పైచేయి సాధించిన గడ్డాఫీ, ‘నో-ఫ్లై జోన్’ అమలుకు భద్రతా సమితి ఓటింగ్


Pro-Gaddafi forces

గడ్డాఫీ బలగాలు కొద్ది రోజులుగా పైచేయి సాధించాయి

లిబియా తిరుగుబాటుదారుల పై గడ్డాఫీ పైచేయి కొనసాగుతోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు లిబియాకు ముఖద్వారంగా చెప్పుకోదగిన ‘అజ్దాబియా’ పట్టణం కోసం ఇరుపక్షాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. పట్టణాన్ని గడ్డాఫీ బలగాలు మూడువైపుల నుండి చుట్టుముట్టాయి. తూర్పు లిబియాలో అతి పెద్ద పట్టణం, లిబియాలో ట్రిపోలి తర్వాత అతి పెద్ద పట్టణం అయిన బెంఘాజీకి అజ్దాబియా 160 కి.మీ దూరంలో ఉంది. రెడ్ క్రాస్ సంస్ధ సిబ్బంది భద్రతా కారణాలను చూపుతూ బుధవారం బెంఘాజీ నుండి ఇంకా తూర్పున ఉన్న తోబ్రుక్ పట్టణానికి వెళ్ళిపోయారు. అయితే బెంఘాజీనుండి ప్రజలు వలస వెళ్ళడం లేదని బిబిసి విలేఖరి తెలిపాడు.

అమెరికా, ఐరోపాలు లిబియాపై “నో-ఫ్లై జోన్” అమలు చేసే దిశగా చర్యలు తీవ్రం చేశాయి. ఇప్పటివరకూ నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి వెనకాడుతూ వచ్చిన అమెరికా ప్రస్తుతం దానికి సిద్ధపడింది. ఐక్యరాజ్య సమితిలో అమెరిక రాయబారి ‘సుసాన్ రైస్’ లిబియాపై ‘నో-ఫ్లై జోన్’ అమలు చేయాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయని ప్రకటించింది. బుధవారం సాయంత్రం వరకూ భద్రతా సమితిలో ‘నో-ఫ్లై జోన్’ విషయంలో చర్చలు జరిపాయి. చర్చలు గురువారం కూడా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. గురువారం “నొ-ఫ్లై జోన్’ అంశంపై ఏదో ఒకటి తేలే అవకాశం ఉంది. తిరుగుబాటుదారులు త్వరగా ‘నో-ఫ్లై జోన్’ అమలు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.

భద్రతా సమితిలో వీటో అధికారం ఉన్న రష్యా, చైనాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు తయారు చేసిన తీర్మానం డ్రాఫ్ట్ ను తప్పు పట్టాయి. లిబియా పౌరుల రక్షణకోసం ఎటువంటి చర్యనైనా చేపట్టే అవకాశం పొందేలా తీర్మానం ఉందని ఆగ్రహించాయి. వాటి తీర్మానికి ప్రతిగా మరో తీర్మానాన్ని ‘మొదట కాల్పుల విరమణ’ కోరుతూ తీర్మానం ప్రతిపాదించగా అది భద్రతా సమితిలో తిరస్కరణకు గురయ్యింది. ‘సుసాన్ రైస్’ నో-ఫ్లై జోన్ వలన పరిమిత ఫలితమే ఉంటుందనీ, దానితో పాటు అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. అంటే ఇప్పుడు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు మూడూ లిబియాపై చర్యకు అనుకూలంగా ఉన్నాయి. అవి తీసుకోదలచిన చర్య ‘నో-ఫ్లై జోన్’ తో పరిమితం కాకుండా మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రష్యా, చైనాలను అవి ఎలా ఒప్పిస్తాయో చూడాల్సి ఉంది.

ఇదిలా ఉండగా గడ్డాఫీ వైపునుండి తిరుగుబాటుదారుల వైపుకి వచ్చిన సైనిక బలగాలు మొట్టమొదటిసారిగా ఫ్రంట్ లైన్ బలగాలతో కలిసి గడ్డాఫీ సేనలపై పోరుకు సిద్ధమయ్యాయి. వీరు తిరుగుబాటుదారుల పక్షానికి వచ్చినప్పటికీ ఇప్పటివరకూ గడ్డాఫీ బలగాలతో తలపడలేదు. తమతమ బ్యారక్స్ లొనే ఉండి పోయాయి. గడ్డాఫీ సేనలు అజ్దాబియా పైకి దాడు చేస్తుండడంతో అవికూడా తిరుగుబాటుదారులతో కలిసి పోరాటానికి దిగాయి. లిబియా అంతర్యుద్ధంలో దీనిని గణనీయమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. వీరి చేరిక రెబెల్స్ కు ఎంతవరకు లాభిస్తుందో చూడాల్సి ఉంది.

ఐక్యరాజ్యసమితి లొని లిబియా రాయబారి ఇబ్రహీం దబ్బాషి “నో-ఫ్లై జోన్ అమలు ఇంకా ఆలస్యమైతే లిబియాలో హత్యాకాండ తప్పక పోవచ్చ”ని ఆందోళన వ్యక్తం చేశాడు. దబ్బాషీ తిరుగుబాటుదారుల పక్షంలోకి చేరుతున్నట్లు ప్రారంభంలోనే ప్రకటించాడు. బెంఘాజీలో తిరుగుబాటుదారులకు సహాయం చేస్తున్న పౌరులకు గడ్డాఫీ చివరి అవకాశం ఇస్తున్నట్లుగా ప్రకటించాడు. గడ్దాఫీ తనయుడు మరో 48 గంటల్లో అంతా ముగిసిపోతుందని బుధవారం ప్రకటించాడు. రెబెల్స్ స్ధావరాలు ఎక్కడ ఉన్నాయో తమకు ప్రజలే చెబుతున్నారని గడ్డాఫీ అన్నాడు.

మొత్తం మీద “అధికారంలో కొనసాగాల”న్న గడ్డాఫీ కోరిక లిబియా ప్రజలకు వ్యతిరేకంగా పశ్చిమ రాజ్యాలు లిబియాలో ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తున్నది. లిబియాలో అంతర్యుద్ధం దీర్ఘకాలిక యుద్ధంగా కొనసాగే అవకాశాలు లేకపోలేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

వ్యాఖ్యానించండి