ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 3


ఇరాన్ విషయంలో ఇండియా అమెరికాకి అనుకూలంగా ఓటు వేయడం సరైందా, కాదా, అన్న అనుమానాల భారత సీనియర్ అధికారులను వెంటాడిన విషయం డిసెంబరు 15, 2005 నాటి కేబుల్ బయటపెట్టింది. విదేశీ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న కె.సి.సింగ్ వ్యాఖ్యలు కేబుల్ లో ఉదరించబడ్డాయి. ఈయన సెప్టెంబరు 2005లో ఇండియా తరపున ఇరాన్ లో రాయబారిగా ఉన్నాడు. అమెరికా భావించినట్టుగా ఇరాన్ పై ప్రభావం పడేయడానికి ఇండియాకు ఇక ఏ మాత్రం అనుకూలత లేదని కె.సి.సింగ్ చెప్పినట్లు రాయబారి రాశాడు. “సెప్టెంబరు 24 న ఐ.ఏ.ఇ.ఏ లో జరిగిన ఓటింగ్ నుండి ఇండియా దూరంగా ఉన్నట్లయితే ఇరాన్ అణు విధానంపై ఇండియాకు ప్రభావం చూపగల అవకాశం ఉండేదని కె.సి.సింగ్ అన్నాడు. తమ ఓటు విషయంలో ఇరానియన్లు ఆవేశపూరితంగా స్పందించినట్లు సింగ్ చెప్పాడు. ఇరాన్ వెళ్ళిన భారతీయులను సాధారణ ఇరానియన్లు సైతం తమకు వ్యతిరేకంగా ఎందుకు ఓటేశారని ప్రశ్నించినట్లు సింగ్ చెప్పాడు. ఆ ఓటు వలన ఇండియా ప్రభావం ఇరాన్ లో బాగా బలహీనపడిందని సింగ్ చెప్పాడు. అయితే తానీ విషయాలను అధికారంగా చెప్పడం లేదనీ, కేవలం వ్యక్తిగతంగా మాత్రమే చెబుతున్నాననీ సింగ్ చెప్పాడు” అని రాయబారి డేవిడ్ మల్ఫోర్డ్ కేబుల్ లో రాశాడు.

జనవరి 12, 2006 లో పంపిన కేబుల్లో అమెరికా రాయబారి ఇండియా జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె.నారాయణన్ ని ఉదహరించాడు. “రాబోయే ఐ.ఎ.ఇ.ఏ సమావేశంలో మళ్ళీ ఇరాన్ విషయం వచ్చినప్పుడు ఇండియా ఇరాన్ కి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటోందని నారాయణన్ చెప్పాడు. కానీ దేశీయంగా ఎదురయ్యే విమర్శలగురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఇరాన్ అణు విధానాన్ని భద్రతా సమితికి రిఫర్ చేయడంలో ఇండియా తనకు అనుకూలంగా ఓటు చేయాలని అమెరికా కోరుకుంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఈ దశలో ఇండియా ఓటింగ్ కు దూరంగా ఉండడం సాధ్యం కాదని నారాయణన్ చెప్పాడు. సెప్టెంబరు 24 నాటి ఓటుకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ నారాయణన్ ఈ దశలొ ఓటింగ్ కి దూరంగా ఉన్నట్లయితే, ఇండియా మళ్ళీ ‘అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందా’నికి కట్టుబడే దిశగా వెళ్తున్నట్లు భావించే అవకాశం ఉందని నారాయణన్ తెలిపాడు” అని రాయబారి రాశాడు. “అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం” పై ఇరాన్ సంతకం చేసింది కానీ ఇండియా చేయలేదు. సంతకం చేసిన ఇరాన్ పై నాలుగు సార్లు ఆంక్షలు విధించిన అమెరికా సంతకం చేయని ఇండియాకి అణు ఇంధనం సరఫరా చేయడానికి అంగీకరించింది. అమెరికాకి కావలసింది అణ్వస్త్రవ్యాప్తి నిరోధకం కాదనీ తన అదుపాజ్గ్నలకు లొంగి ఉండడమే దానికి కావలనీ ఈ ఒక్క అంశం విశదపరుస్తుంది.

