లిబియా తిరుగుబాటుదారుల పురోగమనం, చర్చలకు ససేమిరా


 

Rebels celebrate in brega

బ్రెగాను తిరిగి కైవశం చేసుకున్న ఆనందంలో లిబియా తిరుగుబాటుదారులు

లిబియా తిరుగుబాటుదారులు పురోగమిస్తున్నారు. గడ్డాఫీ బలగాలకూ, తిరుగుబాటుదారులకూ మధ్య యుద్దం మెల్లగా ఊపందుకుంటోంది. రాజధాని ట్రిపోలిలో శుక్రవారం నాదు మధ్యాహ్న ప్రార్ధనల అనంతరం ప్రదర్శనకు తిరుగుబాటుదారులు పధక రచన చేశారు. ప్రదర్శన జరగకుండా అడ్డుకోవడానికి గడ్డాఫీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజధానీ ట్రిపోలీకి తూర్పున గల శివారు ప్రాంతం “టజౌరా” లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. విదేశీ విలేఖరులను వారున్న హోటల్ నుండి బైటికి రాకుండా గడ్డాఫీ బలగాలు అడ్దుకున్నాయి. అల్-ఖైదా టెర్రరిస్టులనుండి రక్షించడానికే హోటల్ నుండి వెళ్ళనీయడం లేదని వారు చెప్తున్నారు.

41 సంవత్సరాల గడ్డాఫీ పాలన పట్ల లిబియా ప్రజలు తీవ్ర వ్యతిరేకతో ఉన్నారు. లిబియన్లు నన్ను ఇష్టపడుతున్నారు అని గడ్డాఫీ చెబుతున్నాప్పటికీ లిబియా వ్యాపితంగా చెలరేగిన తిరుగుబాటు ఆయన మాటల్లో వాస్తవం లేదని తెలుపుతున్నాయి. వెనిజులా అధ్యక్షుడు హ్యుగో ఛావెజ్ చేసిన శాంతి ప్రతిపాదనను మొదట తిరస్కరించినప్పటికీ గడ్డాఫీ దానిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైనిక జోక్యం నిరోధించేందుకు ఉద్దేశించిన ఛావెజ్ ప్రతిపాదన పూర్తి సారాంశం వెల్లడికాలేదు. అరబ్ లీగ్ కూడా ఛావెజ్ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. గడ్డాఫీ రాజీనామా చేసి దేశం వదిలి ప్రవాసం వెళ్తే తప్ప చర్చలు జరపబోమని తిరుగుబాటుదారులు తెగేసి చెప్పారు.

టజౌరాలో ఉన్న పెద్ద మసీదు వద్ద తిరుగుబాటుదారులు ప్రదర్శన తీసే అవకాశం ఉండడంతో గడ్డాఫీ బలగాలు అక్కడ సమీపంలో చెక్ పోస్టు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు. సీక్రెట్ పోలీసులు నివాస ప్రాంతాల్లో, రోడ్డుపైన కార్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడ్డాఫీ బలగాలు వీధుల నిండా కాపలా కాస్తున్నాయి. తాము తీసుకెళ్ళే ప్రాంతాలకు మాత్రమే వెళితే హోటల్ బైటికి వెళ్ళటానికి అనుమతిస్తామని గడ్డాఫీ బలగాలు విదేశీ విలేఖరులతో చెప్పినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి మసీదులను మూసివేసి చాలామందిని అరెస్టు చేసినట్లు ధృవీకరించబడని వార్తల ద్వారా తెలుస్తున్నది. ట్రిపోలీ వీధుల్లో కూడా గడ్డాఫీ బలగాలు కార్లలో తిరుగుతూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులనుండి అనేకమందిని అరెస్టు చేయటం, కొంతమంది అదృశ్యం కావటం, నిర్బంధంలోకి తీసుకోవటం జరిగినట్లు వార్తలు తెలుపుతున్నాయి.

మరో ఆయిల్ పట్టణమయిన “రాస్ లానుఫ్” ను వశం చేసుకోవటానికి తిరుగుబాటుదారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తిరుగుబాటుదారులు చెబుతున్నారు. తిరుగుబాటుదారుల బలగాల్లో పౌర మిలిటెంట్లు, గడ్డాఫీ సైన్యం నుండి తిరుగుబాటుదారూలతో కలిసినవారు ప్రధానంగా ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటున్నారు. వీరివద్ద మెషిన్ గన్లు, రాకెట్ల ద్వారా ప్రయోగించే గ్రెనేడ్ లు, భుజం మీద ఉంచుకుని పేల్చే రాకెట్లు, ట్యాంకులు మొదలయిన ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలన్నీ గడ్డాఫీ ప్రభుత్వ గిడ్డంగుల నుండి స్వాధీనం చేసుకున్నవే.

గడ్డాఫీ తరపున మాలి దేశంనుండి వచ్చిన కిరాయి సైనికులు తిరుగుబాటుదారులతో తలపడుతున్నారు. మాలి లోని తురగ్ తెగ నుండి ఏడొందల మంది కిరాయి సైనికులు గురువారమే గడ్దాఫీ బలగాలతొ కలిసినట్లు మాలి ప్రభుత్వాధికారి తెలిపినట్లుగా బిబిసి రిపోర్టు చేసింది. పశ్చిమ భాగంలో తిరుగుబాటుదారుల స్వాధీనంలో ఉన్న ప్రధాన పట్టణాలు జావియా, మిస్రాటా లపై కూడా గడ్డాఫీ బలగాలు గురువారం దాడులు జరిపినప్పటికీ తిరుగుబాటుదారులు తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. గడ్డాఫీ బలగాలు విమానాలతో దాడులు చేస్తున్నందున ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలొ లిబియా గగనతలాన్ని నిషిద్ద గగనతలం గా ప్రకటించి అమలు చేయాలని తిరుగుబాటుదారులు కోరుతున్నారు. మాజీ న్యాయశాఖ మంత్రి ముస్తాఫా అబ్దెల్-జలీల్ నాయకత్వంలోని జాతీయ లిబియన్ కౌన్సిల్ కూడా విదేశీ జోక్యాన్ని కోరాడు. అయితే తిరుగుబాటుదారులు నిషిద్ధ గగనతలాన్ని అమలు చేయటానికి ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని కోరుతున్నారు గానీ ఇతరత్రా జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు.

వ్యాఖ్యానించండి