భూకంపం, సునామీల దెబ్బకు పేలిపోయి అణు ధార్మికత వెదజల్లుతూ ప్రమాదకరంగా పరిణమించిన జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు రియాక్టర్లకు శనివారం విద్యుత్ పునరుద్ధరించగలమని జపాన్ తెలిపింది. భూకంపం సునామీల వలన రియాక్టర్లకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్ధ పని చేయడం మానివేసింది. దానితో రియాక్టర్లలోని ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయే పరిస్ధితి తలెత్తింది. వాటిని చల్లబరచడానికి జపాన్ రెండు రోజులనుండి వాటర్ కెనాన్ ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా సముద్రపు నీటిని జల్లుతున్నారు.
విద్యుత్ లైను రియాక్టర్ల బైట ప్రాంతం వరకూ తెచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రియాక్టర్ల కూలింగ్ వ్యవస్ధకు దాని ద్వారా విద్యుత్ ని అందించి పని చేశేలా చేయాలని నిపుణులు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ ని పునరుద్ధరించగలిగితే నీటిని జల్లే అవసరం తప్పుతుంది. ఇతర కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది.
శనివారం ఐదు, ఆరు రియాక్టర్ల ద్వారా వద్ద విద్యుత్ వ్యవస్ధను పునరుద్ధరిస్తామనీ అణు భద్రతా ఏజెన్సీ తెలిపింది. అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ ను మూడు, నాలుగు రియాక్టర్ల కూలింగ్ వ్యవస్ధలను ఆదివారం నాటికి పని చేసేలా చూస్తున్నామని భద్రతా ఏజెన్సీ చెప్పింది. ఇదిలా ఉండగా అణు విద్యుత్ కేంద్రాల వద్ద ప్రమాద నివారణకు జపాన్ శుక్రవారం అమెరికా సాయం కోరింది. అణు ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలియజేయడంలో నెమ్మదిగా వ్యవహరించామని జపాన్ ప్రధాని అంగీకరించాడు.
ఇప్పటివరకూ 7,300 మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మరో 10,000 మంది జాడ తెలియలేదనీ, 400,000 మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారని వారు తెలిపారు.
