గడ్డాఫీ బలగాల పురోగమనం, విదేశీసాయం కోసం తిరుగుబాటుదారుల ఎదురుచూపు


గడ్డాఫీ బలగాలు ప్రతిదాడులను తీవ్రం చేస్తూ మెల్లగా పురోగమిస్తున్నాయి. రాస్ లానుఫ్ ఆయిల్ పట్టణాని స్వాధీనం చేసుకునే వైపుగా కదులుతున్నాయి. మరో ఆయిల్ పట్టణం బ్రెగా సరిహద్దుల్లో బాంబుదాడులు చేశాయి. రాస్ లానుఫ్ లో పోరు తీవ్రంగా జరుగుతోంది. వాయు, సముద్ర మార్గాల్లొ గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ లోని తిరుగుబాటుదారులపై దాదులు చేస్తున్నారు. గడ్డాఫీ బలగాల యుద్ధవిమానాల దాడులను తిరుగుబాటు బలగాలు ఎదుర్కొనలేక పోతున్నాయి.

పశ్చిమ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” ప్రకటించి అమలు చేయాలని తిరుగుబాటుదారులు కోరుతున్నారు. పశ్చిమ దేశాలు తాత్సారం చేయడం పట్ల అసహనంతో ఉన్నారు. నిషిద్ధ గగనతలంతో పాటు సముద్ర మార్గాలను కూడా మూసివేయాలని వారు కోరుతున్నారు. అమెరికా, ఐరోపా దేశాలు ఇప్పటికే ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లలో దెబ్బలు తిని ఉండడంతో లిబియాలో తల దూర్చడానికి వెనకాడుతున్నాయి. అమెరికా ఐక్యరాజ్య సమితి అనుమతి కావాలంటోంది. బ్రిటన్, ఫ్రాన్సులు తీర్మానం తయారు చేసే పనిలో ఉన్నామని చెబుతున్నాయి.

Bombing on way to Ras Lanuf

బిన్ జివాద్ నుండి రాస్ లానుఫ్ వెళ్ళే రోడ్డుపై గడ్డాఫీ దళాల బాంబింగ్

తిరుగుబాటుదారుల్లో విదేశీ సాయం పట్ల విభేదాలు తలెత్తాయి. తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసిన జాతీయ కౌన్సిల్ నాయకుడు ముస్తఫా అబ్దెల్ జలీల్ విదేశీ సాయాన్ని కోరుతుండగా, ఇతరులు విదేశాలు నిషిద్ధగగన తలం వరకే పరిమితమవ్వాలనీ, భూతలంపై అడుగు పెట్టరాదని కోరుతున్నారు. గడ్డాఫీ రాజీ ప్రతిపాదనపై కూడా నాలుగు రోజుల క్రితం వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. “గడ్డాఫీ మూడురోజుల్లోపల దేశం విడిచి వెళ్తే అతని కోసం వెతకబోము” అని జలీల్ ప్రకటిస్తే మరికొందరు గడ్డాఫీని వదిలే ప్రశ్నే లేదని చెప్పారు.

గడ్డాఫీ విమాన బలగాల ముందు తిరుగుబాటుదారులకు సమాధానం ఇచ్చే ఆయుధాలు లేవు. ఆయుధాలు కావాలని కూడా వారు పశ్చిమ దేశాలను కోరుతున్నారు. అయితే గడ్డాఫీ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఆయిల్ చెల్లింపులు అతనికే చెల్లిస్తారు. బిల్లులు చెల్లింపు కోసం అవసరమైన డబ్బు తిరుగుబాటుదారులకు కావాలంటే ఆయిల్ పట్టణాలపై పట్టు నిలుపుకోవాలి. దానితో పాటు అంతర్జాతీయ గుర్తింపు సాధించుకోవాలి. అంతర్జాతీయ గుర్తింపు ఉంటేనే ఆయిల్ చెల్లింపులు తిరుగుబాటు ప్రభుత్వానికి అందుతాయి.

తిరుగుబాటుదారుల ఆధీనంలోని తూర్పు లిబియాలో సరుకుల నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. సరుకుల సరఫరా తగ్గే కొద్దీ అల్లర్లు చెలరేగి తమ ప్రాంతంలో పౌరుల భద్రత తిరుగుబాటు ప్రభుత్వానికి కష్టంగా పరిణమిస్తుంది. రెండు రోజుల క్రితం తిరుగుబాటుదారుల ప్రతినిధులిద్దరు యూరోపియన్ యూనియన్ సమావేశంలో తమను గుర్తించవలసిందిగా కోరారు. ఫ్రాన్సు ఇప్పటికే వారిని గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఇ.యు పార్లమెంటు తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించమని సిఫారసు చేస్తోంది. అరబ్ లీగ్ నిషిద్ద గగనతలం అమలుకు మద్దతు ఇస్తోంది. కాని ఆఫ్రికన్ యూనియన్ విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తోంది.

బుధవారం గడ్డాఫీ బలగాలు స్వాధీనం చేసుకున్న జావియా పట్టణంలో ఒక ప్రాంతాన్ని తిరుగుబాటుదారులు తిరిగి వశం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి విలేఖరులను వెళ్ళకుండా గడ్డాఫీ బలగాలు అడ్డుకోవడంతో ఆ వార్త ధృవపడలేదు.

వ్యాఖ్యానించండి