ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నోట్లతో ఓట్లు కొనడం సర్వసాధారణమని అమెరికా డెప్యుటీ రాయబారి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కి పంపిన కేబుల్ లో పేర్కొన్నాడు. 2009 లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ నాయకులు వారి అనుచరులు డబ్బులు పంచామని రాయబారి దగ్గర అంగీకరించినట్లుగా వికీలీక్స్ బైట పెట్టిన కేబుల్ ద్వారా తెలిసింది. నోట్లే కాకుండా వినియోగ సరుకులు, సేవలు కూడా ఓట్ల సంపాదనకి వినియోగించారు. చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఏక్టింగ్ ప్రిన్సిపల్ ఆఫీసర్ గా పనిచేసిన ఫ్రెడరిక్ జె. కప్లాన్, మాతృదేశానికి మే 13, 2009 తేదీన పంపిన కేబుల్లో ఈ విషయాలను పొందుపరిచాడు.
కప్లాన్ తో అరమరికలు లేకుండా మాట్లాడినవారిలో కాంగ్రెస్ కి చెందిన కార్తి చిదంబరం, కేంద్ర ఎరువుల మంత్రి ఆళగిరి అనుచరుడు ఎం. పట్టురాజన్, మజ్లిస్ పార్టీకి చెందిన మధురై మాజీ మేయర్ ప్రస్తుతం ఎం.పి అసదుద్దీన్ ఓవైసి లు ఉన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులనుండి డబ్బులు ఆశించే స్ధితికి పేద ప్రజలను తెచ్చారనీ, వారిని సంతృప్తిపరచడానికి రాజకీయ నాయకుల మధ్య పోటీ ఉంటుందని కప్లాన్ రాశాడు. ఈ విషయం భారత దేశంలో బహిరంగ రహస్యమే అయినప్పటికీ నాయకులూ, వారి అనుచరులు అమెరికా రాయబారి దగ్గర సాధారణ విషయంలా అంగీకరించడం వారు తమ ప్రతిష్టతో పాటు దేశ ప్రతిష్టను కూడా తేలికగా తీసుకున్నారనేది చాటి చెపుతుంది.
డబ్బు చెల్లించడం, బావులు తవ్వడం, ఉదయం పత్రికల్లో డబ్బులున్న కవరుంచి పంచడం మొదలైన మార్గాల ద్వారా రాజకీయ నాయకులు ఎన్నికల చట్టాలను ఉల్లంఘించిన సంగతిని బైట పెట్టుకున్నారు. చందాల వసూళ్ళ ద్వారా ఇలాంటి డబ్బు సంపాదించినా, చాలా తరచుగా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు రాజకీయ అవినీతికి దారితీస్తున్నదని కూడా రాయబారి గ్రహించాడు. కప్లాన్, అతని బృందం వెళ్లిన ప్రతిచోటా జర్నలిస్టులు, ఓటర్లు, రాజకీయ నాయకులు ‘ఓటుకు నోటు’ సాధారణ విషయంగా చెప్పారు. డబ్బు ఇచ్చినంత మాత్రాన ఓటర్లు ఎవరికి వేస్తారో చెప్పడం కష్టమనీ అయితే పోటా పోటీ ఉన్నచోట గెలుపును తారుమారు చేయడానికి డబ్బు సంచులు ఉపయోగపడతాయని వారు చెప్పారు.
చెన్నై, హైద్రాబాదు వంటి నగరాల్లో మురికివాడలు ఎన్నికల సమయంలో చాలా కీలక ప్రాంతాలుగా ఉంటాయనీ, అక్కడ జనాభా సాంద్రత ఎక్కువగా ఉండటం, వారు దారిద్ర్యంతో సహజీవనం చేస్తుండటం దానికి కారణమని కప్లాన్ కు డి.ఎం.కె పార్టీ రాజకీయ వ్యూహకర్త తెలిపాడు. తమిళనాడులో డి.ఎం.కె, ఎ.ఐ.డి.ఎం.కె పార్టీలు క్రమం తప్పకుండా ఓటర్లకు లంచాలిస్తారని జర్నలిస్టులు చెప్పారు. పార్టీల ఏజెంట్లు తెల్లవారు ఝాము రెండు నుండి నాలుగు గంటల మధ్య గోతాముల్లో డబ్బుకట్టలతో వచ్చి ఓటర్ల లిస్టు ఆధారంగా డబ్బు పంచి పోతారని చెన్నైలోని ఓ స్వచ్ఛంద సంస్ధ కప్లాన్ కు తెలిపింది.
