గడ్డాఫీ నుండి లిబియా ప్రజలను రక్షించే పేరుతో లిబియాపై దాడి చేయడానికి పశ్చిమ దేశాలు సిద్ధమయ్యాయి. వాటికి కొన్ని అరబ్ దేశాలు సహకరించనున్నాయి. గడ్డాఫీ తనపై తిరుగుబాటు చేస్తున్న ప్రజలను చంపుతున్నాడనే సాకుతో అతని యుద్ధవిమానాలు ఎగరకుండా ఉండటానికి “నిషిద్ధ గగనతలం” అమలు చేస్తామని పశ్చిమ దేశాలు కొన్ని వారాలుగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
లిబియాలోని తూర్పు ప్రాంతాన్నీ, పశ్చిమ ప్రాంతంలోని కొన్ని పట్టణాలను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులపై గడ్డాఫీ బలగాలు వారం రోజులనుండి దెబ్బమీద దెబ్బ తీస్తూ వచ్చాయి. పశ్చిమ ప్రాంతంలోని పట్టణాలను తిరుగుబాటుదారులనుండి వశం చేసుకోవడమే కాకుండా తూర్పు ప్రాంతంలోని పట్టణాలపై కూడా దాడులు ప్రారంభించాడు. తిరుగుబాటుదారుల కేంద్ర పట్టణమైన బెంఘాజీలోకి గడ్డాఫీ బలగాలు ప్రవేశించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
గడ్డాఫీ బలగాల దాడుల్లో ఒక్కో ప్రాంతం కోల్పోతూ వచ్చిన తిరుగుబాటుదారులు గడ్డాఫీ యుద్ధవిమానాలు ఎగరకుండా నో-ఫ్లై జోన్ అమలు చేయాలని ఐక్యరాజ్యసమితిని కోరుతూ వచ్చాయి. ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో పీకలదాకా కూరుకుపోయిఉన్న అమెరికా మరో దేశంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు. కానీ లిబియాలోని వనరులను గడ్డాఫీ పశ్చిమదేశాల చెప్పుచేతల్లొ ఉంచడానికి నిరాకరిస్తుండడంతో అతన్ని గద్దె దించడానికి అమెరికాతోపాటు ఇతర పశ్చిమదేశాలు పధక రచన చేశాయి.
లిబియా పౌరులను గడ్డాఫీ దాడులనుండి రక్షించడానికి “అవసరమైన చర్యలన్నీ” తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో తీర్మానం ఆమోదింపజేసుకున్నారు. ఇండియా కూడా దానికి అనుకూలంగా ఓటేసింది. ప్రస్తుతం పశ్చిమ దేశాలు ఆ ప్రయత్నాల్లో ఉన్నాయి. శనివారమే మరికొన్ని గంటల్లో గడ్దాఫీ బలగాలపై విమానదాడి జరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమదేశాలు దాడి చేస్తే ప్రజలకు ఆయుధాలిస్తానని గతంలో గడ్డాఫీ ప్రకటించి ఉన్నాడు. కనుక ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మాదిరిగా మరో దేశంలో దీర్ఘకాలిక యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారవేయలేము.
ఇప్పటికే మధ్యధరా సముద్రంలో ఉన్న నౌకలకు తోడు అదనంగా మరికొన్ని యుద్ద నౌకలను తరలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. బ్రిటన్ నావికా బలగాలు కూడా మధ్యధరాలొ ఇప్పటికే ఉనాయి. డెన్మార్క్, కెనడాలు ఫైటర్ జెట్ లను సరఫరా చేస్తున్నట్లు తెలిపాయి. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్సులు తమ యుద్ధవిమానాల కేంద్రాలను వినియోగించడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపాయి. నాటోకి చెందిన అవాక్స్ విమానాలు రోజులో 24 గంటలూ లిబియాపై నిఘాలో ఉన్నాయి.
అరబ్ దేశాలనుండి సౌదీ అరేబియా, ఖతార్, యు.ఏ.ఇ, జోర్డాన్ దేశాలు దాడిలో పాల్గొంటున్నాయి. ఈ అరబ్ దేశాలు పశ్చిమ దేశాల అడుగులకు మడుగులొత్తడమే కాక సాటి అరబ్ దేశంపై దాడికి కూడా సిద్ధపడడం దుర్మార్గం. అరబ్ దేశాల కూటమి ‘అరబ్ లీగ్’ పశ్చిమ దేశాలు అమలు చేశే నో-ఫ్లై జోన్ కి మద్దతు తెలిపాయి. లిబియాలోని అరబ్ ప్రజలను రక్షించడమే లక్ష్యం అయితే అరబ్ దేశాలుగా తమలోతాము నిర్ణయించుకుని ఒక చర్యకు సిద్ధపడితే న్యాయంగా ఉండేది. కాని పశ్చిమ దేశాలకు అధికారం అప్పగించడం ఘోరం.
లిబియా భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం లిబియా ప్రజలకు మాత్రమే ఉంది. లిబియా ప్రజల రక్షణ పేరుతో నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి పూనుకోవడం, దానిమాటున లిబియా ప్రజలకు చెందిన ఆయిల వనరులపై ఆధిపత్యం సాధించాలని ప్రయత్నించడం పశ్చిమ దేశాలకు తగనిపని. ఇరాక్ యుద్ధాన్ని కూడా మొదట నో-ఫ్లై నోన్ తోనే ప్రారంభించిన విషయం గుర్తుంచుకుంటే లిబియా మరో ఇరాక్ అయ్యే అవకాశాలున్నాయని అర్ధం అవుతుంది.
ఫ్రాన్సులో మరోసారి నాటో దేశాలు సమావేశమవుతున్నాయి. ఈ సమావేశంలో నో-ఫ్లై జోన్ అమలు తీరుతెన్నులు, గడ్డాఫీ బలగాలపై దాడులకు పధక రచన జరుగుతుంది. అది ముగిశాక వెంటనే లిబియా దాడులు జరగవచ్చు.
