- పార్టీ పేరు: వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
- పార్టీని ఆవిర్భవింప జేసినవారు: వై.ఎస్.ఆర్ తనయుడు
- పార్టీ జెండాను ఆవిష్కరించినవారు: వై.ఎస్.ఆర్ సతీమణి విజయమ్మ
- పార్టీలోని ముఖ్య నాయకులు: వై.ఎస్.ఆర్ ద్వారా పదవులు పొందినవారు
- పార్టీ జెండాపై ఉన్నది: వై.ఎస్.ఆర్ బొమ్మ
ఇదీ క్లుప్తంగా తెలుగునాట కొత్తగా ఆవిష్కృతమయిన రాజకీయ పార్టీ ప్రొఫైల్. ఇప్పటి వరకూ భారతదేశంలో పుట్టిన పార్టీలన్నీ తమ జెండాపై దేశ సంస్కృతికి సంబంధించిన గుర్తుగానీ, దేశ ప్రజల జీవన విధానానికి సంబంధించిన గుర్తుగానీ, దేశ చరిత్రను ప్రతిబింబింపజేసే గుర్తు గానీ ఉంచారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తికి సంబంధించిన బొమ్మను రాజకీయ పార్టీకి చెందిన జెండాపై గుర్తుగా ఉంచారు. ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారమంతా ఆ ఒక్క అంశమే తెలియజేస్తున్నది.
వై.ఎస్.ఆర్ తన రాజకీయ జీవితంలో ఎక్కువకాలం కాంగ్రెస్ పార్టీలోనే గడిపాడు. ఏ రాజకీయ నాయకుడైనా అతను పనిచేసే రాజకీయ పార్టీ ఆస్ధిగా ఉంటాడు. అతని అస్ధిత్వం ఆ రాజకీయ పార్టీతోనే ముడిపడి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ రాజకీయ పార్టీ లేకుండా అతని ఉనికి అషాధ్యం. ఇది నాటి మహాత్మగాంధీ, జవహర్ లాల్ నుండి నేటి కిరణ్ కుమార్ దాకా వర్తిస్తుంది. కానీ కొత్తగా ఆవిర్భవించిన పార్టీ, వై.ఎస్.ఆర్ అనే వ్యక్తిని రాజకీయ పార్టీకి అతీతమైన వ్యక్తిగా చిత్రీకరిస్తూ, జీవితంలో తనకంటూ స్వంతగా ప్రాపంచిక దృక్కోణం ఏదీ ప్రకటించని ఆ వ్యక్తి బొమ్మనే జెండాపై గుర్తుగా పెట్టుకుంది. అది వ్యక్తి పార్టీ అనీ, కుటుంబ పార్టీ అనీ చెప్పడానికి అది చాలు.
మానవ జాతి విముక్తికి దారి చూపిన ప్రాపంచిక దృక్పధాన్ని ప్రకటించి, సగం భూమండలానికి అర్ధ శతాబ్దం పాటయినా మరో ప్రపంచాన్ని చవి చూపిన మహా సిద్ధాంతకర్త మార్క్సు బొమ్మను కూడా కమ్యూనిస్టు పార్టీలు తమ జెండాపై గుర్తులుగా పెట్టుకోలేదు. మానవజాతి శ్రమ శక్తికి చిహ్నాలయిన సుత్తీ, కొడవలి నే అవి గుర్తుగా పెట్టుకున్నాయి. కానీ మార్చి 12, 2011 నాడు ఆవిర్భవించిన పార్టీ తనకు తానుగా కనీస సూత్రాలను కూడా (సిద్ధాంతం సంగతి తర్వాత) ప్రతిపాదించని ఒక సాధారణ రాజకీయ నాయకుడి బొమ్మను జెండా గుర్తుగా ప్రకటింది. పైగా ఆ బొమ్మ చుట్టూ జనాన్ని మోసగించడానికి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను (సంస్కరణలు కూడా కాదు) సిద్ధాంతాలుగా ఫోకస్ చేస్తూ రాశారు.
ఓట్ల కోసం, కేవలం ఓట్ల కోసం పాదయాత్ర చేసి, అధికారంలోకి వచ్చాక జలయజ్గ్నం పేరుతో వేలకోట్లు దండుకున్న వ్యక్తి వై.ఎస్.ఆర్. అధికారం లోకి రాక మునుపు లక్షన్నర రూపాయలు ఆదాయపు పన్నుగా కట్టిన వై.ఎస్.ఆర్ కుటుంబం, అక్రమంగా స్వంతం చేసుకున్న బెరైటీస్ గనులు, అక్రమంగా స్వాధీనం చేసుకున్న వేల ఎకరాల భూములు తప్ప మరో ఆదాయ సాధనం లేని వై.ఎస్.ఆర్ కుటుంబం, అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత ఇనుము శుద్ధి ఫ్యాక్టరీ, పత్రిక, టీవీ చానెల్, ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పరోక్షవాటాలు, ఇడుపులపాయకు ఏకంగా కృష్ణా నదినుంచి పెద్ద కాలువ, శత కోటీశ్వరుడు ముఖేష్ అంబానీ ఇంటిని మించిన ఇంద్ర భవనం, రెండు రాష్ట్రాల్లోని ఇనప గనులు ఇంకా లెక్కకు రాని అనేక ఆస్తులకు యజమానిగా మారింది. అక్రమంగా సంపాదించిన ఈ ఆస్తులన్నింటిని సంరక్షించుకోవడానికి ఈ కుటుంబానికి ఓ రాజకీయ పార్టీ కావలసి వచ్చిన కారణంగా వెలసిందే నేటి కొత్త కుటుంబ పార్టీ “వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ”.
