అణు ధార్మికతను ‘మిల్లీ సీవర్టు’లలో కొలుస్తారు. ‘సీవర్టు’ అసలు యూనిట్ అయినప్పటికీ అత్యంత ప్రమాదకర స్ధాయి సైతం మిల్లీ సీవర్టులలో ఉంటుంది కనుక ‘మిల్లీ సీవర్టు’ సాధారణ కొలతగా మారింది.
జపాన్ ఛీఫ్ కేబినెట్ మంత్రి యుకియో ఎదనో చెప్పినదాని ప్రకారం ఫుకుషిమా దాయిచి అణు విద్యుత్ కేంద్రం వద్ద అణు ధార్మికత గంటకు 400 మిల్లీ సీవర్టులుగా నమోదయ్యింది. ఇది మంగళవారం ఉదయం నెం.2 రియాక్టర్ పేలడానికి ముందు నమోదైనదాని కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ. ప్రస్తుతం అణు సంస్ధలలో పని చేసే ఉద్యోగులు, యురేనియం గనుల్లో పని చేసేవారు సంవత్సరంలో ఎదుర్కొనే రేడియేషన్ కంటే 20 రెట్లు ఎక్కువ.
ఇప్పటివరకు రష్యాలో జరిగిన చెర్నోబిల్ అణు ప్రమాదమే అత్యంత పెద్ద అణు ప్రమాదం. అక్కడ రియాక్టరులోని ప్రధాన పాత్ర (కంటైనర్) మొత్తంగా పేలిపోయి అందులో ఉన్న ఇంధన కడ్డీలు అణు ధూళిగా విస్తరించింది. ఆ అణు ధూళి ఇప్పటి రష్యా, యుక్రెయిన్ దేశాల్లో అంతటా విస్తరించింది. ఒక పరిమితిలో ఐరోపా ఖండ దేశాల్లో కూడా వ్యాపించింది. అప్పటి సాంకేతిక పరిజ్గ్నాం కంటే ఇప్పటి పరిజ్గ్నానం చాలా ఉన్నతమైనది. ఫుకుషిమా రియాక్టర్లలొ మూడు దొంతరలుగా భద్రతా వ్యవస్ధ ఉన్నది.
జపాన్ లో భూకంపాలు తరచూ సంభవిస్తాయి. అందువలన భూకంపం సంభవించినపుడు అణు విద్యుత్ కేంద్రాలు వాటంతట అవే పని చేయకుండా ఆగిపోయే విధంగా ఏర్పాటు చేశారు. మొన్నటి భూకంపం తర్వాత ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రాలు కూడా భూకంపం వచ్చిన వెంటనే ఆగిపోయాయి. దానితో పాటు విద్యుత్ ప్రసారం కూడా ఆగిపోవడంతో ప్రమాదం మొదలయ్యింది. అణు విద్యుత్ కేంద్రాలు పని చేయడం మానేసినప్పటికీ ఇంధన కడ్డీలు వేడిగానే ఉంటాయి. వీటిని చల్లబరచడానికి కూలింగ్ వ్యవస్ధ ఉంటుంది. విద్యుత్ లేకపోవడం వలన ఈ కూలింగ్ వ్యవస్ధ పనిచేయడం మానేసింది.
దానితో రియాక్టర్లో ఉన్న నీరు ఆవిరైపోయి ఇంధన కడ్డీలమధ్య గాలి చొరబడింది. (కూలింగ్ వ్యవస్ధ పనిచేస్తే నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది.) గాలి, ఇంధన కడ్డీల మధ్య రసాయనక చర్య జరిగి పెద్ద ఎత్తున హైడ్రోజన్ ఉత్పత్తి అయ్యింది. హైడ్రోజన్ పరిమాణం పెరిగుతూ పోయి పేలడంతో రియాక్టర్ పైభాగంలో ఉండే బయటి కప్పు ఎగిరిపోయింది. ఇంధన కడ్డీలను చల్లబరచడానికి సముద్రనీటిని పంపింగ్ చేయడం మొదలు పెట్టారు. నెం.1, నెం.3 రియాక్టర్లు పేలినపుడు లోపల ఇంధన కడ్డీలు ఉండే గట్టి పాత్రకు నష్టం జరగలేదు. అయినా లోపల వేడివలన ఇంధన కడ్డీలు కరిగి కిందికి చేరి బయటికి ప్రవహిస్తే పెద్ద ఎత్తున రేడియేషన్ వెలువడుతుంది. అలా కరగకుండా ఉండటానికి సముద్రనీటిని నిరంతరం పంపింగ్ చేస్తున్నారు.
అయితే నెం.2 రియాక్టర్ పేలినప్పుడు కడ్డీలుండే పాత్ర బలహీనపడి పగుళ్ళిచ్చింది. దానితొ రేడియేషన్ లీకయ్యి 400 మిల్లీ సీవర్టులకు పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం ఉందని జపాన్ ప్రధాని తెలిపాడు. ఇంకా పెరిగితే గనక అటు అమెరికా, ఇటు ఇండియా గగనతలం లోకి కూడా రేడియేషన్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ప్రకారం:
- చెర్నోబిల్ ప్రమాదం తర్వాత అణు ధార్మికత 350 మిల్లీ సీవర్టులు దాటిన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- సాధారణంగా వాతావరణంలో సహజసిద్ధంగా సంవత్సరానికి 2 మిల్లీ సీవర్టుల రేడియో ధార్మికత ఉంటుంది.
- న్యూయార్క్, టోక్యో నగరాల మధ్య ధృవప్రాంతం మీదుగా తిరిగే విమానాల్లో పనిచేసే ఉద్యోగులు సంవత్సరానికి 9 మిల్లీ సీవర్టుల ధార్మికతకు గురవుతారు.
- సంవత్సరానికి 100 మిల్లీ సీవర్టుల రేడియేషన్ ఎదుర్కొంటే కేన్సర్ పెరగడం జరుగుతుంది. అంతకంటే తక్కువ స్ధాయిలో కేన్సర్ పెరుగడం ఇంతవరకూ ఎక్కడా రికార్డు కాలేదు.
- మొత్తం 1000 మిల్లీ సీవర్టుల రేడియేషన్ ఎదుర్కొన్న చోట చాలా సంవత్సరాల తర్వాత ప్రతి వందమందిలో ఐదుగురు ప్రమాదకర కేన్సర్ ను ఎదుర్కొంటారు.
- ఒకేసారి సింగిల్ డోసులో 1000 మిల్లీ సీవర్టుల రేడియేషన్ ఎదుర్కొంటే వికారంగా ఉండి వాంతులవుతాయి. కానీ మరణం సంభవించదు.
- ఒకేసారి సింగిల్ డోసులో 5000 మిల్లీ సీవర్టుల రేడియేషన్ కు గురైతే దాన్ని ఎదుర్కొన్న వారిలో సగం మంది నెలలోపు చనిపోతారు.
జపాన్ లొ ప్రస్తుతం అత్యంత ప్రమాదకర స్ధాయిలో దేశమంతా రేడియేషన్ వ్యాప్తి చెందడం జరగదు. ఫుకుషిమా ప్లాంటు వద్ద రేడియేషన్ కి గురైనవారు మాత్రమే ప్రమాదం సంభవిస్తుంది. అయితే అక్కడ పనిచేసేవారు అప్పటికే ప్రమాదాన్ని నిరోధించే సూట్లు ధరించి ఉన్నారు కనుక వారు ప్రమాదానికి గురయ్యే అవకాశం లేదు.
