ఇండియా ప్రధానికి బ్రిటన్ ప్రధాని వాణిజ్య పాఠాలు


 

cairn and cameron

డేవిడ్ కామెరూన్, కైర్న్ ఇండియా లోగో

బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ భారత దేశ ప్రధాన మంత్రికి విదేశీ వాణిజ్యం, దానికి సంబంధించిన విధాన నిర్ణయాలపై పాఠాలు నేర్పటానికి పూనుకున్నాడు. ఇద్దరి మధ్య వేలకొద్దీ కిలోమీటర్ల దూరం ఉండడంతో కరెస్పాండెన్స్ కోర్సును కామెరూన్ పాఠాలు చెప్పడానికి ఎన్నుకున్నాడు. బ్రిటన్, ఇండియా లకు చెందిన కంపెనీల మధ్య ఇండియాలో ఉన్న “కైర్న్ ఇండియా” కంపెనీ అమ్మటానికి ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీలో భారత ప్రభుత్వ రంగ సంస్ధకు వాటాలుండడంతో ఇక్కడి ప్రభుత్వ అనుమతి అవసరం అయ్యింది. దీనిని త్వరగా తేల్చడం లేదనీ ఇండియాలో ఉన్న “ఊహించడానికి వీలులేని, పారదర్శకం కానటువంటి” వ్యాపార వాతావరణం బ్రిటన్, ఇండియాల మధ్య వాణిజ్య అభివృద్ధికి ఆటంకంగా పరిణమించిందని, దాన్ని సవరించుకోవాలనీ బ్రిటిష ప్రధాని ఇండియా ప్రధానికి క్లాస్ పీకుతూ లేఖ రాశాడు.

బ్రిటన్ కి చెందిన “కైర్న్ ఎనర్జీ” అనే ఆయిల్ కంపెనీకి ఇండియాలో “కైర్న్ ఇండియా” అనే అనుబంధ సంస్ధ ఉంది. దానిలో ఇండియా ప్రభుత్వ రంగ సంస్ధ ఓ.ఎన్.జి.సి కి 30 శాతం వాటా ఉంది.  బ్రిటన్ కు చెందిన వేదాంత రిసోర్సెస్ అనే లోహ గనుల కంపెనీ “కైర్న్ ఇండియా” ను కొనుగోలు చేయడానికి గత సంవత్సరం ఒప్పందం కుదిరింది. కైర్న్ ఇండియా కు రాజస్ధాన్ లో “మంగళ” అనే ఆయిల్ బావి ఉంది. దీనిలో  ఓ.ఎన్.జి.సి కి ముప్ఫై శాతమే వాటా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చెల్లించిన రాయల్టీ మొత్తాన్ని అదే చెల్లిస్తోంది. కంపెనీని అమ్మే ముందు తన ముప్ఫై శాతం వాటా కాక మిగిలిన వాటాపై తాను చెల్లించిన, చెల్లించాల్సిన రాయల్టీ వాటాను తనకి చెల్లించాల్సిందిగా “కైర్న్ ఇండియా” కంపెనీని ఓ.ఎన్.జి.సి ని కోరుతోంది. అందుకు కైర్న్ ఇండియా నిరాకరించింది. అక్కడ చిక్కుముడి పడి విషయం తేలడం లేదు.

వంద శాతం రాయల్టీ తానే చెల్లిస్తానని ఓ.ఎన్.జి.సి ఒరిజినల్ కాంట్రాక్టులో ఒప్పుకుంది. కానీ మధ్యలో కైర్న్ ఇండియాను వేరే ప్రైవేటు కంపెనీకి అమ్ముకునే విషయం కాంట్రాక్టులో లేదు. కనుక రాయల్టీని విడదీసి తనది కాని వాటా రాయల్టీని చెల్లించమని ఓ.ఎన్.జి.సి కోరుతోంది. దానివలన కంపెనీ అమ్మకపు రేటు పడిపోతుందని కనుక చెల్లించనని కైర్న్ ఇండియా అంటోంది. ఆ సమస్య తేలితే అమ్మకపు ఒప్పందానికి ప్రభుత్వ అనుమతి వస్తుంది. కెయిర్న్ ఎనర్జీ తరపున వకాల్తా పుచ్చుకుంటూ కామెరూన్ మనకు “క్లాసు పీకటానికి” సిద్ధమయ్యాడు. త్వరగా తేల్చమని అడగడంలో తప్పులేదు కానీ “తేల్చక పోతే జాగ్రత్త” అని హెచ్చరించడమే అభ్యంతరకర విషయం.

ఇండియా ఇంకా బ్రిటన్ కి వలసగానే ఉందని కామెరూన్ భావిస్తున్నాడేమో తెలియదు. లేదా వారి అహంకారం ఇంకా కొనసాగుతున్నదేమో? వాణిజ్య సంబంధాలు సమాన ప్రాతిపదిక మీద ఉండాలి కానీ బెదిరింపు ధోరణితో ఉండేది వాణిజ్యం ఎలా అవుతుంది? భారత గడ్డమీద వాణిజ్యం నిమిత్తమే అడుగుపెట్టి దేశాన్ని కబళించిన బ్రిటిష్ వాడు అరవై ఏళ్ళు దాటినా పాత బుద్ధి వదలడం లేదులాగుంది. అయినా మన బంగారం మంచిది కాదేమో లేండి. ఇండియా రిపబ్లిక్ అయ్యాక కూడా, అంత పెద్ద మొత్తంలో వనరులను ఉంచుకుని కూడా ఆయిల్ ని బైటికి తీయమని బైటవాడ్ని పిలవడం ఎందుకు? పిలిచింది గాక వాడు చెల్లించాల్సిన రాయితీని కూడా మేమే చెల్లిస్తాం అని రాసుకోవడం ఎందుకు?

వ్యాఖ్యానించండి