అమెరికాకి ఈ జన్మలో బుద్ధిరాదు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలొ చావుతప్పి కన్ను లొట్టబోయినా ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. తగుదునమ్మా అంటూ పిలవని పేరంటానికి బయలుదేరింది. లిబియా ప్రాంతంలో తమ యుద్ధ పరికరాలు, సైనికులను లిబియాపై చర్యకు అనుకూలంగా ఉండేలా మొహరిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. నిర్ణయాలు తీసుకున్న వెంటనే చర్య ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. నాటో తదితర మిత్రులతో చర్చలు జరుపుతున్నామనీ, గడ్డాఫీ సైన్యానికి చెందిన విమానాలు తిరగకుండా ఉండటానికి లిబియా గగన తలాన్ని “నిషిద్ధ గగనతలం” గా ప్రకటించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని ఐక్యరాజ్య సమితి లోని అమెరికా రాయబారి సుసాజ్ రైస్ విలేఖరుల సమావేశంలో ప్రకటించింది.
అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) హిల్లరీ క్లింటన్ “అమెరికా సైనికులను మానవతా సాయం కోసం ఉపయోగించుకోవచ్చునని ప్రకటించింది. ఈ ప్రకటన బహుశా ఫ్రాన్సును ఉద్దేశించిందో లేదో తెలియ రాలేదు. ఫ్రాన్సు లిబియాలోని విముక్త ప్రాంతాలకు మానవతా సాయం పంపిస్తున్నానని ప్రకటించింది. ఇది ఒక రకంగా అమెరికా, ఫ్రాన్సుల మధ్య భవిష్యత్ లిబియాలో ప్రాభవం సంపాదించడానికి జరుగుతున్న పోటీలా కనిపిస్తోంది. అడగకుండానే ఫ్రాన్సు సహాయం పంపించడం, అడగకుండానే అమెరికా “నో-ఫ్లై జోన్” అమలు చేస్తాననడం ఖచ్చితంగా లిబియా ప్రజల కోసమయితే కాదు. కానీ గడ్డాఫీని వెళ్ళగొట్టటంలో రెండు దేశాలూ సహకరించుకుంటాయనడంలో అనుమానం లేదు.
తిరుగుబాటుదారులపై గడ్డాఫీ సైన్యాలు విమానాలనుండి దాడులు చేస్తున్నందున దాన్ని నివారించడానికి పశ్చిమ దేశాలు “నిషిద్ధ గగనతలం” అమలు చేస్తామంటున్నాయి. కానీ “డెమొక్రసీ నౌ” చానెల్ తరపున లిబియన్లను ఉద్రిక్తతల నడుమ ఇంటర్వ్యూ చేసిన ఛానెల్ విలేఖరి “అంజలీ కామత్” ప్రకారం లిబియాలో తిరుగుబాటులో పాల్గొంటున్న ప్రజలెవరూ ఇతర దేశాలనుండి సాయం కోరడం లేదు. పైగా వ్యతిరేస్తున్నారు కూడా. మా దేశం భవిష్యత్తు మేం చూసుకుంటాం మాకు ఎవరి సాయమూ అవసరమూ అవసరం లేదని తెలిపారు. అంజలీ కామత్ లిబియాలోని ఉద్యమ ప్రాంతాల్లో రోజుల తరబడి గడిపి, వివిధ వర్గాల ప్రజలను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసి వారి స్పందనను రాబట్టింది. పౌరులు, ఉద్యమకారులు కలిసి సిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని ఏ విధంగా పాలన నడుపుతున్నదీ వివరాలు సేకరించింది. కార్మికులు, గృహస్ధులు, మహిళలు, యువకులు, డాక్టర్లు తదితర వర్గాల వారిని కలిసి వారంతా గడ్డాఫీని ఎంత వ్యతిరేస్తున్నదీ తెలిపింది. గడ్డాఫీపై వ్యతిరేకతతో పాటు విదేశీ జోక్యాన్ని కూడా వారు వ్యతిరేస్తున్న సంగతిని రిపోర్టు చేసింది.
లిబియా ప్రాంతంలో ఇప్పటికే అమెరికాకు చాలినన్ని యుద్ధ బలగాలు ఉన్నాయి. దగ్గర్లోనే ఉన్న ఎర్ర సముద్రంలో “యు.ఎస్.ఎస్ ఎంటర్ ప్రైజ్” అనే విమాన వాహక యుద్ధ నౌక ఉంది. దానితో పాటు “కీయర్ సార్జ్” అనే నౌక కూడా ఎర్ర సముద్రంలో ఉంది. ఇది నీళ్ళల్లోనే కాకుండా నేల పైన కూడ ప్రయాడించే సామర్ధ్యమున్న నౌక. దీనిలో యుద్ధ హెలికాప్టర్లు, 2,000 మంది మెరైన్ సైనికులు ఎప్పుడూ ఉంటారు. ఇవి కాకుండా దగ్గర్లో ఉన్న ఇటలీలో అమెరికా సైనిక స్ధావరాలున్నాయి. ఇటలీలోని సిగొనెల్లా, సిసిలీ నగరాల్లో అమెరికా వాయు, నౌకా యుద్ధ స్ధావరాల నుండి గంటలో లిబియాకు చేరుకోవచ్చు.
లిబియాలో గడ్డాఫీ ఉన్నంత వరకూ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలూ పరిశీలిస్తాము అని హిల్లరీ క్లింటన్ తెలిపింది. గడ్డాఫీ పాలించే అర్హత కోల్పోయాడనీ, లిబియా ప్రజలు గడ్డాఫీని వెళ్ళిపొమ్మని డిమాండ్ చేస్తున్నారనీ ఆమె గుర్తు చేసింది. కానీ హిల్లరీ గమనించాల్సిన విషయం ఏంటంటే లిబియన్లు గడ్డాఫీని వెళ్ళిపొమ్మన్నారే తప్ప అమెరికాను రమ్మనలేదు. ప్రపంచ పోలీసుగా అవసాన దశలో ఉన్నప్పటికీ అమెరికా దుస్సాహసాలకు పోవడం మానడం లేదు.
