ట్యునీషియా విప్లవం స్ఫూర్తితో యెమెన్ రాజుకు వ్యతిరేకంగా వారాల తరబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన పాటిస్తున్న ఉద్యమకారులపై మార్చి 12 తేదీన పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురిని చంపేశారు. 1250 మంది గాయపడ్డారనీ 250 మంది తీవ్రంగా గాయపడ్డారనీ డాక్టర్లు తెలిపారు. రాజధాని సనా లో ప్రజాస్వామిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ యెమెన్ ప్రజలు అనేక వారాలనుండి “విమోచనా కూడలి” లో నిరసన శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. 32 సంవత్సరాలనుండి అధికారంలో ఉన్న యెమెన్ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలే 2013 లో తన పదవీకాలం ముగిశాక పోటీ చేయబోనని ప్రకటించినా వారు తమ నిరసన విరమించలేదు.
పార్లమెంటరీ వ్యవస్ధ ఏర్పడటానికి వీలుగా రాజ్యాంగం మారుస్తానని గురువారం, మార్చి 10 తేదీన అధ్యక్షుడు సలే ప్రకటించాడు. రాజ్యాంగం పైనా, కొత్త ఎన్నికల చట్టం పైనా రివరెండం జరుపుతాననీ ప్రకటించాడు. చర్చలకు రమ్మంటూ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపును స్వీకరించాలని ప్రభుత్వ వ్యతిరేకులను అమెరికా కోరింది. అధ్యక్షుడు ప్రకటించిన వాటి కంటే తమ డిమాండ్లు ఇంకా పెద్దవని ఉద్యమకారులు తెలిపారు.
ఉత్తర, దక్షిణ యెమెన్లుగా ఉన్న దేశాలు 1990లో విలీనం కావడంతో యెమెన్ రిపబ్లిక్ ఏర్పడింది. ఉత్తర యెమెన్ లో 1978 లో సైనిక కుట్ర ద్వారా అధికారం చేపట్టిన అబ్దుల్లా సలే విలీనం తర్వాత కూడా అధ్యక్షుడుగా కొనసాగాడు. బహుళ పార్టీ వ్యవస్ధ ఉన్నట్లు కనిపించినా అది నామ మాత్రమే. సలే పార్టీదే అక్కడ ఆధిపత్యం. దక్షిణ యెమెన్ లో ఆల్-ఖైదా విభాగం నాయకత్వంలో వేర్పాటు ఉద్యమం నడుస్తోంది. ఉత్తర యెమెన్ లోని షియా తెగలతో కూడా అధ్యక్షునికి ఘర్షణలున్నాయి.
నిరసన ఉద్యమం ప్రారంభమయ్యాక ఇప్పటివరకూ 30 మంది చనిపోయారు. అబ్దుల్లా సలేకు అమెరికా నుండి పూర్తి మద్దతు ఉంది. మొదట సనా యూనివర్సిటీ విద్యార్ధులతో ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు వివిధ తెగలకు కూడా పాకాయి. ఫిబ్రవరి 25 న దేశవ్యాపితంగా దాదాపు రెండు లక్షల మంది నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
