ఇరాన్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించబోతున్న విషయం భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వశాఖలకు తెలపడానికి ముందు అమెరికా రాయబారికి భారత విదేశీ మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేసిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడయ్యింది. ఏప్రిల్ 29, 2008 తేదీన ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ ఇండియా రానున్నాడని కొత్తఢిల్లీ లోని అమెరికా రాయబారి కార్యాలయంలో ఉండే రాజకీయ విభాగాధిపతికి భారత విదేశీ మంత్రిత్వ శాఖ లొని ఓ సీనియర్ అధికారిణి సమాచారం ఇచ్చినట్లుగా రాజకీయ విభాగాధిపతి అమెరికా ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో తెలిపాడు.
“భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వ శాఖలకు ఈ సమాచారం తెలపడానికంటే ముందుగానే, బహిరంగంగా ప్రకటించడానికంటే ముందుగానే ఈ సమాచారాన్ని మనకు తెలుపుతున్నట్లుగా భారత అధికారిణి రాసింది” అని అమెరికా రాయబార కార్యాలయంలొని రాజకీయ విభాగాధిపతి కేబుల్ లో రాశాడు. “భారత ప్రధాని మన్మోహన్ సింగ్, తాను ఇరాన్ సందర్శించాలన్న ఆహ్వానంతో పాటు ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ ఇండియాను సందర్శిస్తానన్న కోరికను కూడా గతంలో తిరస్కరించారు. ఎట్టకేలకు మా ప్రధాని ఇరాన్ అధ్యక్షుడి సందర్శనను ఇప్పుడు అంగీకరించారు” అని ఆ అధికారిణి తనకు తెలిపినట్లుగా రాయబారి కేబుల్ లో రాశాడు. ఏప్రిల్ 15, 2008 తేదీన పంపిన ఈ కేబుల్ ను “రహస్యం/విదేశీయులకు కాదు” గా రాయబారి వర్గీకరించాడు.
ఇరాన్ అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ప్రచార, ప్రయత్నాలు ఉచ్చ దశలో ఉన్న ఆ సమయంలో ఇండియా అమెరికా ఆగ్రహానికి గురి కాకుండా ఉండటానికి ప్రధాని మన్మోహన్, ఆయన నాయకత్వంలోని యు.పి.ఏ ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నించాయని సదరు కేబుల్ తెలిపింది. ఇండియా, అమెరికాల పౌర అణు ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడానికీ, ఇరాన్ అధ్యక్షుడి సందర్శననకూ మధ్య సంబంధం ఉందని కూడా కేబుల్ అమెరికా ప్రభుత్వానికి విశదపరిచింది.
అయితే సాధారణ అలవాటుకి భిన్నంగా, అమెరికా రాయాబార కార్యాలయంలోని చార్జి డి’ ఎఫైర్స్ “స్టీవెన్ వైట్” పేరుతో పంపిన ఈ కేబుల్ లో ఇరాన్ అధ్యక్షుడి రాక సమాచారం అందించిన అధికారిణి పేరు రాయలేదు. కేబుల్ లో ఇంకా ఇలా రాశారు, “ఇరాన్ అణు విధానానికి సంబంధించిన ఐక్యరాజ్య సమితి ఆంక్షలను అనుసరిస్తున్నట్లుగా అభిప్రాయం కలగజేస్తూ, బయటకు తెలియకుండా ఇరాన్ తో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించాలన్న కోరిక మన్మోహన్ ప్రభుత్వానికి ఉన్నట్లు తోస్తున్నది. అయితే ఇరాన్ అధ్యక్షుడిని ఆహ్వానించడంతో ‘బయటకు తెలియకుండా ఇరాన్ తో సంబంధాలు కొనసాగించే’ ఎత్తుగడ రద్దైనట్లే.”
