గడ్డాఫీ స్వాధీనంలో రెండో ఆయిల్ పట్టణం ‘బ్రెగా’


గడ్డాఫీ బలగాలు రెండో ఆయిల్ పట్టణం ‘బ్రెగా’ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం మొదటి ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ను వశం చేసుకున్న గడ్డాఫీ బలగాలు సాయంత్రానికి ‘బ్రెగా’ను కూడా స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటు బలగాలు తమ కేంద్ర పట్టణమయిన ‘బెంఘాజీ’ కి ముఖద్వారమైన ‘అజ్దాబియా’ పట్టణానికి తిరుగుటపా కట్టారు. అజ్దాబియా కూడా గడ్డాఫీ స్వాధీనం చేసుకున్నట్లయితే తిరుగుబాటుదారుల వశంలో ఉన్న తూర్పు ప్రాంతంపై కూడా గడ్డాఫీ బలగాలు దాడి చేయవచ్చు.

సాయుధ గ్యాంగులను బ్రెగా నుండి తుడిచి పెట్టామని ప్రభుత్వ మిలిటరీ అధికారి లిబియా టెలివిజన్ లో ప్రకటించాడు. అయితే బెంఘాజీ వాసులు గడ్డాఫీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలుస్తోంది. గడ్డాఫీ బలగాలు యుద్ధవిమానాలతో బ్రెగాపై దాడి చేసి వశం చేసుకున్నారని తిరుగుబాటుదారుల ద్వారా తెలుస్తోంది. నో-ఫ్లై జోన్ అమలు చేయాలని తిరుగుబాటుదారులు చాలా రోజులు కోరుతున్నా, నాటో దేశాలు వెనకాడుతున్నాయి. ప్రాంతీయ మద్దతుతో పాటు అంతర్జాతీయ అనుమతి కావాలని అమెరికా కోరుతున్నది. వీటో అధికారం ఉన్న చైనా, రష్యాలు సైనిక జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేంచాయి.

వ్యాఖ్యానించండి