వికీలీక్స్ ను నమ్మలేం -ప్రధాని మన్మోహన్


Manmohan

Manmohan

యు.పి.ఏ – 1 ప్రభుత్వం 2008 సంవత్సరంలో విశ్వాస పరీక్ష నెగ్గడానికి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణను భారత ప్రధాని మన్మోహన్ తిరస్కరించాడు. మా ప్రభుత్వం లో ఎవరూ ఆ సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆయన పార్లమెంటుకు చెప్పాడు. ప్రతిపక్షాలు “ఊహాత్మక, నిర్ధారించని, నిర్ధారించలేని” ఆధరాలతో ఆరోపణలు చేస్తున్నాయని సభకు తెలిపాడు. గురువారం సభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ మన్మోహన్ “వికీలీక్స్” సంస్ధ నమ్మదగినది కాద”ని అన్నాడు. “అసలు వికీలీక్స్ ఉనికినే ప్రభుత్వం గుర్తించడం లేదని ప్రధాని వివరించాడు.

శుక్రవారం ‘ఇండియా టుడే’ సభలో మాట్లాడుతూ మన్మోహన్, “తానుగా డబ్బుతో ఎం.పిల ఓట్లు కొనమని ఎవరినీ ఆదేశించలేదనీ, అటువంటి కార్యక్రమంలొ పాల్గొన్నదీ లేదనీ అన్నాడు. ‘ది హిందూ’ పత్రికలో మూడు రోజుల క్రితం ప్రచురితమైన కేబుల్ అసలు వాస్తవంలో ఉన్నదీ లేనిదీ రుజువుకాలేదని ప్రధాని అన్నాడు. అమెరికా రాయబారి వచ్చి, “అవును, ఈ కేబుల్ నేను మాప్రభుత్వానికి పంపిందే” అని చెబితేకాని కేబుల్ విశ్వసనీయమైనదని నమ్మకూడదని మన్మోహన్ అంతరార్ధం.

కాంగ్రెస్ పార్టీ అన్నా, యు.పి.ఏ ప్రభుత్వం అన్న మన్మోహన్ ఒక్కడే కాదన్న విషయం ప్రధానికి తెలిసే ఉంటుంది. అచ్చంగా యు.పి.ఏ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష నెగ్గే బలం లేదని ప్రధానికి తెలిసి ఉంటుంది. విశ్వాస పరీక్ష నెగ్గాల్సిన అవసరం, ఆత్రుత ఒక్క మన్మోహన్ కేకాకుండా కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకులకు కూడా ఉంటుంది కదా. వారందరి తరపున ఆరోపణలను తిరస్కరిస్తున్నట్లు మన్మోహన్ పార్లమెంటులోని ఉభయ సభలకు తెలిపాడు. కేబుల్లో ఉన్న పేరుగల వారందరూ ఈ ఆరోపణలను ఇప్పటికే దృఢంగా తిరస్కరించారని ఆయన ప్రకటించాడు.

మన్మోహన్ చెప్పిన మరొక విషయం ఏంటంటే ఇటువంటి ఆరోపణలపై ఆనాడే పార్లమెంటు నియమించిన ఒక కమిటీ విచారణ జరిపిందని. ఆ కమిటీ ఆరోపణలకు తగినన్ని ఆధారాలు లేవని తేల్చిందని. అదీ విషయం. తగినన్ని ఆధారాలు దొరకలేదనే కమిటీ అన్నది తప్ప లంచాలిచ్చి విశ్వాస పరీక్ష గెలవలేదని మాత్రం తేల్చలేదు కదా. ఆ ఆధారాలు ఇప్పుడు లభించాయి. డిప్లొమాటిక్ కేబులే ఆ ఆధారం. మన్మోహన్ గారికీ, ఆయన నియమించిన కమిటీకి వికీలీక్స్ ఆధారం సరిపోక పోవచ్చునేమో కాని భారత ప్రజలకు మాత్రం సరిపోతుంది.

2009లో జరిగిన ఎన్నికల్లో ఇవే ఆరోపణలను ప్రతిపక్షాలు ప్రచారం చేశాయనీ కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లు పెరగ్గా, బిజెపి, వామపక్షాల సీట్లు తగ్గిపోయాయనీ దానితో ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు తిరస్కరించినట్లేనని ప్రధాని తన వాదనా చాతుర్యాన్ని ప్రదర్శించాడు. చర్చించి, తిరస్కరించిన ఆరోపణలను మళ్లీ లేవనెత్తడం ఆశ్చర్యకరంగా ఉందనీ ప్రధాని అన్నాడు. మన్మోహన్ సింగ్ గారికి రాజకీయ నాయకుల లక్షణాలు బాగానే అబ్బాయని దీన్ని బట్టి అర్ధమవుతోంది.

