ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లకు ఇప్పుడు మరో దేశం జత కలిసింది. అమెరికాతో పాటు ఐరోపాలలోని పెత్తందారీ దేశాలు మరో బాధిత దేశాన్ని తమ ఖాతాలో చేర్చుకున్నాయి. శనివారం లిబియాపై ఫ్రాన్సు జరిపిన విమానదాడులతో ప్రారంభమైన పశ్చిమ దేశాల కండకావరం ఆదివారం అమెరికా, బ్రిటన్ ల క్షిపణి దాడులతో మరింత పదునెక్కింది. ప్రత్యక్షంగా ఇరాక్, ఆఫ్ఘనిస్తాల్ దేశాల ప్రజలు కష్టాల సుడిగుండం లోకి నెట్టడంతో పాటు పరోక్షంగా తమ దేశాల ప్రజలను కూడా ఆర్ధిక, సామాజిక సంక్షోభం లోకి నెట్టి వేసే ఈ సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధాలు అంతిమంగా ప్రపంచ ఆర్ధిక సంక్షోభంగా ప్రపంచాన్ని సైతం చుట్టుముట్టిన ఫలితాన్ని ప్రపంచ ప్రజలు చవి చూశారు.
ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దురాక్రమణ యుద్ధాలకు పూర్తిగా పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాలే చోదక శక్తులుగా పనిచేశాయి. ప్రపంచ ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పి సైనిక చర్య ప్రారంబించిన అమెరికా నాయకత్వం లోని దుష్ట దేశాల కూటమి ఇప్పుడు లిబియాపై దాడులు ప్రారంభించి అక్కడి పౌరులను చంపుతున్నాయి.
దాదాపు నెలరోజుల వరకు లిబియాలో అంతర్యుద్ధం జరుగుతున్నా జోక్యం చేసుకోవడానికి వెనకాడుతూ వచ్చిన అమెరికా ఇప్పుడు ఒక్కుమ్మడిగా విరుచుకు పడటం వెనక ఉన్న సామ్రాజ్యవాద ఎత్తుగడను పరిశీలించ వలసి ఉంది. ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో పీకలదాక యుద్ధం లో కూరుకుపోయి తాను బలహీనపడటమే కాకుండా ప్రపంచానికి ‘ఆర్ధిక సంక్షోభాన్ని’ అమెరికా ప్రసాదించింది. ఆర్ధిక సంక్షోభం వలన ఉద్యోగాలు కోల్పోయి, జీతాలు కోతలకు గురై, సంక్షేమ సదుపాయలు రద్దయి చివరికి దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న పజాస్వామిక హక్కులను సైతం కోల్పోతున్న స్ధితిలో ప్రపంచ ప్రజానీకం ఉంది.
తమ దుస్ధితికి కారణమైన అమెరికా బడా కంపెనీలపైనా, వాటికి ‘ఉద్దీపనా’ ప్యాకేజీలను పందేరం పెట్టడం పైనా పశ్చిమ దేశాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దాని ఫలితంగానే గత సంవత్సరం జరిగిన చట్టసభల ఎన్నికల్లో అమెరికా ప్రజలు అధికారంలో ఉన్న డెమొక్రటిక్ పార్టీని చావు దెబ్బ తీసి మరో ప్రత్యామ్నాయం లేని పరిస్ధితుల్లో రిపబ్లికన్ పార్టీకి అత్యధిక స్ధానాలను కట్టబెట్టారు. అనేక రాష్ట్రాలలకు గవర్నర్లుగా రిపబ్లికన్ అభ్యర్ధులను ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికయిన రిపబ్లికన్ గవర్నర్లు ప్రజల గోళ్లూడగుతున్న సంగతి ఇప్పుడు అపస్తుతం.
