లిబియాలో కొనసా…గుతున్న అంతర్యుద్ధం


 

A Libyan rebel

శతృవు బలాన్ని అంచనా వేస్తున్న లిబియా తిరుగుబాటుదారుడు

లిబియాలో తిరుగుబాటుదారులకు గడ్డాఫీ బలగాలకు మధ్య యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరే స్ధితి కనిపించడం లేదు. ఇరుపక్షాల మధ్య పట్టణాలు చిక్కుతూ, జారుతూ ఉన్నాయి. మూడు లక్షల జనాభా గల మిస్రాటా పట్టణం దగ్గర భీకర పోరు నడుస్తోంది. “బిన్ జావాద్” పట్టణం ఆదివారం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండగా సోమవారం అది గడ్డాఫీ బలగాల ఆధీనంలోకి వచ్చింది. తిరుగుబాటుదారులు చేతిలో ఉన్న మరో పట్టణం స్వాధీనం చేసుకోవడానికి గడ్డాఫీ బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

గడ్డాఫీ బలగాలకు యుద్ధ విమానాలు ఉండడంతో వాటికి ఎదురొడ్డడం తిరుగుబాటుదారులకు కష్టంగా మారినట్లు కనిపిస్తోంది. గడ్డాఫీ బలగాలు ట్రిపోలీకి సమీపంలోనూ, తూర్పు ప్రాంతంలోనూ దాడులు చేస్తున్నాయి. తిరిగి లిబియాను పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం లో ఉన్నాయి. తిరుగుబాటుదారుల కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణంలో ఆయుధాల గిడ్డంగి రెండ్రోజుల క్రితం పేలిపోయింది. ఆయుధ నష్టం ఎంత జరిగిందీ తెలియరాలేదు.

ఐక్యరాజ్య సమితి తరఫున మానవతా సాయం అందించడానికి వీలుగా జోర్డాన్ మాజీ విదేశాంగ మంత్రి అబ్దెలిలా అల్-ఖాతిబ్ ను రాయబారిగా సమితి నియమించింది. ఫిబ్రవరి 17 నుండి ఇప్పటి వరకు లిబియా నుండి 191,748 మంది ఘర్షణలకు భయపడి పారిపోయారు. ఇంకా 400,000 మంది అవకాశం కోసం చూస్తున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. గడ్డాఫీ బలగాలు పౌరులపై కూడా కాల్పులు జరుపుతున్నారని అంతర్జాతీయ పత్రికలు తెలుపుతున్నాయి.

ఇదిలా ఉండగా లిబియా నుండి మిలియన్ల మంది ఆఫ్రికన్లు ఫ్రాన్సు, ఇటలీలకు వలస వెళ్ళడానికి తయారుగా ఉన్నారని గడ్డాఫీ హెచ్చరించాడు. ఐరోపాకు అక్రమ వలసలు జరగకుండా ఇన్ని సంవత్సరాలూ లిబియా ప్రభుత్వం కీలక పాత్ర నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. కనుక ఐరోపా దేశాలు తనకు ఋణపడి ఉన్నాయని గడ్డాఫీ పరోక్షంగా తెలుపుతూ, సాయం చేస్తే తనకే చేయాలని హెచ్చరిస్తున్నాడు.

అయితే తిరుగుబాటుదారులు  మాత్రం విదేశీ జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం తిరుగుబాటుదారులు ఆరుగురు బ్రిటిష్ గూడచారులను అదుపులోకి తీసుకున్నారు. వారు వాస్తవానికి తిరుగుబాటుదారులకు సాయంగా ఉండటానికి వచ్చినప్పటికీ, తిరుగుబాటుదారులు పట్టించుకోలేదు. వారిని ఇక్కడికి రమ్మని ఎవరూ అడగలేదని వారు ఆగ్రహం వ్యక్తం జేసారు. 41 సంవత్సరాల పాటు అధికారం అనుభవించిన గడ్డాఫీ ఇప్పటికైనా లిబియాను ప్రజల కోరిక మేరకు ప్రజలకు అప్పగించడం గడ్డాఫీకి గల ఉత్తమ ప్రత్యామ్నాయం.

వ్యాఖ్యానించండి