ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 1


మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యు.పి.ఏ కూటమి అధికారం చేపట్టినప్పటినుండీ అమెరికా దోస్తీ కోసం ఇండియా వెంపర్లాడింది. అమెరికాతో “వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం” కుదుర్చుకోవడం వలన భారత ప్రజల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం వికీలీక్స్ బయట పెట్టిన “డిప్లొమేటిక్ కేబుల్స్” ద్వారా వెల్లడవుతున్నది. అమెరికా, తన ప్రయోజనాలను నెరవేర్చడం కోసం తన రాయబారుల ద్వారా, ఐ.ఏ.ఇ.ఏ, ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికల ద్వారా ఇండియాపై నిరంతరం ఎలా ఒత్తిడి చేసిందీ తెలుసుకుంటున్న కొద్దీ ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు మన్మోహన్ ప్రభుత్వం అతి తేలికగా లొంగిపోయిన విషయం, ఆ లొంగుబాటులో భారత ప్రజల బ్రతుకులు మరింతగా దుర్భరమయిన విషయం తెలుసుకున్నపుడు సగటు భారతీయుడు “మిస్టర్ క్లీన్” గా భావిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్ “మిస్టర్ పొల్యూటెడ్” అని తెలుసుకొని విస్తుపోక తప్పదు.

ఇరాన్ కి వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలో పశ్చిమ దేశాలు అంతర్జాతీయంగా కుట్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్, ఇండియాలు అనేక సంవత్సరాలుగా మిత్ర దేశాలు. ఇండియా తన పెట్రోల్, గ్యాస్ అవసరాల కోసం ఇరాన్ పై ఆధారపడి ఉంది. తాను జరిపే ఆయిల్ వాణిజ్యంలో ఇండియాకు ఇరాన్ ప్రాధాన్యత ఇస్తుంది. ఇరాన్ పై పశ్చిమ రాజ్యాలు అనేక విధాలుగా చేస్తూ వచ్చిన దాడులను ఇండియా అంతర్జాతీయ వేదికలపై వ్యతిరేకిస్తూ వచ్చింది. అందుకు ప్రతిగానే ఇరాన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కాని మన్మోహన్ ప్రధాని అయ్యాక అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ కి వ్యతిరేకంగా ఐ.ఏ.ఇ.ఏ లోనూ, ఐక్యరాజ్యసమితిలోనూ ఓటు వేయడంతో ఇరాన్ తో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇండియాకు ఇస్తూ వచ్చిన ‘ప్రాధన్య స్ధాయి”ని కొనసాగించడానికి ఇరాన్ ఇప్పుడు ఇష్టపడడం లేదు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ ఇండియాతో ఇరాన్ మామూలుగా వ్యవహరించాలని కోరుకోవడం కూడా అన్యాయమే.

ఇరాన్ నుండి నేరుగా అయిల్ గ్యాస్ లను ఇండియాకు చేరవేసే పైపులైను ప్రాజెక్టు అటకెక్కడంతో పాటు ప్రాధాన్యతా స్ధాయి కోల్పోవడం వలన ఆయిల్, గ్యాసు దిగుమతి రేట్లు కూడా పెరిగిపోయాయి. దానితో నష్టాల పేరుతో భారత ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు ధరలను పెంచుకుంటూ పోవడం, దానివలన అన్ని సరుకుల రవాణా ఛార్జీలు పెరిగిపోయి సగటు భారతీయుడి కొనుగోలు శక్తి పడిపోవడం జరిగింది. దానితో మరింతమంది దరిద్రులు ఇండియాలో తయారయ్యారు. అంతే కాకుండా ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగి మన్మోహన్ ఎప్పుడూ కలవరించే జి.డి.పి వృద్ధి రేటుకు కూడా కొంత మేరకు గండి పడింది.

సెప్టెంబరు 2005లో వియన్నాలో జరిగిన ఐ.ఏ.ఇ.ఏ సమావేశంలో ఇండియా, ఇరాన్ కి వ్యతిరేకంగా ఓటు వేసింది. అంతర్జాతీయ వేదికలపై అమెరికా పక్షం వహించడం ఇండియాకు అదే మొదటిసారి. అలీన ఉద్యమం నాయకుడుగా డబ్ల్యూ.టి.ఓ చర్చల్లో మూడో ప్రపంచ దేశాల ప్రయోజనాలకోసం పోరాడుతున్న దేశంగా పేరు సంపాదించుకున్న ఇండియా ఆ ఓటుతో పరువు పోగొట్టుకుంది. దేశం లోపలా, బయటా భారత ప్రభుత్వ చర్యను ఉతికి ఆరేశారు. సొంత ప్రయోజనాలను సైతం విస్మరించి అమెరికాకి దాసోహం అవడం ఎవ్వరూ క్షమించలేక పోయారు. ఇండియాపై పెరుగుతూ పోయిన ఈ విమర్శలను అమెరికా హర్షించలేక పోయింది. విమర్శలకు జడిసి ఇండియా ఇక తనకు వత్తాసు పలకడం మానేస్తుందేమో అన్న భయం అమెరికాకు పట్టుకుంది. ఇరాన్ కి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటినుండి ఆ విషయంలో అమెరికా ఆలోచనలను, పధకాలను వికీలీక్స్ ద్వారా వెల్లడయిన “రాయబారుల ఉత్తరాలు” పట్టిచ్చాయి.