“వాషింగ్టన్ పోస్ట్ పత్రిక అంచనా ప్రకారం ఈ సమయంలో అహ్మదీ నెజాద్ సందర్శనను అంగీకరించడానికి కారణం యు.పి.ఏ ప్రభుత్వంలో భాగస్వాములైన వామపక్ష పార్టీలనూ, దేశంలోని ముస్లింలను మంచి చేసుకోవాలన్న ప్రయత్నమే. అంటే భారత విదేశాంగ విధానం స్వతంత్రతను కాపాడుతున్నామనీ, అలాగే పొరుగున ఉన్న ముస్లిం దేశాలతో సంబంధాలను కాపాడుతున్నామనీ చెప్పుకోవడం. ఇండియా సార్వభౌమత్వాన్ని ఫణంగా పెట్టి ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయెల్ లకు దగ్గరవుతున్నదన్న ప్రచారంతో వామపక్ష పార్టీలు ఓటర్ల వద్ద మార్కులు కొట్టేస్తున్న నేపధ్యంలో ఈ ప్రయత్నాలు అవసరం.”
ఇంకా కొనసాగిస్తూ “ఇది భారత ప్రభుత్వ ‘ఇచ్చి పుచ్చుకునే’ విధానానికి సంబంధించిన విశాల పధకంలో భాగం. అమెరికాతో అణు ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందు వామ పక్షాలనూ, ముస్లింలనూ మంచి చేసుకునే ఎత్తుగడలో భాగం ఇది. ఇండియా అమెరికాల అణు ఒప్పందాన్ని ఇండియా ఎప్పుడు ఆచరణాత్మకం చేస్తుందన్న విషయానికొస్తే… కొందరి సిద్దాంతం ప్రకారం ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసే మే 9 తర్వాత. అప్పటికి ఇరాన్ అధ్యక్షుడి ఇండియా సందర్శన పూర్తవుతుంది. అహ్మది నెజాద్ తో సమావేశం మాటున అణు ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్ళాలని భారత ప్రభుత్వం భావిస్తున్నది. అమెరికా ఇండియా సంబంధాలను అవసరం కంటే ఎక్కువగా పెంచుతున్నారన్న విమర్శకులకు అహ్మది నెజాద్ రాకతో సమాధానం చెప్పాలని భావిస్తున్నది.” అని రాశాడు.
ఇరాన్ తో సంబంధాలకు సంబంధించి బాధ్యుడైన జాయింట్ సెక్రటరీతో అర్జెంటుగా సమావేశం కావాలని తాను ప్రయత్నిస్తున్నట్లు రాయబారి కేబుల్ లో రాశాడు. ఇరాన్ అధ్యక్షుడి సందర్శనపై మరింత స్పష్టతను కోరడానికీ, అహ్మది నెజాద్, ఇరాన్ ప్రభుత్వాలతో సంబంధాల పట్ల మనకున్న అభ్యంతరాలను వివరించి హెచ్చరించడానికి ఈ సమావేశం కోరినట్లు రాయబారి రాశాడు. అహ్మది నెజాద్ ఇండియా వచ్చినప్పుడు అమెరికా ఆయనకేమన్న సందేశాలివ్వాలనుకుంటే తమకిస్తే అందజేస్తామనీ, ఈ సందర్శన విషయంలో మార్గదర్శకాలుంటే చెప్పాలనీ విదేశీ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారిణి కోరినట్లుగా కూడా అమెరికా రాయబారి తన కేబుల్ లో రాశాడు.
అమెరికా రాయబారుల కేబుళ్ళలో స్పష్టంగా తెలుస్తున్న ఒక విషయం ఏంటంటే అమెరికాతో ఇండియా నెరపే సంబంధాల్లో ఇండియా సార్వభౌమత్వం, స్వతంత్రత తాకట్టు పెట్టబడుతున్నదని. 1970ల్లోనే భారత విప్లవకారుల నాయకుడు తరిమెల నాగిరెడ్డి “తాకట్టులో భారతదేశం” అంటూ ఆంధ్ర రాష్ట్ర హైకోర్టులో చేసిన సుదీర్ఘ వాదన ఎంత సరైనదో అమెరికా రాయబారుల టెలిగ్రాం ఉత్తరాల ద్వారా రుజువౌతున్నది.
