అమెరికా విషయంలో బిజెపి ది రెండు నాల్కల ధోరణి -అమెరికా రాయబారి (వికీలీక్స్)


Prakash Javadekar

బి.జె.పి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్

ఇండియా, అమెరికాల అణు ఒప్పందంపై బిజేపి చేసిన తీవ్ర విమర్శలు నిజానికి అంత తీవ్రంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బిజేపి నాయకులే చెప్పిన సంగతిని అమెరికా రాయబారి కేబుల్ ద్వారా బయట పడింది. బిజేపి ది రెండు నాల్కల ధోరణి అనీ అమెరికాతో ఒప్పందాలపై బిజేపి ప్రకటించే వ్యతిరేకత అధికారం కోసమే తప్ప అందులో నిజం లేదని భారత దేశంలో ఎం.ఎల్ పార్టీలు చెప్పడం వాస్తవమేనని వికీలీక్స్ లీక్ చేసిన అమెరికా రాయబారుల కేబుళ్ళ ద్వారా ఇప్పుడు రూఢి అవుతున్నది. వర్గ దృక్పధంతో భారత దేశ పాలకుల గుణగుణాల్ని విప్పిచెప్పే భారత విప్లవపార్టీల అంచనాలు నిజమేనని ‘ది హిందూ’ కొద్దిరోజులుగా వెల్లడిస్తున్న రాయబారి పత్రాలు చెబుతున్నాయి.

డిసెంబరు 25, 26, 2005 తేదీల్లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం యు.పి.ఏ ప్రభుత్వం అమెరికాకి లొంగి ఉండే విదేశీ విధానాన్ని కలిగి ఉండడంపై విమర్శలు చేసింది. కానీ సమావేశం ముగిసిన తర్వాత బిజిపి నాయకులు తమ తీర్మానాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదని అమెరికా రాయబారులతో చెప్పుకున్న సంగతి బయటపడింది. గత కొద్ది రోజులుగా ‘ఓటుకి నోటు’ ద్వారా విశ్వాసం తీర్మానం నెగ్గారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకు పడుతున్న బిజెపి తాజా లీకుతో ప్రధాని మన్మోహన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ను ఏంచేస్తుందో వేచి చూడవలసిందే.

డిశెంబరు 28, 2005 తేదీన, బిజెపి కార్యవర్గ సమావేశం ముగిసిన రెండ్రోజుల తర్వాత, అమెరికా రాయబార కార్యాలయం ఉప ముఖ్యాధికారి రాబర్ట్ బ్లేక్ తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్ ఉత్తరం లో “బిజేపి జాతీయ కార్యవర్గ సభ్యుడు శేషాద్రిచారి ప్రభుత్వ విదేశీ విధానం పై తమ సమావేశం చేసిన తీర్మానాన్ని తీవ్రంగా తీసుకోవద్దని కోరాడు. ముఖ్యంగా తీర్మానంలో అమెరికాకి సంబంధించిన ఉన్న భాగాన్ని పట్టించుకోవద్దని కోరాడు. యు.పి.ఏ కి వ్యతిరేకంగా రాజకీయ మార్కులు కొట్టేయడానికి అనుసరించే ప్రామాణిక పద్ధతిగా శేషాద్రి తమ తీర్మాన్ని కొట్టిపారేశాడు. బిజెపి ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ కూడా ఇటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. ‘ఇండియా, అమెరికాల సంబంధం పట్ల వాస్తవానికి బిజేపికి భాధమీ లేదు. ఇంకా చెప్పాలంటే, అణు విధానంపై ఇండియా, అమెరికా లు మరింత ముందుకెళ్ళాలనే బిజెపి కోరుకుంటోందని జగదేవకర్ చెప్పాడు” అని రాయబారి రాశాడు.

“సాధారణంగా ప్రాంతీయ విధానాలు (కాశ్మీర్ లాంటివి కావచ్చు) బిజెపి సీరియస్ గా తీసుకుంటుంది. కానీ విచిత్రంగా అమెరికా, ఇండియా సంబంధాల పట్ల బిజెపి కఠిన వైఖరి తీసుకుంది. బిజెపి అంతర్గత నాయకులు చెప్పిందేమంటే దేశీయంగా యుపిఏ పైన రాజకీయ ఆధిపత్యం సాధించడానికి మాత్రమే తమ వైఖరి కఠినంగా ఉండటానికి కారణమని. అమెరికా ప్రభుత్వం ఇలాంటివాటిని పెద్దగా పట్టించుకోదని వారు నిర్ణయించుకున్నారు. పతిపక్షంలో ఉన్న బిజెపి అమెరికా లొంగుబాటు విధానాలను విమర్శించడం ద్వారా సానుకూలతను పొందాలని భావిస్తోంది. భారతీయ ఓటర్లలో ఒక భాగం అమెరికాకు లొంగి ఉండటాన్ని తీవ్రంగా తీసుకుంటారు. బిజెపి లాంటి జాతీయ పార్టీలు భారతదేశ స్వతంత్రత గురించి నొక్కి చెప్పడం ద్వారా తమ కార్యకర్తల్లోని ముఖ్యమైన వారిని శక్తివంత చేయగలుగుతాయి. అమెరికా అధికారులతో ప్రైవేటుగా నచ్చజెప్పుకోవడం ద్వారా వారిని శాంతపరుచుకోవచ్చన్న అంచనాతో బిజెపి ఉంది” అని రాబర్ట్ బ్లేక్ రాశాడు.

అమెరికాతో ఇండియా పెట్టుకున్న స్నేహంలో భారత దేశ స్వతంత్రత మట్టిలో కల్సిపోయిందన్న విషయం పై అమెరికా అధికారులకు స్పష్టమైన అవగాహన ఉందని ఈ కేబుల్ ద్వారా అర్ధం అవుతున్నది.

వ్యాఖ్యానించండి