ఇంత స్పష్టంగా నారాయణన్ చెప్పినా చివరి నిమిషం వరకూ ఇండియా ఏం చేస్తుందోనన్న విషయంలో అమెరికా అనుమానపడుతూనే వచ్చింది. ఫిబ్రవరి 2006 లో ఇరాన్ అణువిధానాన్ని భద్రతా సమితికి రిఫర్ చేసే అంశం ఓటింగ్ కు వస్తుంది. ఆ సందర్భంగా అమెరికా రాయబారి ఫిబ్రవరి 2 న పంపిన కేబుల్ లో భారత ప్రభుత్వం ఇంకా డైలమాలోనే ఉందని రాశాడు. “గట్టిగా అడిగినప్పుడు శ్యామ్ శరణ్ (విదేశీ శాఖ కార్యదర్శి) ఇతర దేశాలు -ఈజిప్టు, దక్షిణాఫ్రికాల గురించి ప్రత్యేకంగా అడిగాడు- ఎలా ఓటు వేస్తున్నదీ అడిగాడు. భద్రతా సమితి శాశ్వత సభ్యులతో సహా పక్క ఓట్లు ఉన్నాయనీ కానీ దేశాల వారీగా వివరాలు తెలియదని చెప్పినప్పుడు ఆ సమాచారం కావాలని శరణ్ అడిగాడు. ఫిబ్రవరి 1 న విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని ‘ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న దేశంగా ఇండియా చైతన్యవంతమైన జాతీయ ప్రయోజనాల వెలుగులో ఇండియా నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. అయినప్పటికీ తీవ్ర విమర్శలు ఎదురవుతున్న నేపధ్యంలో ఈ కాస్త చాటు దొరికినా దానిని అడ్డుపెట్టుకోవాలని చూస్తున్నది. చివరికి అరకొరగా చాటు కల్పించే ఈజిప్టు, దక్షిణాఫ్రికా వంటి ఆకుల వెనక్కు వెళ్లడానికి కూడా తాపత్రయపడుతున్నది” అని రాయబారి రాశాడు.

ఫిబ్రవరి సమావేశంలో కూడా అమెరికాకి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ ఇండియాపై అమెరికా ఒత్తిడి తేవడం మానలేదు. మార్చి 27, 2006 తేదీన పంపిన కేబుల్ లో “5 మిలియన్ టన్నుల గ్యాస్ కొనుగోలుకు ఇరాన్ ప్రాధాన్యతా ధర ఇవ్వడానికి అంగీకరించడంతో ఇండియా వణికి పోయింది. ముఖ్యమైన ఇంధన అవసరాలను కాపాడుకోవడానికి మధ్యేమార్గం దొరక్కపోదా అని వెతుకులాడింది. అయితే ఇరాన్ ను పట్టుకుని వేలాడడితే ప్రాంతీయ స్ధిరత్వానికి ప్రమాదమే కాకుండా భారత దేశంతో కుదుర్చుకునే పౌర అణు ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ నుండి మద్దతు దొరకడం కష్టమైపోతుందని భారత ప్రభుత్వానికి నేను స్పష్టంగా చెప్పాను” అని అమెరికా రాయబారి రాశాడు. అణు ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని అమెరికా ఇండియా ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడించిందన్నమాట. ఇంతా చేసి జపాన్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంతో అణు విద్యుత్ ఎంత ప్రమాదకరమైందో తెలిసిపోయింది. అమెరికా ముందు ఇంతగా మోకరిల్లిందీ, దేశ ప్రజల ఇంధన ప్రయోజనాలను కూడా ఫణంగా పెట్టిందీ అణు విద్యుత్ రియాక్టర్ల కోసం, అణు ఇంధనం కోసం. అవి కూడా అమెరికా, తదితర పశ్చిమ దేశాలు అమ్మాలి, మనం కొనాలి. వాటికి సొమ్ములు, భారత ప్రజల గుండెలపై అణు కుంపటి. ఇదీ భారత పాలకుల నిర్వాకం!

-‘ది హిందూ’ సౌజన్యంతో

వ్యాఖ్యానించండి