ఇటలీ అమెరికా సంబంధాలను దెబ్బతీసిన ఇండియా శాటిలైట్ ప్రయోగం -వికీలీక్స్


Sriharikota space centre

శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగ కేంద్రం

ఇండియాలో మానవ నిర్మిత ఉపగ్రహాన్ని (శాటిలైట్) ప్రయోగిస్తే అది ఇటలీ, అమెరికాల సంబంధాలను సంవత్సరం పాటు వేడెక్కించింది. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా ఇటలీ అమెరికాల సంబంధాల బలం ఇండియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరి కోట లో నిక్షిప్తం అయి ఉండటం నిజంగా ఆశ్చర్యకరమే. ఇటలీలోని అమెరికా రాయబారి అమెరికా ప్రభుత్వానికీ, ఇండియాలోని అమెరికా రాయబారికీ మే 26, 2007 తేదీన పంపిన కేబుల్ లో ఈ వివరాలు ఉన్నాయి.

ఏప్రిల్ 23, 2007 తేదీన ఇండియాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం నుండి ఇండియా తయారు చేసుకున్న రాకెట్ ద్వారా ఇటలీకి చెందిన “ఎగైల్” అనే పేరుగల కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అంటే ఇండియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడమన్నమాట. విజయవంతమైన ఈ ప్రయోగం వలన శాటిలైట్ రంగంలో ఇండియా స్ధానం పైకి ఎగబాకింది. ఎగైల్ రాకెట్ ప్రయోగంలో అమెరికాకి చెందిన టెక్నాలజీని ఇటలీ ఇండియాకి సరైన అనుమతి లేకుండా బదలాయించిందనేది అమెరికా ఆరోపణ.

ఇటలీ శాటిలైట్ ను ఇండియా రాకెట్ ద్వారా ప్రయోగించకుండా ఉండటానికి అమెరికా సంవత్సరం ముందునుండీ ప్రయత్నం చేసినా విజయవంతం కాలేకపోయింది. ఎగైల్ రాకెట్ ప్రయోగంలో ఇండియా వినియోగించిన టెక్నాలజీ అమెరికాకి చెందినది. ఇటలీ దాన్ని కొనుగోలు చేసి తన అవసరం నిమిత్తం ఇండియాకి బదలాయించింది. అట్లా బదలాయించడానికి ఇటలీకి అమెరికా అనుమతి ఇయ్యలేదని అమెరికా గొడవ చేసింది. అమెరికా పాటించే ఎగుమతి నియంత్రణలను ఇటలీ ఉల్లంఘించిందని ఇటలీలోని అమెరికా రాయబారి రొనాల్డ్ పి. స్టోగ్లి కేబుల్ ద్వారా తెలిపాడు. శాటిలైట్ ప్రయోగానికి అమెరికాకి చెందిన “రియాక్షన్ వీల్ అసెంబ్లీ” అనే టెక్నాలజీ ఉపయోగించారు. ఇది అమెరికా తయారు చేసుకున్న ‘యుద్ధ సామాగ్రి జాబితా’ లో ఉంది. కనుక ఎగైల్ కోసం అమెరికా నుండి దీనిని దిగుమతి చేసుకున్న ఇటలీ ఇంకెవరికీ అమ్మకూడదని అమెరికా వాదనగా ఉంది.

శాటిలైట్ ప్రయోగానికి ముందు స్టోగ్లీ, అమెరికా ప్రభుత్వం ఇటలీ ప్రభుత్వం తోనూ, అమెరికా ప్రభుత్వం ఇటలీ రాయబార కార్యాలయంతోనూ సంవత్సరం పాటు గొడవపెట్టుకున్నారు. “ఎగైల్ శాటిలైట్ ను ఇండియా రాకెట్ ద్వారా ఇండియాలో ప్రయోగించినట్లయితే ద్వైపాక్షిక ఆర్ధిక చర్చలలో ప్రమాదకర పరిణామాలను ఇటలీ ఎదుర్కొనాల్సి ఉంటుంది” అని హెచ్చరించినప్పటికీ ఇటలీ ప్రభుత్వం లెక్క చేయలేదని స్టోగ్లి తన కేబుల్ లో రాశాడు. ఇటలీలోని బహుళ పక్ష ఆర్దిక మరియు ద్రవ్య వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ‘ప్రధాన కార్యాలయం -VI’ (ఎనర్జీ, స్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్, అణు సంబంధిత వ్యవహారాలు ఈ కార్యాలయంలో నడుస్తాయి) లో ఉండే మంత్రి “జివాన్ని మేన్ ఫ్రెడి” అమెరికా హెచ్చరికకు చాలా కూల్ గా సమాధానం ఇచ్చాడని స్టోగ్లీ కేబుల్ లో కోపం వ్యక్తం చేశాడు.