దేశంలో అతిపెద్ద, అతి పురాతన రాజకీయ పార్టీలో పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయి సంవత్సరం కూడా నిండని వై.ఎస్.ఆర్ తనయుడికి వై.ఎస్.ఆర్ నిర్వహించిన ముఖ్యమంత్రి కుర్చీని మారు మాట్లాడకుండా ఇవ్వని కారణంతో పుట్టిన పార్టీ, ఈ “వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ”. వై.ఎస్.ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా సహజంగానే ఎం.ఎల్.ఏ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని తానున్న రాజకీయ పార్టీని అభివృద్ధి చేయడానికీ, అధికారంలోకి తేవడానికీ వినియోగించడం విజ్గ్నత కలిగిన రాజకీయ నాయకుల లక్షణం, బాధ్యత. అలా కాకుండా వై.ఎస్.ఆర్ టికెట్లు ఇచ్చినందున ఆ టికెట్లు పొందిన వారంతా వై.ఎస్.ఆర్ తనయుడుగా తనకు ఋణపడి ఉండవలసిందేనంటూ డిమాండ్ చేసిన, కొండొకచో కమాండ్ కూడా చేసిన ఒక రాజకీయ పిల్లకాకి నాయకుడుగా ఆవిర్భవించిన పార్టీ, “వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ”.
ఎనభై శాతం జనాభా వ్యవసాయం పైనే ఆధారపడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంత పెద్ద సంఖ్యలోని ఓటర్లను మభ్యపెట్టడానికి జలయజ్గ్నం పేరుతో ధన యజ్గ్నాన్ని ప్రారంభించినవాడు వై.ఎస్.ఆర్. పొలవరం ప్రాజెక్టు పేరుతో మొదలుపెట్టి, ప్రాజెక్టుకు కనీసం పునాది కూడా వేయకుండానే కేవలం కాంట్రాక్టర్ల వద్దనుండి వచ్చే ముడుపుల కోసం దానికింద కాలవలు తవ్వించిన కాంట్రాక్టర్ల మనిషి వై.ఎస్.ఆర్. నీటి ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో ఒకేసారి మొదలు పెట్టడం కుదరదు కనక ఆ ప్రాజెక్టులపై వచ్చే ముడుపులను ముందే జేబులొ వేసుకోవడానికి కాంట్రాక్టర్లకు వందల కోట్లరూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్సులుగా పందేరం పెట్టిన కాంట్రాక్టర్ల ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. తాను వేల కోట్ల రూపాయలను దిగమింగడానికి వీలుగా, ప్రజలనుండి వ్యతిరేకత రాకుండా ఉండటానికి “సంతృప్త కుటుంబం” అన్న ఓ దిక్కుమాలిన సిద్దాంతం కింద ప్రతి కుటుంబాన్ని ఏదో ఒక సంక్షేమ పధకం లబ్దిదారుగా మార్చడానికీ, తద్వారా మరోసారి ముఖ్యమంత్రిగా ఏలుకోవడానికి పధక రచన చేసుకున్న వ్యక్తి వై.ఎస్.ఆర్. తాను తలపెట్టిన పదుల నీటి ప్రాజెక్టుల్లో తన ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి నీరందించే ప్రాజెక్టుకు తప్ప ఏ ఓక్క ప్రాజెక్టుపైనా దృష్టి పెట్టని వ్యక్తి వై.ఎస్.ఆర్.
ఎటువంటి ప్రజానుకూల దృక్పధం లేకుండా, ఏవిధంగానైనా సంపాదించుకోవాలన్న ఏకైక దృక్పధంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వై.ఎస్.ఆర్ బొమ్మను గుర్తుగా చేసుకున్న వై.ఎస్.ఆర్ పార్టీ, ఆవిర్భావం రోజునే తాను ప్రజలకోసం కాదు, ఓ కుటుంబం కోసం, ఆ కుటుంబ ఆస్తుల పరిరక్షణకోసం, ఆ కుటుంబం చుట్టూ ఈగల్లా ముసిరిన మరింతమంది పుట్టకొక్కుల సంపాదన కోసం పుట్టానని తన జెండా ద్వారా చాటుకుంది. జనులారా, పారాహుషార్!
Very nice heading to the news, and apt criticism on the issue.
Good title