ఫ్రాన్సు అతి తెలివి – ట్యునీషియా మచ్చ లిబియాకు సహాయంతో మటుమాయం?


ఫ్రాన్స్ మాజీ విదేశీ మంత్రి అల్లియట్-మేరీ

కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రస్తుతం గడ్డాఫీ వ్యతిరేకుల ప్రభావంలో ఉన్న లిబియా తూర్పు ప్రాంతానికి సహాయం చేసే పనిలో ఫ్రాన్స్ ఉంది. డాక్టర్లు, నర్సులు, మందులతో రెండు విమానాలు లిబియాలో తిరుగుబాటు దారులకు కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణానికి బయలుదేరినట్లు ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఫ్రాంకోయిస్ ఫిల్లాన్ ప్రకటించాడు. ట్యునీషియాలో ప్రజల తిరుగుబాటుతో మాజీ అధ్యక్షుడు జైన్ ఎల్-అబిదైన్ బెన్ ఆలీ పదవీచ్యుతుడయిన విషయం తెలిసిందే. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చెలరేగుతున్న రోజుల్లో ఉద్యమాన్ని అణచివేయడానికి సహాయం అందించటానికి ఫ్రాన్సు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలనుండి బయట పడటానికే ఈ సాయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రజాస్వామిక సంస్కరణల కోసం ఉద్యమించిన వారికి సహాయం చేయడం ద్వారా తాను ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి ఫ్రాన్సు ఈ సాయానికి పూనుకుందని వార్తా సంస్ధలు సైతం విశ్లేషిస్తున్నాయి. ఫ్రాన్సు విదేశాంగ మంత్రి “మిఛెలే అల్లియట్-మేరీ” ట్యునీషియాలో విప్లవం కీలక దశలో ఉన్న రోజుల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు ట్యునీషియా వెళ్ళింది. అంతే కాకుండా అధ్యక్షుడు బెన్ ఆలీకి అత్యంత సన్నిహితుడయిన వ్యాపారస్తుడు అజీజ్ మిలెద్ కి చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని రెండు సార్లు వినియోగించుకుని తీవ్ర విమర్శలకు గురయ్యింది. మొదటి సారి ప్రయాణంలో విమర్శలు వచ్చినప్పటికీ రెండో సారి కూడా ప్రయాణించడంతో ఫ్రాన్సులో ఆమె రాజీనామాకు ఒత్తిడి వచ్చింది. అంతే కాకుండా విహార యాత్రలో అజీజ్ మిలెద్ తో ఆమె తల్లిదండ్రులు ఒక ప్రాపర్టీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆ తర్వాత బైట పడింది. నియంతృత్వ పాలకులతొ లోతైన సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్పష్టం కావడంతో అల్లియట్-మేరీ మంగళవారం రాజీనామా చేయక తప్పలేదు.

కాని ప్రధాన మంత్రి ఫిల్లాన్ మాత్రం విదేశాంగ మంత్రి నైతిక కారణాలతో కాకుండా రాజకీయ కారణల వలన రాజీనామా చేసిందని వెనకేసుకొచ్చాడు. ఫ్రాన్సు తన తరపున మాట్లాడే గొంతును కోల్పోయిందని ఆమె రాజీనామా పై వ్యాఖ్యానించాడు. ఆమె ఏ తప్పూ చేయలేదు అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. నిజానికి బెన్-ఆలీ ప్రభుత్వానికి ఇరవై సంవత్సరాలు సహాయ సహకారాలు అందించింది ఫ్రాన్సు ప్రభుత్వమే తప్ప ఒక్క మంత్రి కాదు. నియంతృత్వంతోనైనా సరే అల్లర్లు, రాజకీయ సమ్మెలు, తిరుగుబాట్లు మొదలైన వాటిని సమర్ధవంతంగా అణచివేయగల వారినే పశ్చిమ సామ్రాజ్య వాదులు ఇష్టపడతారు. రాజకీయ అలజడులు లేకపోవడానికి “రాజకీయ స్ధిరత్వం” అని పేరు పెడతారు. ఇప్పటికీ పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు బెన్ ఆలీని ఉద్దేశిస్తూ “నియంత అయినప్పటికీ, దేశానికి సుస్ధిరత అందించిన ఘనత అతనికి దక్కుతుంది” అని ముక్తాయిస్తున్నాయి.

ఫ్రాన్సు నియంతృత్వ ప్రభుత్వాలకు సహాయం అందించిందని ఋజువులతో సహా బైట పడడంతో దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. దానిలో భాగమే విదేశాంగ మంత్రి రాజీనామా. ఆ తర్వాత అర్జెంటుగా లిబియాకు మానవతా సాయం పేరుతొ వైద్య సామాగ్రి, డాక్టర్లు, నర్సులు పంపడానికి సిద్దమయ్యింది. లిబియాలో విముక్తి చెందిన ప్రాంతాలకు ఇపుడు పంపుతున్న రెండు విమానాల సహాయం ప్రారంభం మాత్రమే అని ఫ్రాన్సు ప్రధాని వెల్లడించాడు. అయితే, అల్లియట్-మేరీ స్ధానంలో రానున్న అలెన్ జుప్పీ గతంలో ప్రధాన మంత్రిగా ఉండగా ప్రభుత్వ సొమ్మును సొంతానికి వాడుకున్న నేరానికి పాల్పడినట్లు కోర్టు ధృవీకరించింది.

పశ్చిమ దేశాల ప్రజాస్వామ్య బోధనల సారాంశం ఇదే.

వ్యాఖ్యానించండి