జపాన్ ను అతలాకుతలం చేసిన భూకంపం, సునామీలు


Tsunami attack

జపాన్ లో సునామీ తీవ్రత (ఫోటో - బిబిసి)

శుక్రవారం ఈశాన్య జపాన్ సముద్ర అంతర్భాగాన సంభవించిన భూకంపం, దానివలన ఏర్పడిన సునామీలు జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. అతి వేగంగా దూసుకొచ్చిన సునామీ ప్రజలను కోలుకోకుండా దెబ్బతీశాయి. సునామీ ధాటికి పెద్ద పెద్ద నౌకలు సైతం తీరాన్ని దాటి ఒడ్డున ఉన్న పట్టణాల్లోని భవనాలను ఢీకొట్టాక గాని ఆగలేదు. పడవలు, కార్లు, బస్సులు లాంటి వాహనాలు ఒకదానిపై ఒకటి చేరి ఇతర శిధిలాలతో కలిసి చెత్తకుప్పలను తలపిస్తున్నాయి. విస్తారమైన ప్రాంతాలు సునామీ ద్వారా కొట్టుకువచ్చిన సముద్ర నీటిలో మునిగిపోయాయి. కూలిన భవనాల శిధిలాల కింద చాలామంది చిక్కుకుని చనిపోగా మరింతమంది శిధిలాల పైన చిక్కుబడి పోయారు.

ప్రాణాలు, ఆస్తులను శిధిలాలుగా మార్చిన భూకంపం ఫుకుషిమా వద్ద ఉన్న అణు విద్యుత్ కేంద్రాలను పెను ప్రమాదకారులుగా మార్చివేశాయి. శనివారం వరకూ ఫుకుషిమా 1 ప్లాంటు వద్ద పేలుడు సంభవించి అణుధార్మికత విడుదల కాగా ఆదివారం ఫుకుషిమా 2 ప్లాంటు కూడా ప్రమాదంలో ఉన్నట్లు బయట పడింది. ప్లాంట్ల వద్ద అణు ధార్మికత పరిమితిని మించిపోయినట్లు జపాన్ అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా ఉండటానికి అధికారులు ప్రమాద స్ధాయిని తక్కువ చేసి చెబుతున్నారు. ప్లాంట్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలను 1,70,000 మంది వరకూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కూలిపోకుండా ఉన్న భవంతుల్లో ఇంకా విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించ లేదు.

రియాక్టర్లను చల్లబరచడానికి రక్షక దళాలు, సాంకేతిక నిపుణుల బృందాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. సముద్ర నీటిని వెదజల్లడం ద్వారా వేడెక్కుతున్న రియాక్టర్లను చల్లబరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నడూలేని విధంగా సముద్రపు నీటిని పంపింగ్ చేయడాన్ని బట్టి అణు విద్యుత్ రియాక్టర్ల వద్ద ప్రమాదం ఎంత తీవ్రంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. 2,000 మంది వరకు ప్రజలు చనిపోయారని ప్రభుత్వం అంచనా వేస్తుండగా, సునామీలో ఎక్కువ దెబ్బతిన్న మియాగీ ప్రాంతంలోనే 10,000 మంది మరణించి ఉండవచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శిధిలాలు తొలగించి బ్రతికి ఉన్నవారిని రక్షించడానికి రక్షక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాదాపు 50,000 మందికి పైగా రక్షణ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని ప్రభుత్వం తెలిపింది, ఈ సంఖ్యను రెట్టింపు, అంటే 100,000 కు పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.

అణు విద్యుత్ ప్లాంటుల ఆపరేటర్ ‘టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ’ ఫుకుషిమా ప్లాంట్ల వద్ద అణుధార్మికత పరిమితిని దాటిందని చెప్పింది. మూడవ రియాక్టర్ లోని ఇంధన కడ్డీలు కరిగిపోకుండా ఉండటానికి నిపుణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అక్కడ కూడా కరిగినట్లయితే నష్టం మరింత తీవ్రమౌతుందని భయపడుతున్నారు. ఎందుకంటే ఇతర రియాక్టర్లలో వలే కాకుండా అక్కడ యూరోనియం, ప్లుటోనియం రెండు ఇంధనాలను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇతర రియాక్టర్లలో యురోనియం ఇంధనం ఒక్కదానినే ఇంధనంగా వాడుతున్నారు. ఇంధన కడ్డీలను నీటితో కప్పి ఉంచినంత వరకూ ప్రమాదం పెద్దగా ఉండదనీ, అలా కానట్లయితే కడ్డీలు కరిగిపోయి రియాక్టర్ల బైటికి ఇంధనం ప్రవహిస్తుందనీ అందువలన రేడియో ధార్మికత అనేక రెట్లు పెరుగుతుందనీ నిపుణులు చెబుతున్నారు.

భూకంపం అనంతరం సంభవించే తక్కువ స్ధాయి భూకంపాలు జపాజ్ ఈశాన్య ప్రాంతంలో ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఆహారం, ఇంధనం, విద్యుత్ లు క్రమంగా నిండుకుంటున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి పరిస్ధుతులు పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి. కొన్ని పట్టణాలూ, గ్రామాలూ సునామీతో కొట్టుకువచ్చిన సముద్ర నీటిలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో సైనికులు వందల శవాలను తొలగిస్తున్నారు. మియాగీ లోని మినమిసన్రుకు ప్రాంతంలో 7,500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించినప్పటికీ మరో 10,000 మంది జాడ తెలియడం లేదు.

జపాన్ లో విద్యుత్ కోసం ప్రధానంగా అణురంగం పైనే ఆధారపడతారు. కాలుష్యం లేకపోవడమే అందుకు కారణం. అయితే జపాన్ సహజంగానే భూకంపాలకు నిలయం కావడంతో అణు విద్యుత్ ప్లాంట్ల వద్ద భద్రతపై ఎప్పుడూ చర్చలు జరుగుతుంటాయి. తాజా ప్రమాదంతో అణు విద్యుత్ వినియోగంపై మరోసారి తీవ్ర చర్చ రేకెత్తే అవకాశం ఉంది. ఇటీవల పర్యావరణ కాలుష్యం, గ్రీన్ హౌస్ వాయువులు, భూగ్రహం వేడెక్కడం తదితర అంశాలపై గతం కంటే ఎక్కువగా పజల్లో చైతన్యం పెరిగింది. ధర్మలి విద్యుత్ వలన కర్బన వాయువులు అధికంగా వెలువడుతుండడం వలన అందరి దృష్టీ కాలుష్యం లేని అణు విద్యుత్ పైకి మళ్ళింది. ఇండియా లాంటి దేశాలు అణు విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకొని అధిక సంఖ్యలో అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి పూనుకుంటున్నాయి. వీరికి తాజా ప్రమాదంతొ నైనా కనువిప్పు కలుగుతుందో లేదో చూడవలసిందే.

వ్యాఖ్యానించండి