తిరుగుబాటుదారులనుండి ఆయిల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు


Oil refinery in Ras Lanuf

రాస్ లానుఫ్ పట్టణంలోని ఆయిల్ రిఫైనరీ

లిబియా రాజధానికి పశ్చిమంగా 48 కి.మీ దూరంలో ఉన్న జావియా పట్టణాన్ని ఈ వారం మొదట్లో తిరుగుబాటుదారుల నుండి స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు, శనివారం నాటికి ట్రిపోలీకి తూర్పు దిశలో 600 కి.మీ దూరంలో ఉన్న ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ ను స్వాధీనం చేసుకున్నారు. రాస్ లానుఫ్ లో ఉన్న తిరుగుబాటు బలగాలను రాసులానుఫ్ పట్టణ శివార్లనుండి 20 కి.మీ తూర్పుకు నెట్టివేసినట్లుగా తిరుగుబాటుదారుల నాయకులు విలేఖరులకు తెలిపారు. గడ్డాఫీ మంత్రివర్గంలో హోం మంత్రిగా ఉంటూ తిరుగుబాటుదారుల పక్షం చేరిన జనరల్ అబ్దెల్ ఫతా యూనిస్, ఆదివారానికల్లా రాస్ లానుఫ్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించాడు.

ఇదిలా ఉండగా అరబ్ లీగ్ లిబియాపై “నిషిద్ధ గగనతలం” అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు (శనివారం) అత్యవసర సమావేశం జరపనుంది. అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ ‘అమీర్ ముస్సా’ సమావేశానికి ముందు “నిషిద్ధ గగనతలం” అమలుకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపాడు. “నిషిద్ధ గగనతలం అమలు చేయడంలో అరబ్ లీగ్ స్వయంగా చురుకైన పాత్ర నిర్వహించాలి” అని జర్మనీ వార పత్రిక “డెర్ స్పీగెల్” కు తెలిపాడు.

శుక్రవారం సమావేశమైన యూరోపియన్ యూనియన్ ఇంకా ఇతమిద్ధంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. “అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం” అని మాత్రం ప్రకటించింది. ఫ్రాన్సు ఇప్పటికే లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించగా బ్రిటన్ దానికి మద్దతుగా గట్టి ప్రచారం చేస్తున్నది. “నో-ఫ్లై జోన్” అమలు చేయాలని బ్రిటిష్ ప్రధాని కామెరూన్ ఇప్పటికి నాలుగైదు సార్లు ప్రకటించాడు. బ్రిటన్, ఫ్రాన్సులు నో-ఫ్లై జోన్ పై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని సిద్ధం చేస్తున్నామని నాలుగు రోజులనుండి చెబుతున్నాయి.

రాస్ లానుఫ్ పట్టణం కోసం తీవ్రమైన పోరాటం జరిగింది. గడ్డాఫీ బలగాలు అక్కడి ఆయిల్ రిఫైనరీపై బాంబుదాడులు చేశాయి. పట్టణంలో చాలా ఇళ్ళు యుద్ధంలో నేలమట్టామయ్యాయి. పౌరులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. గడ్డాఫీ బలగాలపై పోరుకు స్వయంగా ముందుకు వచ్చిన యువకులు, నిరుద్యోగులు తిరుగుబాటు దళాలుగా ఏర్పడ్డారు. వారితో పాటు సైన్యం నుంచి తిరుగుబాటుదారుల పక్షానికి మారిన వారు ఉన్నారు. స్వయంగా వాలంటీర్లుగా చేరినవారికి యుద్ధానుభవం లేదు. యుద్ధంలో కమాండ్లలకు సత్వరం స్పందించే తెలివిడి లేదు. అదీ కాక గడ్డాఫీకి ఉన్న యుద్ధ విమానాల దాడులకు సమాధానం చెప్పే ఆయుధాలు తిరుగుబాటు దారులకు లేవు. నాలుగైదు రాకెట్ గ్రెనేడ్లను గుదిగుచ్చి విమాన వ్యతిరేక ఆయుధాలుగా వాడుతున్నారు. వాటిద్వారా ఒకటి రెండు విమానాలను ప్రారంభంలో కూల్చినా యుద్ధ వేగాన్ని అందుకునే స్ధితిలో లేరు.

అందుకే తిరుగుబాటుదారులు నో-ఫ్లై జోన్ అమలు చేయాలని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నారు. తద్వారా గడ్డాఫీ విమానాలు ఎగరనీయకుండా చేయవచ్చనీ, ఆనక భూతల యుద్ధంపై కేంద్రీకరించి గడ్డాఫీని తరిమి కొట్టవచ్చని వారు ఆశిస్తున్నారు. కానీ అమెరికా ఐక్యరాజ్యసమితి ఆమోదం కావాలంటోంది. నో-ఫ్లై జోన్ అమలు చేయడమంటే గడ్డాఫీ బలగాలతో యుద్ధం చేయడమేననీ దానికి ఐక్యరాజ్య సమితి అనుమతి కావాలనీ అమెరికా సైన్యాధిపతి చెప్పాడు. రష్యా, చైనా, కతార్, టర్కీ లాంటి దేశాలు సైనిక జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే రెండు యుద్ధాల్లో ఉన్న అమెరికా ప్రపంచ దేశాల పూర్తి ఆమోదం లేకుండా లిబియాలో జోక్యానికి వెనకాడుతోంది.

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నో-ఫ్లై జోన్ అమలును కోరడం తప్ప విదేశీ సైనిక జోక్యాన్ని వ్యతిరేకిస్తున్న తిరుగుబాటుదారులు బేషరుతుగా విదేశీ సైనిక జోక్యాన్ని కోరేదాకా పశ్చిమ దేశాలు ఎదురు చూసే అవకాశాలు లేకపోలేదని కొందరు విశ్లేషిస్తున్నారు.

వ్యాఖ్యానించండి