తూర్పు ఆయిల్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు


ఆదివారం, మార్చి 13న గడ్డాఫీ బలగాల చేతిలోకి వెళ్ళిన ఆయిల్ పట్టణం ‘బ్రెగా’ ను తిరుగుబాటుదారులు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తిరుగుబాటుదారులు పత్రికలకు తెలిపినప్పటికీ అధికారికంగా ఇంకా ధృవపడ లేదు. ‘బ్రెగా’ ను కోల్పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి స్వాధీనం చేసుకున్నామని తిరుగుబాటుదారులు తెలిపారు. ఆహారం, నిత్యవసరాల సరఫరాలు దెబ్బ తినకుండా ఉండటానికి ఆయిల్ పట్టణాలను అదుపులో ఉంచుకోవడంతొ పాటు అంతర్జాతీయ గుర్తింపును సాధించడం కూడా అవసరం.

తిరుగుబాటుదారుల ఏలుబడిలో ఉన్న లిబియా తూర్పుభాగానికి ముఖద్వారంగా చెప్పుకోదగిన అజ్దాబియా పట్టణం కోసం తీవ్రంగా పోరాటం జరుగుతోంది. గడ్డాఫీ విమాన దాడులకు తమవద్ద సమాధానం లేదని తిరుగుబాటుదారులు అంగీకరించారు. యుద్ధ విమానాలు ఎగరకుండా ఉండటానికి నో-ఫ్లై జోన్ అమలు చేయాలని వారు మొదటునుండీ కోరుతున్నారు. అమెరికా, ఐరోపాలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. నో-ఫ్లై జోన్ అమలుచేయడమంటే గడ్డాఫీ యుద్ధవిమానాలతో తలపడటమేననీ, యుద్ధం చేయాలంటే అంతర్జాతీయ సమాజం అనుమతి కావాలని అమెరికా చెబుతున్నది.

మరోవైపు నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి ఫ్రాన్సు భద్రతా సమితి పై ఒత్తిడి తీవ్రం చేసింది. గడ్డాఫీ మరింత కాలం అధికారంలో కొనసాగినట్లయితే లిబియా అంటరాని రాజ్యంగా మారుతుందని బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్ హెచ్చరించాడు. వాస్తవానికి “రోగ్ స్టేట్” అన్న పేరుతో లిబియాను చాలాకాలం అమెరికా, పశ్చిమ రాజ్యాలు అంటరానిదిగానే చూశాయి. వాటి నియంత్రణలో పనిచేయడానికి గడ్డాఫీ నిరాకరించినందునే లిబియా ‘రోగ్ స్టేట్’ అయ్యింది. ఇప్పుడు కొత్తగా ‘అంటరాని రాజ్యం’ గా మారేదేమీ లేదు. తిరుగుబాటుదారులు ఐక్యరాజ్య సమితి జోక్యం తప్ప విదేశీ జోక్యాన్ని నిరాకరించడానికీ, పశ్చిమ దేశాలు ‘నో-ఫ్లై జోణ్ అమలుకు నిర్ణయం తీసుకోకపోవడానికి సంబంధం ఉంది.

వ్యాఖ్యానించండి