తమ తమ దేశాల్లో ఉన్న ప్రతికూల పరిస్ధితుల వలన లిబియాపై దాడికి అమెరికా సిద్ధ పడలేక పోయింది. అదే సమయంలో లిబియా దాడి చేసే అవకాశాన్ని వదులుకోవడం కూడా దానికి ఇష్టం లేదు. ఒక పద్ధతి ప్రకారం లిబియా నాయకుడు గడ్డాఫీని తొలగించక తప్పదు అన్న అభిప్రాయాన్ని కలిగించడానికి కృషి చేసింది. పదే పదే లిబియాపై దాడికి అంతర్జాతీయ సమాజం అనుమతి కావాలంటూ ప్రకటించి తనకు లిబియా వనరులపై ఆసక్తి లేదన్న అబిప్రాయాన్ని వ్యాపింపజేయడానికి కృషి చేసింది. లిబియా తిరుగుబాటుదారులకు తమ వందిమాగధులైన వార్తా సంస్ధల ద్వారా అత్యధిక ప్రచారం కల్పిస్తూ వారే విదేశీ జోక్యం కోరుతున్నట్లుగా వాతావరణాన్ని సృష్టించింది.
లిబియా తిరుగుబాటుదారుల్లో విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నవారి అభిప్రాయాలను పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది. అమెరికా వెనకడుగును లిబియా అధిపతి గడ్డాఫీ అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యాడో, తన బలంపై అధిక అంచనాలను పెట్టుకున్నాడో, లేక నాలుగైదు సంవత్సరాలుగా అమెరికాకు సహకరిస్తున్నందున దాడిచేయకపోవచ్చని నమ్మాడో తెలియదు కాని మొదటినుంచి అతను చేసిన ప్రకటనలు పశ్చిమ దేశాల జోక్యానికి అవకాశం పెంచేలా సాగాయి.
ఉదాహరణకు తిరుగుబాటుదారుల కేంద్ర పట్టణం బెంఘాజీ ప్రజలపై గడ్డాఫీ చేసిన ప్రకటనలు ప్రపంచ దేశాలముందు, ముఖ్యంగా అరబ్ దేశాల ముందు ఒక రాక్షడుగా నిలబెట్టాయి. అరబ్ లీగ్, ఆఫ్రికన్ యూనియన్ లాంటి ప్రాంతీయ సంస్ధలు గడ్డాఫీ వ్యతిరేక నిర్ణయం తీసుకోక పోయినట్లయితే పశ్చిమ దేశాల జోక్యానికి అవకాశం ఉండేదికాదు. “బెంఘాజీ ప్రజలను క్షమించేది లేదు” అన్న గడ్దాఫీ ప్రకటన ఆ కోవలోనిదే. సొంత దేశంలోని ప్రజల్లో ఒక సెక్షన్ తనపై తిరగబడితే విదేశీ కిరాయి సైనికులతో పట్టణాలపై దాడులు చేయించడం కూడా ఆ కోవలోనిదే.
లిబియా తూర్పు ప్రాంతం నుండి నడిచే వాయు, సముద్ర ప్రయాణాలపై దాడులు చేస్తానని బెదిరించడం, బెంఘాజీ ప్రజలు ఎటువైపో నిర్ణయించుకోవాలంటూ డెడ్ లైన్లు పెట్టడం, విచక్షణా రహితంగా కిరాయి సైన్యాలతో తిరుగుబాటుదారుల పట్టణాలపై విమాన దాడులకు తెగబడటం, తిరుగుబాటు ప్రారంభదినాల్లో ట్రిపోలీలో జరిగిన ప్రదర్శనపై కాల్పులు జరిపి అనేకమందిని చంపివేయడం… ఇవన్నీ గడ్దాఫీ తన దేశ ప్రజలపైనే కక్షగట్టాడన్న ప్రచారం చేయడానికి పశ్చిమ దేశాలకు అవకాశం దొరికింది. ట్రిపోలి ప్రదర్శనకారులపై జరిపిన కాల్పులను వార్తా సంస్ధలు “జాతి హత్యాకాండ” గా ప్రచారం చేశాయి. ఆ కాల్పుల్లో వందలమంది చనిపోయారని తిరుగుబాటు దారులు కూడా ప్రకటించడం ఆ ప్రచారానికి విశ్వసనీయత ఏర్పడింది.
