పెళ్ళి మాటున జన సమీకరణ, మిలియన్ మార్చ్ కోసం న్యూడెమొక్రసీ ఎత్తుగడ


మిలియన్ మార్చ్ కోసం పోలీసులు కనీ వినీ ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. “ప్రజా జీవనానికి ఆటంకం ఏర్పడుతుందనే మార్చ్ కు అనుమతి ఇవ్వలేదు తప్ప వేరేదానికి కాదు” అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మార్చ్ అనంతరం ప్రకటించిన విషయం వార్తా ఛానెళ్ళలో ప్రసారం కావడం కూడా అందరూ చూశారు. అంటే ముఖ్యమంత్రి ఆదేశం మేరకే పోలీసులు తెలంగాణ అంతటా ఎవరూ హైద్రాబాద్ కు రాకుండా నిర్బంధించారనేది అర్ధం అవుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే పోలీసులు మార్చ్ జరగకుండా చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నమాట.

అయితే అంత గట్టి బందోబస్తు చేసినా జనాలు టాంక్ బండ్ మీదికి ఎలా రాగలిగారు? పోలీసులు అడుగడుగునా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఆందోళనకారులు ఎలా అధిగమించారు? పోలీసుల కళ్లుగప్పి వారి ఆటంకాలను ఎలా తప్పించుకున్నారు? టాంక్ బండ్ మీదికి రాకుండా రెండు చివర్లా ఉంచిన బారికేడ్లను ఎవరు తొలగించారు? అసలు టాంక్ బండ్ మీదికి మొదట ఎవరు వచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం కాస్తంత ఆసక్తి కలిగించేదే.

టాంక్ బండ్ మీదికి మొట్ట మొదట చేరుకున్నవారు సి.పి.ఐ (ఎం.ఎల్-న్యూ డెమొక్రసీ) పార్టీకి చెందినవారుగా డెక్కన్ క్రానికల్ పత్రిక, సాక్షి, టీవి 9 ఛానెళ్ళు తెలిపాయి. అయితే న్యూ డెమొక్రసీ పార్టీ వారు వేసిన ఎత్తుగడ మరింత ఆసక్తికరంగా ఉంది. వారి పార్టీ కార్యాలయం విద్యానగర్ లో ఉంది. కార్యాలయంలొ ఇన్-ఛార్జిగా భార్యా భర్తలిరువురు పని చేస్తున్నారు. వీరి పెళ్ళి మార్చి 10 న టాంక్ బండ్ కి సమీపంలోని ఆర్య సమాజ్ కల్యాణ మండపంలో జరగబోతున్నట్లు (చెల్లికి మళ్ళీ పెళ్ళి టైపులో అన్నమాట!) ఆ పార్టీ నాయకుడు గోవర్ధన్ పేరుతో అడ్వాన్స్ గా హాలును బుక్ చేసినట్లుగా తెలుస్తోంది.

పెళ్ళంటే ఎవరు అంగీకరించరు? ఆ పేరుతో అడ్వాన్స్ గా బుక్ చేసిన కల్యాణమండపంలో అంతే అడ్వాన్సుగా తమ జెండాలు, బ్యానర్లు మొదలైన వాటిని చేర్చారు. మార్చి 10 న మళ్ళీ జరిగిన ఉత్తుత్తి పెళ్ళికి వెయ్యిమందికి పైగా హాజరయ్యారని తెలిసింది. మధ్యాహ్నం ఒంటి గంట దాటినా ఎవరూ రాకపోయే సరికి పోలీసులు “ఇక రారులే” అనుకుంటూ ప్రమత్తతలో ఉండి ఉంటారు. ఆర్యసమాజ్ మండపంలో ఉన్న న్యూ డెమొక్రసీ, వారి ప్రజా సంఘాల కార్యకర్తలు మధ్యాహ్నం ఒకటిన్నరకి ఒక్కుమ్మడిగా టాంక్ బండ్ వైపుకి పరుగులు తీస్తూ వచ్చారు.

అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసు బలగంలో రాష్ట్ర డిజిపి అరవిందరావు కూడా ఉన్నారు. పోలీసులు అడ్డుగా నిలబడినా వారిని తోసుకుంటూ న్యూడెమొక్రసీ కార్యకర్తలు రావడంతో కొంతసేపు తోపులాట జరిగిందనీ, ఆ తొపులాటలో డిజిపి గారు కిందపడినంత పనయ్యిందనీ తెలుస్తోంది. వచ్చిన కార్యకర్తలలో న్యూడెమొక్రసీ కార్మిక సంఘం ఐ.ఎఫ్.టి.యు జెండాలు కూడా ఉన్నాయట. (వాటిని చూసే డిజిపిగారు విగ్రహాలను ఐ.ఎఫ్.టి.యు వాళ్లు పగలగొట్టారని చెప్పి ఉండవచ్చు). పోలీసు బలగాలను తోసుకుని టాంక్ బండ్ మీదికి వచ్చిన న్యూ డెమొక్రసీ వారు అక్కడ అడ్డంగా ఉన్న బారికేడ్లను కూడా పడగొట్టడంతో సమీపంలో రహస్యంగా దాగి ఉన్న వివిధ పార్టీలు, సంఘాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున టాంక్ బండ్ మీదికి వచ్చారు. ఆ విధంగా న్యూ డెమొక్రసీ వారు వేసిన “మళ్ళీ పెళ్ళి” ఎత్తుగడ మిలియన్ మార్చ్ అయిన మేరకు విజయవంతం కావడానికి తోడ్పడింది.

అయితే దాదాపు మూడున్నర గంటల సమయం అయ్యేవరకూ ప్రశాంతంగానే మార్చ్ జరిగింది. అప్పటికే కోదండరాం ను విడుదల చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేయడం, లేకుంటే విగ్రహాలను పడగొడతామని ప్రకటించడం జరిగిపోయింది. కోదండరాం గారు కనిపించక పోవడంతో కార్యకర్తలు ఆగ్రహంతో విగ్రహాల ధ్వంసం ప్రారంభించారు. ఈ విషయాన్ని పోలీసులు గమనించారో లేదో తెలియదు గాని వారు అడ్డుకోవడం జరగలేదు. విగ్రహాలపై టి.ఆర్.ఎస్ పార్టీ నాయకుడు కె.టి.ఆర్ కొద్ది నెలల క్రితం వ్యతిరేక ప్రకటన ఇచ్చి ఉన్నారు. ఆ నేపధ్యంలోనే “ఈ విగ్రహాలు మనవి కావు” అనే తప్పుడు అభిప్రాయానికి కార్యకర్తలు వచ్చి ఉండాలి.

వ్యాఖ్యానించండి