తిరుగుబాటు మొదలయ్యాక మొట్టమొదటిసారి గడ్డాఫీ తిరుగుబాటు ప్రాంతాలపై తన సైన్యంపై దాడి చేశాడు. ఈ దాడిని తిప్పికొట్టామని తిరుగుబాటుదారులు చెబుతున్నారు. కానీ తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్న బెంఘానీ పట్టణం సమీపంలోని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గడ్డాఫీ వర్గాలు చెబుతున్నాయి. తిరుగుబాటు వర్గాలు కూడా మొదట గడ్డాఫీ పక్షం దాడి విజయవంతం అయిందని చెప్పినప్పటికీ ఆ తర్వాత వారిని మళ్ళీ వెనక్కి తరిమినట్లు ప్రకటించారు. ఆయిల్ ఉత్పత్తిని బైటికి సరఫరా చేయటానికి ప్రధాన టెర్మినల్ గా ఉన్న మార్సా ఎల్-బ్రెగా వరకు గల తూర్పు ప్రాంతంపై తిరుగుబాటుదారులు పట్టు కలిగి ఉన్నారు.
బెంఘాజీ పట్టణంలోని డాక్టర్లు, లాయర్లు, కార్మికులు, వివిధ ఉద్యోగులు, తిరుగుబాటు సైనికులు అంతా కలిసి “ఫిబ్రవరి 17 కూటమి” గా ఏర్పడి తమ ఆధీనంలోని ప్రాంతాన్ని సంయుక్తంగా పరిపాలించుకుంటున్నారు. మార్సా ఎల్-బ్రెగా ప్రాంతం దాటి మరి కొన్ని కిలోమీటర్ల వరకు గల తూర్పు ప్రాంతంపై వీరి పాలన కొనసాగుతున్నది. బుధవారం బ్రెగా ప్రాంతంపై దాడి చేసి దాన్ని ఆక్రమించుకున్నట్లు ప్రచారం చేసి తిరుగుబాటుదారులపై మానసిక ఆధిపత్యం సాధించడానికి గడ్డాఫీ ప్రయత్నిస్తున్నాడని కూటమి ప్రతినిధి ముస్తఫా ఘెరియానీ రాయిటర్స్ విలేఖరికి తెలిపాడు.
“వ్యూహాత్మక ప్రాంతాలలో విమాన దాడులు జరపడానికి మేము బహుశా విదేశీ సాయాన్ని కోరవచ్చు” అనికూడా అతను తెలిపాడు. సమీపంలో ఉన్న ‘అజ్దాబియా’ పట్టణంలో పోరు సాగుతున్నదనీ ప్రస్తుతమ్ అక్కడ దాడి చేసి పారిపోవడమనే వ్యూహం అమలు చేస్తున్నామని ముస్తఫా తెలియజేసాడు.
ఎల్-బ్రెగా ప్రాంతంపై దాడిలో పదిహేడు మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో కనీసం నాలుగొందల ట్యాంకులు పాల్గొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారి దాడిని తిప్పికొట్టినట్లు వస్తున్న వార్తలో నిజం లేదని గడ్డాఫి ప్రభుత్వ ప్రతినిధి చెప్పాడు. ఎప్పటిలాగే ఇది తప్పుడు వార్త అని అతనన్నాడు. తిరుగుబాటు మొదలయ్యాక ఇంత పెద్ద ఎతున గడ్డాఫీ సైన్యాలు దాడి చేయటం ఇదే ప్రధమం.
లిబియా వ్యాపితంగా గిరిజన తెగల నాయకులు, పౌర అధికారులు, మిలట్రీ అధికారులు, మిలట్రీ యూనిట్లు గడ్డాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటులో చేరిపోయారు. అయితే లిబియాలో మిలట్రీని మొదటినుండి గడ్డాఫీ బలహీనంగా ఉంచాడు. మిలట్రీ ఎటువంటి కుట్రకు పాల్పడే అవకాశం లేకుండా ఈ జాగ్రత్త తీసుకున్నాడు. మిలట్రీ కాకుండా గడ్డాఫికి మాత్రమే విధేయంగా ఉండే ఎలైట్ గార్డును ఏర్పరుచుకున్నాడు. గిరిజన తెగలు కూడా అధికారం అటూ ఇటూ మొగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. లిబియాలో గడ్డాఫీ ఆధిపత్యం ఇంకా గణనీయంగా మిగిలి ఉన్నట్లయితే త్వరలో తీవ్రమైన అంతర్యుద్ధం తప్పక పోవచ్చు.
