జపాన్ అణువిద్యుత్ కేంద్రంలో పేలుడు, అణు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం


Epicentre of Japan quake, Fukushima 1 & 2

జపాన్ భూకంప కేంద్రం, ఫుకుషిమా 1, 2 విద్యుత్ కేంద్రాలు -బిబిసి

అప్ డేట్: ఫుకుషిమా అణువిద్యుత్ ప్లాంటు చుట్టూ 10 కి.మీ లోపు ఖాళీ చేయించిన జపాన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిధిని 20 కి.మీ కు పెంచినట్లుగా ప్రభుత్వ ఛీఫ్ కేబినెట్ సెక్రటరీ చెప్పాడు. 6:24  pm ఇండియా టైమ్.

మానవ చరిత్రలో మొదటి సారి, ఇప్పటి వరకు చివరిసారి కూడా అణు  బాంబు ఫలితాన్ని చవిచూసిన జపాన్, శుక్రవారం సంభవించిన అతిపెద్ద భూకంపం ధాటికి మరో అణు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. జపాన్ రాజధాని టోక్యో నగరానికి ఈశాన్య దిక్కుగా 250 కి.మీ దూరంలో ఉన్న ఫుకుషిమా పట్టణంలో ఉన్న రెండు అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకదానిలో పేలుడు సంభవించింది. నలుగురు గాయపడిన ఈ పేలుడు తీవ్రత ఇంకా తెలియ రాలేదు. అణు ప్లాంటు బయట అణు ధార్మికత (రేడియో ఏక్టివిటీ) ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జపాజ్ ప్రధాని దిని తీవ్రత చాలా స్వల్పం అని ప్రకటించినప్పటికీ వివరాలు ఇంకా అందలేదు. ప్లాంటు చుట్టుపక్కల పది కిలోమీటర్లు లోపలు ఉన్న పౌరులను అక్కడినుండి ఖాళీ చేయించారు. బిబిసి విలేఖరి తనను 60 కి.మీ దూరంలోనే అడ్డుకున్నట్లు తెలిపాడు.

శుక్రవారం సంభవించిన భూకంపం, ఆ తర్వాత ముంచెత్తిన సునామీల ధాటికి ఇప్పటివరకు 600 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ సంఖ్య 1300 కు పెరగ వచ్చని భావిస్తున్నారు. జపాన్ ప్రధాని ‘నవోటో కాన్’ ఫుకుషిమా 1, 2 అణువిద్యుత్ ప్లాంట్ల వద్ద “ఎమర్జెన్సీ” ప్రకటించాడు. పేలుడు సంభవించిన ప్లాంటులో యురేనియం ఇంధన కడ్డీలు కరిగిపోయే స్ధితికి చేరుకునాయేమోనని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఎమర్జెన్సీ విద్యుత్ సరఫరా జరిగే సమయంలో పని చేస్తూ ఉండవలసిన కూలింగ్ వ్యవస్ధ ఫుకుషిమా ప్లాంటులోని రియాక్టర్లలో పనిచేయడం మానివేసింది. కూలింగ్ వ్యవస్ధ పనిచేయక పోతే ఇంధన కడ్డీల వేడి అంతకంతకూ పెరుగుతూ పోయి కరగడం ప్రారంభిస్తాయి. కరిగిన అణు ఇంధనం రియాక్టర్ వ్యవస్ధ ఉన్న భవనం లోకి ప్రవహిస్తుంది. అలాంటప్పుడు ప్రమాద తీవ్రత అధికమౌతుంది.

కొంతమంది శాస్త్రవేత్తలు ఇంధనం కరిగినంతనే రియాక్టరు పేలిపోయే పెద్ద ప్రమాదం సంభవించక పోవచ్చనీ, లైట్-వాటర్ రియాక్టర్లు అతిగా వేడి అయినప్పటికీ పేలకపోవడమే అందుకు కారణమని వారు అంటున్నారు. కానీ బ్రిటన్ శాస్త్రవేత్త వాల్ట్ పీటర్సన్, ఈ ప్రమాదం రష్యాలో జరిగిన అతి పెద్ద అణు ప్రమాదం “చెర్నోబిల్ ప్రమాదం”ను తలపిస్తోందని వ్యాఖ్యానించాడు. శుక్రవారం భూకంపం తాకిన ప్రాంతంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలన్నీ అక్కడ ఏర్పరిచిన సాంకేతిక వ్యస్ధల వలన ఆటోమేటిక్ గా పని చేయడం మానివేశాయి. భూకంపాల వలన అణుప్రమాదం జరగకుండా ఆ విధంగా ఆటోమేటిక్ గా ఆగిపోయే వ్యవస్ధను అణు విద్యుత్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తారు. ఫుకుషిమా ప్లాంట్లు భూకంప కేంద్రానికి 40 కి.మీ దూరంలో ఉన్నాయి.

పేలుడు సంభవించిన ఫుకుషిమా 1 ప్లాంటు నుండి పొగలు వెలువడుతున్నాయి. ఆ పొగలు అణు రియాక్టర్లలోని వేడి ఒత్తిడిని తగ్గించడానికి వెలువడిన నీటియావిరిగా జపాన్ అధికారులు చెపుతున్నారు. తాజా ప్రమాదంతో అణు విద్యుత్ కేంద్రాల భద్రత పట్ల మరోసారి అనుమానాలు, చర్చలు చెలరేగే అవకాశం ఉంది. ప్రమాదం తీవ్రమైనదైతే దాని ప్రభావం పసిఫిక్ ను దాటి అమెరికాను తాకే అవకాశం లేకపోలేదని కొందరు భావిస్తున్నారు. పర్యావరణ ఆందోళనకారులు అణు విద్యుత్ వలన వచ్చే ప్రమాదాలపై తాము చేస్తున్న వాదనలు తాజా ప్రమాదంతో మరోసారి ఋజువయ్యాయని అంటున్నారు.

–బిబిసి, రాయిటర్స్ నుండి.

వ్యాఖ్యానించండి