాఫ్ట్ వేర్ లోనే ఏదో సమస్య ఉందని భావించేలా చేస్తోందని గూగుల్ తన ఆరోపణలను మరోసారి చైనా ప్రభుత్వం పై ఎక్కుపెట్టింది. తమ సాఫ్ట్ వేర్ లో ఎటువంటి సాంకేతిక లోపాలూ లేవని అది వివరించింది.

గత సంవత్సరం గూగుల్, చైనా ప్రభుత్వాల మధ్య ఘర్షణ జరిగింది. చైనా హ్యాకర్లు జీ-మెయిల్ ఎకౌంట్లున్న ప్రముఖుల ఈ-మెయిళ్ళ లోకి జొరబడి అందులో సమాచారాన్ని దొంగిలించారని గూగుల్ ప్రకటించింది. అందుకని గూగుల్ సెర్చ్ ఇంజన్ కి చైనా ప్రభుత్వం విధించిన వడపోత నిబంధనలను పాటించబోమని ప్రకటించి ఘర్షణకు తెర లేపింది. చైనాలోని మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్య సంస్కరణల కోసం పోరాడుతున్నవారి ఈ-మెయిళ్ళలోకి ప్రధానంగా చొరబాటు జరిగిందని చెపుతూ దీని వెనక రాజకీయ లక్ష్యాలున్నాయని గూగుల్ ఆరోపించింది.అయితే చైనా ప్రభుత్వం గూగుల్ ఆరోపణలను తిరస్కరించింది. చైనా ప్రభుత్వం అలాంటి హ్యాకింగ్ దాడులను ఎప్పుడూ ప్రోత్సహించదని తెలిపింది. ప్రభుత్వ కంప్యూటర్లే హ్యాకింగ్ దాడులకు గురవుతున్నాయనీ, తాముకూడా హ్యాకింగ్ బాధితులమేనని ప్రకటించింది. ఆధారాలు లేని ఆరోపణలు చేయవద్దని కోరింది.

చైనాలో గూగుల్ సెర్చ్ లో వచ్చే సెర్చ్ ఫలితాల్లో కొన్ని ఫలితాలు రాకుండా చైనా ప్రభుత్వం నిషేధిస్తుంది. టిబెట్ ఆందోళనకి సంబంధించిన వార్తలు, ఫలూన్ గాంగ్ వార్తలు, మానవహక్కుల సంఘాల వార్తలు, బూతు సైట్లు మొదలైనవి గూగుల్ సెర్చి ఫలితాల్లో రాకుండా గూగులే ఫిల్టర్లు వాడేలా ప్రభుత్వం నిర్దేశిస్తుంది. గూగుల్ సాఫ్ట్ వేర్ ద్వారా అటువంటి అంశాలపై సెర్చ్ రిజల్ట్స్ రాకుండా వడపోత అయ్యేటట్లు చేస్తుంది. అలా చేయకపోతే ప్రభుత్వం చైనాలో వ్యాపారం చేయనీయదు. చైనాలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఆ మార్కెట్ పోగొట్టుకోవడం ఇష్టం లేక చైనా ప్రభుత్వం షరతులను గూగుల్ పాటిస్తుంది.

హ్యాకింగ్ జరిగిందని ప్రకటించాక ప్రభుత్వం నిర్దేశించిన వడపోత ఇక చేసేది లేదని గూగుల్ ప్రకటించింది. చైనా ప్రభుత్వం ఊరుకోలేదు. తమ దేశంలో వ్యాపారం చేయాలనుకుంటే ఫిల్టర్లు వాడాల్సిందేనని కుండ బద్దలు కొట్టింది. లేకుంటే పెట్టే బేడా సర్దుకోవచ్చని నిర్ధక్షిణ్యంగా చెప్పేసింది. గూగుల్ తన చైనా సైట్ ని మూసేసి హాంకాంగ్ సైట్ కి చైనా గూగుల్ సైట్ తో లింకు కలిపింది. అంటే చైనాలోని వినియోగదారులు హాంకాంగ్ గూగుల్ సైట్ ని వినియోగించేలా రూపొందించుకుంది.కానీ చైనా ప్రభుత్వం స్వయంగా ఫిల్టర్లు వాడుతుంది. “గ్రేట్ వాల్ ఆఫ్ చైనా” అనే పేరుగల ఫైర్ వాల్ సాఫ్ట్ వేర్ ని వాడుతుంది. ఫైర్ వాల్ అనేది హ్యాకింగ్ ని అడ్డుకునే సాఫ్ట్ వేర్. అన్ని బ్రౌజర్లు తమ ఫైర్ వాల్ సావ్ట్ వేర్ రూపొందించుకుంటాయి. చైనా ప్రభుత్వం చైనా ఇంటర్నెట్ వినియోగదారులు అన్ని వెబ్ సైట్లు చూడకుండా నిరోధించడానికి ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందించుకుని దాని ద్వారా సెర్చి రిజల్ట్శ్ ను నియంత్రిస్తుంది.

దానివలన చైనా ఇంటర్నెట్ ట్రాఫిక్ ని గూగుల్ హాంకాంగ్ సైట్ కి మళ్లించినా ఫలితం లేకపోయింది. ఈ లోపల అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ గూగుల్ కి మద్దతుగా దిగింది. చైనా ఇంటర్నెట్ వినియోగదారుల స్వేచ్ఛకు అక్కడి ప్రభుత్వం ఆటంకం కలిగిస్తోందని ప్రకటనలు గుప్పించింది. గూగుల్ కి మద్దతుగా ఇతర కంప్యూటర్ సంస్ధలు (యాహూ, మైక్రో సాఫ్ట్ లాంటివి) కూడా తమ చైనా కార్యకలాపాలను ఆపేయాలని పిలుపునిచ్చింది. కాని ఆ పిలుపుకి ఎవరూ స్పందించలేదు. మైక్రో సాఫ్ట్ అయితే గూగుల్ వ్యవహారం “అర్ధం లేనిది” గా కొట్టిపారేసింది. నాలుగైదు నెలల తర్వాత గూగులే దిగొచ్చి చైనా షరతులు అంగీకరించి మళ్లీ వ్యాపార లైసెన్సు రెన్యువల్ చేసుకుంది.

ఆ గొడవ తర్వాత తాజాగా మళ్ళీ గూగుల్ గొడవ మొదలు పెట్టింది. ఇది ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

వ్యాఖ్యానించండి