లిబియా అంతర్యుద్ధంలో గడ్డాఫీ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదారులను తూర్పువైపుకి నెట్టుకుంటూ వెళ్తున్న నేపధ్యంలో కైరోలో శనివారం సమావేశమైన అరబ్ లీగ్ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” అమలుకు ఆమోదముద్ర వేశాయి. సిరియా, అల్జీరియా మినహా అన్ని దేశాలూ “నో-ఫ్లై జోన్” ప్రతిపాదనను ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిని లిబియాపైన “నో-ఫ్లై జోన్” అమలు చేయాల్సిందిగా కోరుతూ అరబ్ లీగ్ తీర్మానించింది. లిబియాలో ప్రస్తుత సంక్షోభం ముగిసే వరకూ నో-ఫ్లై జోన్ అమలు చేయాలని తీర్మానంలో లీగ్ కోరింది.
తిరుగుబాటుదారులు శనివారం కీలక ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ ను గడ్డాఫీ బలగాలకు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆదివారం నాటికి వారు ఇంకా తూర్పున ఉన్న ఉజాలా పట్టణం వైపుగా నెట్టివేయబడ్డారు. గడ్డాఫీ తెచ్చుకున్న సుశిక్షిత కిరాయి సైనికుల ముందు శిక్షణ లేని తిరుగుబాటు బలగాలు నిలవలేక పోతున్నాయి. యుద్ధ విమానాలు తూర్పు ప్రాంతంలో ఉన్న మరో ఆయిల పట్టణం బ్రెగా శివార్లలో ఇంకా అడపా దడపా బాంబులు వేస్తూనే ఉన్నారు. శుక్రవారం గడ్దాఫీ వశం చేసుకున్న జావియా పట్టణం ట్రిపోలీకి అత్యంత చేరువలో ఉంది. జావియా స్వాధీనంతొ ప్రారంభమైన గడ్డాఫీ బలగాల పురోగమనం, రాస్ లానుఫ్ దాటి ఉజాలా వైపుకి కొనసాగుతున్నది.
తిరుగుబాటుదారుల కేంద్రం బెంఘాజీ పట్టణంలో మాత్రం నిరాశకి సంబంధించిన జాడలేవీ కనబడడం లేదు. గాయపడిన వారు వెనక్కి వస్తుండగా, ఇంకా మరింత మంది పౌరులు సైనికులు యుద్ధంలో చేరడానికి వెళుతున్నారని బిబిసి, ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధలు తెలిపాయి. సైనికులుగా మరింతమందిని ఆకర్షించడానికీ, ప్రజల్లో సరుకుల సరఫరా లోపం వలన అరాచకం ప్రబలకుండా ఉండటానికీ ఆయిల్ పట్టణాలను అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఇరు పక్షాలకూ ఉంది. ఆయిల్ పట్టణాలు స్వాధీనంలో ఉన్నప్పటికీ ఆయిల్ సొమ్మును వాణిజ్యం ద్వారా రాబట్టుకోవడానికి అంతర్జాతీయ గుర్తింపు తిరుగుబాటుదారులకు చాలా అవసరం. అంతర్జాతీయ గుర్తింపు లేనట్లయితే ఆయిల వాణిజ్య సొమ్ము గడ్డాఫీ ప్రభుత్వానికి వెళుతుంది.
ప్రస్తుతం పశ్చిమ లిబియాలో తిరుగుబాటుదారుల స్వాధీనంలో ఉన్న పెద్ద పట్టణం “మిస్రాటా” ఒక్కటే. దానిని కూడా స్వాధీనం చేసుకోవడానికి గడ్డాఫీ బలగాలు యుద్ధవిమానాల దాడి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జావియా కంటే మిస్రాటా పెద్దది. మూడు లక్షల జనాభా కలిగిన మిస్రాటా పట్టణం కోసం యుద్ధం తీవ్రమైతే అది పెద్ద హత్యాకాండకు దారి తీయవచ్చని భయపదుతున్నారు.
ఇదిలా ఉండగా బ్రిటన్, ఫ్రాన్సులు లిబియాపై “నో-ఫ్లై జోన్” అమలు చేయించడానికి ఐక్యరాజ్యసమితి, నాటో దేశాలను ఇంకా ఒప్పించ లేక పోతున్నాయి. తిరుగుబాటుదారులు ఐక్యరాజ్య సమితి మినహా మరో సంస్ధగానీ, దేశంగానీ సైనిక జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకిస్తుండడమే దానికి కారణం కావచ్చు. ప్రాంతీయంగా మద్దతు ఉంటేనే “నో-ఫ్లై జోన్” అమలు చేయవచ్చని ప్రకటించిన నాటో అరబ్ లీగ్ తీర్మానానికి హర్షం వ్యక్తం చేసింది. “నో-ఫ్లై జోన్” అమలు చేయడం అనేది సరైన విధానం అయిందీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు” అని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ “రాబర్డ్ గేట్స్” ఎ.ఎఫ్.పితో అన్నాడు. నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి అమెరికా, ఐరొపాలు ఏ ప్రయోజనం లేకుండా అంగీకరించవు.