ఈ ప్రచారంలో నిజమెంతో, అబద్ధమెంతో ప్రపంచానికి ఇంకా తెలియదు. కానీ అది అరబ్ లీగ్ “నో-ఫ్లై జోన్” మద్దతు ప్రకటించడానికి తోడ్పడింది. మొదట నో-ఫ్లై జోన్ ని వ్యతిరేకించిన ఆఫ్రికన్ యూనియన్ ఆ తర్వాత మద్దతు ప్రకటించవలసి వచ్చింది. అసలు ఎటువంటి విదేశీ జోక్యాన్నయినా తీవ్రంగా వ్యతిరేకిందిన ఖతార్ ఇప్పుడు పశ్చిమ దేశాల దాడుల్లో పాలుపంచుకుంటోంది. విదేశీ జోక్యం కూడదని గట్టిగా చెప్పిన చైనా, రష్యాలు ఓటింగ్ నుండి దూరంగా ఉండే దశకు చేరుకున్నాయి. పశ్చిమ దేశాల విధానాలే అరబ్ దేశాల్లో తిరుగుబాట్లు తలెత్తడానికి కారణమంటూ ప్రకటించిన టర్కీ ఇప్పుడు మౌనంగా ఉండిపోయింది. గడ్దాఫీ అహంభావపూరిత ప్రకటనలే ఈ దేశాల వాదనలను బలహీన పరిచాయి.
మార్చి 19న ‘ది హిందూ’ సంపాదకీయం చెప్పినట్లు లిబియా పట్టణాలపై విమానదాడులు చేయడం ఇండియాలో మావోయిస్టులపై దాడులకు మిలట్రీ విమానాల్ని వినియోగిస్తామన్న భారత ప్రభుత్వ నిర్ణయంతో పోలి ఉన్నాయి. మావోయిస్టులు కూడా భారత దేశ ప్రజలే, వారిపై మిలట్రీ విమానాలు ప్రయోగించడం తగదు అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ప్రకటించాడంటే స్వదేశీయులపై మిలట్రీ దాడులు ఎంత వ్యతిరేకతను తెచ్చిపెడతాయో అర్ధం చేసుకోవచ్చు. మావోయిస్టులపై మిలట్రీ విమానాలు వినియోగించే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదు అని అర్జెంటుగా హోం మంత్రి ప్రకటించవలసి వచ్చింది.
అందుకే అమెరికా జాగ్రత్త వహించింది. ఇప్పటికే ముస్లిం ప్రపంచంలో అప్రతిష్టపాలై ఉన్న అమెరికా దాన్ని తీవ్రం చేసుకునే స్ధితిలో లేదు. పైగా ముస్లింలతో సంబంధాలను మెరుగుపరుస్తానంటూ ఒబామా చేసిన ఎన్నికల ప్రచారం ఉండనే ఉంది. పశ్చిమ దేశాల ఎత్తుగడలకు గడ్డాఫీ ప్రకటనలు, ఆచరణ బాగా సహకరించాయి. తీరా భద్రతా సమితి తీర్మానం చేశాక చేసిన ‘కాల్పుల విరమణ’ ప్రకటన విలువ లేకుండా పోయింది. తిరుగుబాటుదారుల పట్టణాల్లో ప్రత్యేకంగా ‘నో-ఫ్లై జోన్ ‘ అమలు చేయాలన్న డిమాండ్ తోనే ప్రదర్శనలు జరిగాయి. ఆ ప్రదర్శనలు ఎంత చిన్నవయినా వార్తా సంస్ధలు కల్పించిన ప్రచారం పెద్దవన్న ప్రభావం కలిగించాయి.
పశ్చిమ దేశాల ఎత్తుగడలను అర్ధం చేసుకునయినా గడ్డాఫీ ప్రాప్త కాలజ్గ్నత ను ప్రదర్శించి వెనక్కు తగ్గి అరబ్ లీగ్, ఆఫ్రికన్ యూనియన్ లాంటి సంస్ధల వద్ద ప్రాంతీయ పరిష్కారం కోసం పరిష్కరించనట్లయితే పశ్చిమ దేశాలకు అవకాశం ఉండేది కాదేమో. అరబ్ దేశాల్లోని నియంతలకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజాస్వామిక ఉద్యమాలు కూడా అమెరికా, ఐరోపాలకు అనుకూలంగా పని చేశాయి.
