[అప్ డేట్: జపాన్ సునామీలో మరణించిన వారి సంఖ్య: 300 దాటింది]
జపాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతానికి సమీపంలో సమద్ర గర్బాన భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్బాన భూకంపం సంభవించడం వలన అది భారీ సునామీగా పరిణమించి జపాన్ తీరప్రాంతాన్ని ముంచెత్తింది. రిక్టర్ స్కేల్ పై 8.9 గా నమోదైన ఈ భూకంపం, జపాన్ లో 140 సంవత్సరాల క్రితం భూకంపం రికార్డులు నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుండి అత్యంత భారీ భూకంపంగా జపాన్ తెలిపింది. గత వంద సంవత్సారాల్లొ ప్రపంచంలో సంభవించిన భూకంపాల్లో ఇది ఐదవ అతి పెద్దది. 2004 నాటి ఆసియా సునామీని ప్రస్తుత సునామీ గుర్తుకు తెస్తున్నది.
సునామీ అలలు ఇరవై మీటర్ల వరకు ఎగసి పడుతూ తీర ప్రాంత పట్టణాల్లోని ఇళ్ళు, వాహనాలు, బిల్డింగ్ లు, మనుషులు సమస్తాన్ని ముంచెత్తాయి. అధికారిక సమాచారం 60 మంది మరణించారని చెప్పినా, నష్టం భారీగా జరిగి ఉండొచ్చని ఊహిస్తున్నారు.కొన్ని పసిఫిక్ సముద్ర ద్వీప దేశాల సముద్ర మట్టం కంటే సునామీ అల ఎత్తుగా ఉందని రెడ్ క్రాస్ సంస్ధ చెప్పింది. ఫసిఫిక్ తీర దేశాలన్నింటికీ సునామీ ప్రమాదం ఉందని మొదట హెచ్చరించినప్పటికీ, ఆ తర్వాత తైవాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు హెచ్చరికను విరమించారు. ఫుకుషిమా అణు ఇంధన కంపెనీ వద్ద రేడియో ధార్మికత లీక్ అయ్యే ప్రమాదం ఉందని స్ధానిక పత్రికలు తెలిపాయి. 2,000 మందిని అక్కడినుండి తరలించారు.
కొన్ని అణు ఇంధన ప్లాంటులు, ఆయిల్ రిఫైనరీలు మూసివేశారు. ఒక రిఫైనరీకి నిప్పంటుకుంది. దాదాపు 80 బిల్డింగ్ లకు భూకంపం వలన నిప్పంటుకుందని తెలుస్తోంది.తీరప్రాంతంలో నడిచే ఒక రైలు జాడ తెలియడం లేదు. వంద మంది ప్రయాణీకులు ఉన్న ఓ నౌక సముద్రంలో కొట్టుకుపోయింది. టీవీ చిత్రాలలో సముద్రనీరు భవంతులు, ఇళ్ళు, కార్లు మొదలైన వాటిని ముంచెత్తుతూ తోసుకుంటూ వెళ్ళడం కనిపిస్తోంది. ఉత్తర జపాన్ లో 44 లక్షల ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది. ఒక హోటల్ నేలమట్టమైంది. చాలామంది శిధిలాల క్రింద చిక్కుకున్నారు.
భూకంపం, సునామీల దెబ్బకు జపాన్, చైనా, హాంగ్ కాంగ్, తదితర ఆసియా దేశాలతో పాటు పశ్చిమ దేశాల్లో సైతం షేర్ మార్కెట్లు పతనమయ్యాయి. జపాన్ షేర్ మార్కెట్ స్ధిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని సెంట్రల్ బ్యాంకు ప్రతినిధి తెలిపాడు. ఇప్పటికే ప్రతి ద్రవ్యోల్బణం, ఆర్ధిక సంక్షోభం, వృద్ధి స్తంభన సమస్యలతో సతమతమవుతున్న జపాన్ ఆర్ధిక వ్యవస్ధకు ఇది గట్టి దెబ్బ. సహాయ పునరావసాలకు సాయం చేస్తామని చైనా, అమెరికాలు ప్రకటించాయి.
1923 సెప్టెంబరు 1 తేదీనాటి “ది గ్రేట్ కాంటో” భాకంపాన్ని ప్రస్తుత భూకంపం అధిగమించింది. అప్పట్లో అది రిక్టర్ స్కేల్ పై 7.9 తీవ్రతను నమోదు చేసింది. టోక్యో ప్రాంతంలో 1,40,000 మందిని అప్పటి భూకంపం పొట్టన బెట్టుకుంది. 2004 హిందూ మహాసముద్ర సునామీ వలన జరిగిన ఆర్ధిక నష్టం పది బిలియన్ డాలర్లు. 1995 లో సంభవించిన కోబే భూకంపం చరిత్రలో అత్యధిక ఆర్ధిక నష్టం (100 బిలియన్ డాలర్లు) కలగజేసిన భూకంపంగా నమోదైంది.
జపాన్ లో భూకంపాలు సర్వసాధారణం. ప్రపంచంలో 6 కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాలలో ఇరవై శాతం జపాన్ లోనే సంభవిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది.