జనవరి 2009లో మధురై జిల్లాలోని తిరుమంగళం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఓటరుకు రు. 5,000 ఆళగిరి పంచిపెట్టాడని అతని అనుచరుడు తెలిపాడు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా వార్తా పత్రికలో డబ్బుల కవర్ పెట్టి పంచామని అతను చెప్పాడు. ఈ పద్ధతివలన ప్రతిఒక్కరూ లంచం తీసుకోవలసిన పరిస్ధితికి నెట్టబడ్డారని కప్లాన్ అమెరికాకి పంపిన కేబుల్ లో ఎత్తి చూపాడు. ఓటుకు రు. 5,000 పంచాక తిరుమంగళంలో ఎన్నిక ఫలితం తారుమారైందని కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు. అప్పటివరకూ ఓటుకు అధికంగా రు. 500 పలికిందని అతను తెలిపాడు.
2009లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అదే స్ధాయిని కొనసాగించడం కష్టంగా మారింది. తిరుమంగళం కంటే అక్కడి పార్లమెంటరీ నియోజకవర్గం ఏడురెట్లు పెద్దది కావడమే దానిక్కారణం. అంత డబ్బు కాకపోయినా ఇతరుల కంటే ఎక్కువగా డబ్బు వార్తా పత్రికల ద్వారా పంచడానికి ఆళగిరి నిర్ణయించుకున్నాడని అతని అనుచరుడు పట్టురాజన్ తెలిపాడని కప్లాన్ తన కేబుల్ లో రాశాడు. (పార్లమెంటు ఎన్నికల చివరిరోజు కేబుల్ పంపాడు)
దేశ హోంశాఖా మంత్రి చిదంబరం పోటీ చేసిన శివగంగ పార్లమెంటు నియోజకవర్గంలో అతని కొడుకు కార్తి చిదంబరం ఎన్నికల బాధ్యత నిర్వహించాడు. రాయబారి బృందంతో కార్తి మాట్లాడుతూ తాను ఓట్లకు డబ్బు పంచడానికి వ్యతిరేకం అని చెప్పాడు. అయితే అది చట్ట వ్యతిరేకమనో, లేక నైతికంగా సరైంది కాదనో అతను వ్యతిరేకించలేదు. గ్రామాలు విశాలమైన ప్రాంతాల్లో దూరదూరంగా ఉండటం వలన డబ్బులు పంచడం అసాధ్యం. అందుకే దానికి కార్తి వ్యతిరేకం. కాని స్ధానిక యూత్ కాంగ్రెస్ నాయకుడు కార్తి డబ్బు పంచాడని చెప్పాడు. అతని పేరు కేబుల్ లో కప్లాన్ రాయలేదు. “తన తండ్రికి ఓటు వేయడానికి గోడమీద పిల్లివాటంలా ఉన్నవారికి డబ్బివ్వడానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే దానివలన ఖచ్చితంగా ఫలితం ఉంటుంది” అని కార్తి కప్లాన్ బృందంతో చెప్పాడు.
ఇక హైద్రాబాదులో పోటీ చేసిన అసదుద్దీన్ ఓవైసీ, తాను డబ్బులివ్వడానికీ కాంగ్రెస్, టిడిపి పార్టీలు డబ్బులివ్వడానికీ తేడా ఉందని కప్లాన్ బృందంతో చెప్పుకొచ్చాడు. ఇతర పార్టీలు వ్యక్తిగతంగా డబ్బు పంచితే తాను కమ్యూనిటీ ఉపయోగం కోసం డబ్బులిస్తానని అతను తెలిపాడు. ఉదాహరణకు ఒక చోట బావి తవ్వించమని అడిగితే వారికి రు. 25,000 ఇచ్చాడు. మరొక చోట అనాధ బాలిక పెళ్ళి ఖర్చుల కోసం రు. 35,000 ఇచ్చాడు. అంత నిర్మొహమాటంగా మాట్లాడుతున్న ఓవైసిని కప్లాన్ బృందం “బావికీ, పెళ్ళికీ డబ్బులివ్వడం చట్ట ప్రకారం నేరం కాదా?” అని అడిగింది. ఓవైసీ నవ్వేస్తూ “అఫ్ కోర్స్! నేరమే. అదే ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్పదనం” అని ముక్తాయించాడు.
