తెలంగాణవాదుల మిలియన్ మార్చ్ ఆపటానికి ముందస్తు అరెస్టులు


Kodandaram

తెలంగాణ పొలిటికల్ జె.ఏ.సి ఛైర్మన్ ప్రొ. కోదండరాం

మార్చి 10 తేదీన తెలంగాణ పొలిటికల్ జెఏసి తలపెట్టిన “మిలియన్ మార్చ్” ను అడ్డుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. తెలంగాణ ప్రాంతం అంతటా ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను లక్షమందికి పైగా ముందస్తుగా అరెస్టు చేశారని పొలిటికల్ జె.ఎ.సి ఛైర్మన్ కోదండరాం తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉంటుందనీ, రాజకీయ ఆకాంక్ష తెలపటానికి హైద్రాబాద్ వస్తున్న వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామిక హక్కును హరించడమేననీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియంతలు అధికారంలో ఉండగానే ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయగలిగారనీ, ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే ఇండియాలో ఆ హక్కు లేకుండా చేయడం గర్హనీయమనీ కోదండరాం చెప్పారు. రాజకీయ నిరసన తెలిపితే దానిని శాంతిభద్రతల కోణం లో చూడడం ప్రజాస్వామ్య దేశంలో తగదని ఆయన అన్నారు. ప్రభుత్వాలు పాటించవలసిన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలే గౌరవించకపోతే తెలంగాణా ప్రజలు గౌరవించాలని కోరగలవా అని గద్దర్ ప్రశ్నించారు. మిలియన్ మార్చ్ ను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని కోదండరాం, గద్దర్ లు ఆరోపించారు.

తెలంగాణ ప్రజల మిలియన్ మార్చ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నదో అర్ధం కావడం లేదు. మిలియన్ మార్చ్ ను వాయిదా వేయాలని టి.ఆర్.ఎస్ పార్టీ నాయకుడు కె.సి.ఆర్ జె.ఏ.సి పై తీవ్ర ఒత్తిడి తెచ్చినప్పటికీ జె.ఏ.సి నాయకులు అంగీకరించలేదు. ఈ నేపధ్యంలో మిలియన్ మార్చ్ కు టి.ఆర్.ఎస్ పార్టీ సహకరించే విషయం అనుమానంగా మారించి. వాస్తవానికి మార్చి 10 న మిలియన్ మార్చ్ అని ప్రకటించింది కె.సి.ఆర్ అనీ, ప్రకటించినప్పుడు ఎవరినీ సంప్రతించకుండా ప్రకటించి, విరమించమని కూడా ఆయనే నిర్ణయించడం ఏమిటనీ జె.ఎ.సి భాగస్వామ్య పార్టీలయిన సి.పి.ఐ (ఎం.ఎల్-న్యూడెమొక్రసీ) పార్టీలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. మార్చ్ కు మా మద్దతు లేదని ప్రకటిస్తామని టి.ఆర్.ఎస్ వాళ్ళు హెచ్చరించగా “మేము కూడా మార్చ్ కు టి.ఆర్.ఎస్ సహకరించడం లేదని ప్రకటిస్తాము” అని జె.ఎ.సి భాగస్వామ్య పార్టీలు హెచ్చరించాయని టీవీ ఛానెళ్ళు తెలిపాయి.

పొలిటికల్ జె.ఏ.సి తన చేతుల్లో లేదని కె.సి.ఆర్ కు “మిలియన్ మార్చ్” తో అర్ధమై ఉండాలి. ఆయన వాయిదా వేయమన్నా వాయిదా వేయకపోవడంతో మార్చ్ పైన టి.ఆర్.ఎస్ నాయకుల ప్రకటనలు తగ్గిపోయాయి. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తన ఒక్కడి సొత్తుగా భావించి ఇన్నాళ్ళూ నిర్ణయాలు చేస్తూ వచ్చిన కె.సి.ఆర్ ఈ దెబ్బతో పొలిటికల్ జె.ఎ.సి లో తన స్ధానం ఏమిటో అర్ధం అయి ఉండాలి. ఉద్యమ పార్టీ అంటూనే ఏడెనిమిది సంవత్సరాలు ఏ ఉద్యమం చేయకుండా ఖాళీ ప్రకటనలతో కాలం గడుపుతూ వచ్చిన కే.సి.ఆర్ ఉద్యమం అంటే ఏమిటో అర్ధమై ఉండాలి. ఉద్యమం అంటే ప్రజల చేతుల్లో ఉండాలనీ, ప్రజల ఆకాంక్షల మేరకే ఉద్యమ ఎత్తుగడలు, ఆచరణ ఉండాలనీ తెలంగాణ ప్రాంత రాజకీయ పార్టీలకు తెలిసేలా చేసిన జె.ఏ.సి భాగస్వామ్య పార్టీలు న్యూడెమొక్రసీ, బిజెపి లు బహుదా ప్రశంసనీయులు.

వ్యాఖ్యానించండి