వియన్నాలో ఓటింగ్ జరిగిన్ నెల తర్వాత అక్టోబరు 20, 2005 న ఇండియాలోని అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్ లొ మన్మోహన్ ప్రభుత్వం పై వెల్లువెత్తిన విమర్శలపట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. “విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్యాం శరణ్ ఈ మధ్యం బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ ల రాయబారులను రప్పించుకున్నాడు. ఇరాన్ అంశాన్ని భద్రతా మండలికి సమర్పంచకుండా పరిష్కరించగల మార్గాలు వెతకాల్సిందిగా కోరాడు. ఇరాన్ కి ఇబ్బంది కలగకుండా తిరిగి చర్చలకు రావడానికి ఇరాన్ ని ప్రోత్సహించాల్సిందిగా కోరాడు. ఇరాన్ వ్యతిరేకత కొనసాగించకుండా ఉండటానికి భారత ప్రభుత్వంపై  ప్రజలనుండి, వివిధ సెక్షన్లనుండి ఒత్తిడి పెరుగుతున్నది. వ్యూహాత్మక నిపుణుల్లో కొద్దిమంది మాత్రమే ఇండియా నిర్ణయాన్ని సమర్ధించారు.” అని ఆ కేబుల్ లో రాశాడు.

“ఇటీవల లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో ‘ది హిందూ’ ఎడిటర్ ఎన్.రామ్ మాట్లాడుతూ ఇరాన్ వ్యతిరేక ఓటు ఇండియా విదేశీవిధానంలో అతిపెద్ద తప్పని అభివర్ణించాడు.అమెరికాకి తాను మిత్రుడనని చాటుకోవడానికే ఇండియా ఈ చర్యకు దిగిందని చెప్పాడు. ఎన్. రామ్ ఒక్కడే కాదు, అనేక మంది పండితులు, మేధావులూ ఇలాగే మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో ఐ.ఏ.ఇ.ఏ లో జరిగే ఓటింగ్ లో పాల్గొనకుండా విరమించుకోవడానికి భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది” అని రాయబారి రాశాడు. “సెప్టంబరులో అమెరికాకి అనుకూలంగా ఇండియా ఓటు వేసినా భవిష్యత్ లో ఆ నిర్ణయాన్ని కొనసాగించడానికి దేశీయంగా మద్దతు ఉండదు. తీవ్ర వ్యతిరేకతను ప్రభుత్వం దేశంలో ఎదుర్కుంటోంది. అందువలన నవంబరు సమావేశంలో పరిస్ధితి ఓటింగ్ దాకా రాకుండా ఉండటానికి తెరవెనుక ప్రయత్నాలు జరగాలని ఇండియా కోరుకుంటున్నది. ఇరాన్ గౌరవంగా దీనినుండి (ఆంక్షల ఓటింగ్) బయట పడేటట్లు చూడాలని శ్యాం శరణ్ కోరినట్లు మన జర్మన్ మితృడు చెప్పాడు. ఇండియా ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ మనం మాత్రం మన విధానాన్ని మార్చుకోకూడదు. ముఖ్యంగా ఐరోపా త్రయం మన విధానాన్ని మార్చకుండా జాగ్రత్త వహించాలి,” అని హెచ్చరించాడు. అంటే ఇండియా వలన ఐరోపా దేశాలు ప్రభావితమవుతాయేమో జాగ్రత్తగా ఉండండి అని ఇండియాలోని అమెరికా రాయబారి తమ ప్రభుత్వాన్ని ఈ కేబుల్ ద్వారా హెచ్చరిస్తున్నాడు.

One thought on “ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 1

  1. వికీలీక్స్ బయటపెట్టిన కేబుల్స్ గురించి రాయడం బాగుంది. ఎం.ఎల్.ఏలు, ఎం.పిలు ఏమి చేస్తున్నారో 99% మంది ప్రజలకు తెలియదు. విప్లవకారులు చెబుతున్నా 90% ప్రజలకు అది చేరడం లేదు. ఈ విషయాలన్నీ భారత విప్లవకారులు చెబుతున్నవే! వికీలీక్స్ తో దానికి బలం చేకూరింది.

    ప్రజలలోకి ఈ విషయాలు తీసుకు వెళ్ళడంలో విప్లవకారులు ఫెయిలవుతూనె ఉన్నారు.

వ్యాఖ్యానించండి