ముబారక్ దేశం విడిచి పారిపోయినప్పటికీ కైరో నగరం లోని విమోచనా కూడలిలో కొన్ని వందలమంది ఆందోళనకారులు తమ బైఠాయింపును కొనసాగించారు. ముబారక్ నుండి అధికారం చేపట్టిన సైన్యం ప్రజలు డిమాండ్ చేసినట్లుగా ప్రజాస్వామిక సంస్కరణలు చేపట్టే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని వీరు ప్రతిన బూనారు. వీరిని తొలగించడానికి సైన్యం ప్రారంభంలో ప్రయత్నించినప్పటికీ వారు వెళ్ళలేదు.
అయితే మార్చి 9 తేదీన కొన్ని డజన్ల మంది గుర్తు తెలియని వ్యక్తులు విమోచనా కూడలిలో మిగిలి ఉన్న ఆందోళనకారులపైకి రాళ్ళతో దాడి చేశారు. వారిని కూడలి నుండి వెళ్ళమని కేకలు వేశారు. ఘర్షణ నివారించే పేరుతో సైనిక ట్యాంకులు కూడలి వద్దకు వచ్చి ఆందోళనకారుల గుడారాలను బలవంతంగా తొలగించారు. అక్కడ ఉన్న తాత్కాలిక వైద్య శిబిరాన్ని కూల్చి వేశారు. ఆందోళనకారులను బలవంతంగా తొలగించడాన్ని “హ్యూమన్ రైట్స్ వాచ్” సంస్ధ ఖండించింది.
కొద్ది మంది రాళ్ళతో దాడి చేయడం, ఆ తర్వాత సైన్యం ఘర్షణలు జరుగుతున్నాయన్న పేరుతో ఆందోళనకారులను బలవంతంగా తొలగించడం చూస్తే రాళ్ళ దాడి ఒక పధకం ప్రకారం జరిగినట్లుగా అర్ధం అవుతుంది. సైనిక ప్రభుత్వమే ఆందోళనకారులను వెళ్లగొట్టడానికి ఈ పధకం వేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
సైనిక ప్రభుత్వం ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లు అయిన “స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ” ఎత్తివేత, కొత్త రాజ్యాంగ రచన లను ఇంకా అమలు చేయలేదు. ఎమర్జెన్సీ త్వరలో ఎత్తివేస్తామని అంటున్నప్పటికీ అటువంటి ప్రయత్నాలు కనిపించడం లేదు. కొత్త రాజ్యాంగాన్ని రచించే బదులు ఉన్న రాజ్యాంగాన్నే సవరించడానికి సైనిక ప్రభుత్వం పూనుకుంది. సవరణలపై “రిఫరెండం” నిర్వహిస్తామని మాత్రం చెపుతున్నది. ఈ మార్చి నెలలోనే రిఫరెండం జరుగుతుందని ప్రకటించింది.
పాత రాజ్యాంగానికి సవరణలు చేయడమంటే నియంతృత్వ ప్రభుత్వం కాలం నాటి చాలా చట్టాలు మిగిలే ఉంటాయని భావించవచ్చు. దీన్నిబట్టి సైనిక ప్రభుత్వం ప్రవేశపెడతానని అంటున్న ప్రజాస్వామిక సంస్కరణలు ప్రజల డిమాండు మేరకు ఉంటాయా లేదా అన్నది అనుమానమే.
తాము ప్రవేశపెట్టదలచుకున్న అరకొర సంస్కరణలకు విమోచనా కూడలిలో మిగిలి ఉన్న ఆందోళనకారులనుండి విమర్శలు ఎదురు కావొచ్చన్న అంచనాతో వారిని తొలగించడానికి “రాళ్ళ దాడి” ఎత్తుగడను సైనిక ప్రభుత్వం వేసి ఉంటుందనడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సైనిక ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశపేట్టే పాక్షిక ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారం ఏ స్ధాయిలో ఉంటుందో తాజా రాళ్ళ దాడి స్పష్టం చేస్తున్నది.