లంచాలు ఇవ్వడం, పుచ్చుకోవడం కింది నుండి పైదాకా ఒక సాధారణ ప్రక్రియగా మార్చగలిగిన ప్రభుత్వాలు, ఓటర్లకు సారా తాపి, డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టిన పార్టీలు తమ గెలుపు నిఖార్సైనదని భావించడం లోనే అసలు కిటుకు దాగి ఉంది.

డిప్లొమాటిక్ కేబుల్స్ ప్రచురించనున్నామని నవంబరు, 2010 లో వికీలీక్స్ ప్రకటించినపుడు అమెరికా ప్రభుత్వం వికీలీక్స్ ను ప్రచురించ వద్దని కోరింది. బైటపెడితే కొంతమంది ప్రాణాలకు ప్రమాదమని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేస్తున్న సైనికుల ప్రాణాలకు ముప్పు ఉందని బ్రతిమలాడింది. వాటిని ప్రచురిస్తే వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ చేతులకు మట్టి అంటినట్లేనని శపించింది. ఇవన్నీ కాకుండా జులియన్ పై బలమైన నేరారోపణ చేసి జైల్లో పెట్టాలని ప్రయత్నాలు చేసింది. అందుకోసం గ్రాండ్ జ్యూరీని నియమించింది.

కేబుల్స్ ను ప్రచురించవద్దని కోరినవారిలో అమెరికా రక్షణ శాఖ అధికారులు, సైన్యాధికారులు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్, సాక్ష్యాత్తూ అమెరికా అధ్యక్షుడు ఒబామా… వీళ్లంతా ఉన్నారు. వికీలీక్స్ ని నమ్మకపోతే సరే, వీళ్ళనైనా భారత ప్రధాని నమ్మగలడో లేదో చెప్పాల్సి ఉంది. కేబుల్స్ ప్రచురించడానికి ముందు భారత ప్రభుత్వం తో సహా ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల ప్రభుత్వాలను అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ఆ హెచ్చరికలన్నీ పత్రికలు ప్రచురించాయి. ఒక్క భారత దేశంలొని రాయబారులే కాదు. ప్రపంచంలోని దాదాపు180 దేశాల్లోని అమెరికా రాయబారుల కేబుళ్ళను కృత్రిమంగా సృష్టించడం సాధ్యమనే మన్మోహన్ నమ్ముతున్నారా!?

వికీలీక్స్ లీక్ చేసిన కేబుల్స్ నమ్మదగినవి కావు అనడానికి కూడా ఆధారాలు కావాలి కదా? ఏ ఆధారాతో ప్రధాని వికీలీక్స్ నమ్మదగినది కాదని చెప్పగలరో దేశ ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. “ది హిందూ” లాంటి ప్రతిష్టాత్మక పత్రికలు ఏ ఆధారాలు లేకుండా వికీలీక్స్ ను నమ్ముతున్నాయని ప్రధాని భావిస్తున్నారా?

2 thoughts on “వికీలీక్స్ ను నమ్మలేం -ప్రధాని మన్మోహన్

  1. మన్మోహన్ ను నమ్మలేములే!
    మీ ఆర్టికల్స్ ఫేస్ బుక్ కి షేర్ చేస్తే పోవడం లేదెందుకని? నా ఫేస్ బుక్ ఎకౌంట్ లో చాలా ఫేమస్ జర్నలిస్టులు ఉన్నారు. ఒక్క ఆర్టికల్ మాత్రమే షేర్ అయ్యింది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీ సైటు ఓపెన్ అవుతోంది.

  2. నాకు కూడా అదే సమస్య ఎదురవుతోంది. సాఫ్ట్ వేర్ సమస్య కావచ్చు. వర్డ్ ప్రెస్ వాళ్లకి ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తారేమో చూస్తాను.

    షేర్ చేసిన పోస్టులు క్లిక్ చేస్తే అది ఏ సైట్లో ఉంటే అది ఓపెన్ అవుతుంది. షేరింగ్ లో అదే జరుగుతుంది. ఆ విషయంలో పొరపాటేం లేదు.

వ్యాఖ్యానించండి