ఎగైల్ ను ఇండియా నుండి ప్రయోగించడానికి యూనివర్సిటీల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయానికి వివరణ ఇవ్వడానికి మేన్ ఫ్రెడి ఏ మాత్రం ప్రయత్నించలేదని స్టోగ్లి ఆగ్రహించాడు. ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు శాటిలైట్ ఏజన్సీపైన గానీ యూనివర్సిటీల మంత్రిత్వ శాఖపైన గాని శాసించడానికి అధికారం లేదని మేన్ ఫ్రెడి చెప్పాడనీ, అమెరికా ఎగుమతి నియంత్రణా నియమాలను ఎగైల్ శాటిలైట్ ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించలేదని చెప్పాడనీ స్టోగ్లి కేబుల్ లో తెలిపాడు. ఎగైల్ ప్రయోగానికి ముందు అందులోని ఇతర ఆయుధ పరికరాల విభాగాలను తొలగించడమే అందుకు సాక్ష్యమని ఇటలీ మంత్రి అమెరికాకి తెలిపాడు.

“ఇటలీకి చెందిన ‘కార్లో గవాజ్జీ స్పాజియో’ కంపెనీ ఎగుమతుల లైసెన్సులకోసం అమెరికాను కోరింది. ఆ కంపెనీతో అమెరికా ప్రభుత్వమే నేరుగా లావాదేవీలు జరిపింది. స్పాజియో కంపెనీ విజ్గ్నప్తిని అమెరికా ప్రభుత్వం అయోమయ పద్దతిలో వ్యవహరించింది. అందువలన ఇటలీ రియాక్షన్ వీల్ విడిభాగానికి సంబంధించినంత వరకు అమెరికా కంపెనీ  ‘గుడ్రిఛ్ పైనే ఆధారపడింది.” అని మేన్ ఫ్రెడి తెలిపినట్లుగా స్టోగ్లి రాశాడు. ఈ సమాధానాన్ని స్టోగ్లి బాధ్యతా రహిత సమాధానంగా ఫిర్యాదు చేశాడు.

ఈ వ్యవహారమంతా ఇండియాలోని అమెరికా రాయబారికి సమాచారం నిమిత్తం స్టోగ్లి తెలిపాడు. భవిషత్తులో జరిగే వ్యవహారాల్లో ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకోవడానికి వీలుగా ఈ సమాచారాన్ని పంచుకున్నాడు. ఈ వ్యవహారం వికీలీక్స్ ద్వారా బైట పడ్డాక ఇటలీ పత్రికలు, “ఇటలీ పరిశోధనలను అమెరికా నియంత్రించడం”గా అభివర్ణించాయి.

2 thoughts on “ఇటలీ అమెరికా సంబంధాలను దెబ్బతీసిన ఇండియా శాటిలైట్ ప్రయోగం -వికీలీక్స్

  1. బాగున్నది. మీ ఆర్టికల్స్ చదివిన తర్వాత ఇతరులతో వాదించడానికి ఉపయోగపడుతున్నది.
    ఇంతకీ కేబుల్స్ అంటే తెలియదు. వివరించగలరు.

  2. భాస్కర్
    కేబుల్ అంటే వివిధ అర్ధాలున్నాయి. ప్రస్తుత సందర్భంలో “ఇతర దేశాలకు పంపించే టెలిగ్రాం” అని అర్ధం.
    ఇది కాకుండా వైరు (సిగ్నల్స్ ప్రవహించే వైరు) అని అర్ధం. కంప్యూటర్లు, టీవీలు తదితరాల్లో వాడే వైర్లను కేబుల్స్ అంటారు. కేబుల్ టీవి అంటే వైరు టీవీ అనే అర్ధం. దృశ్యం, ధ్వని కి సంబంధించిన సిగ్నల్స్ వైరు ద్వారా ప్రవహించి టీవీకి అందుతాయు కనుక ‘కేబుల్ టీవీ’ అంటారు.

వ్యాఖ్యానించండి